సంచలన చిత్రంగా కొందరు.. వివాదాస్పద చిత్రంగా మరికొందరు.. మొత్తంగా ది కేరళ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేరళకు చెందిన ముగ్గురు యువతులను ట్రాప్ చేసి ముస్లింలోకి మార్చేందుకు జరిగిన స్టోరీని.. కేరళలో మిస్ అయిన 32 వేల మందికి ఎలా అపాదిస్తారన్న డిబేట్ ఇప్పుడు జరుగుతోంది. ఇలాంటి వేళలోనే తెర మీదకు వచ్చింది భోపాల్ ఉగ్ర కుట్ర. భోపాల్ లో అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో ఉంటున్న ఐదుగురిని ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది.
వీరిని విచారించిన సందర్భంలో వెలుగు చూసిన విషయాలు సంచలనంగా మారటమేకాదు.. షాకిచ్చేలా మారాయి. ది కేరళ స్టోరీలో చూపించిన విధంగానే.. ఇటీవల అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో పలువురు గతంలో హిందువులు అన్న కొత్త విషయం బయటకు వచ్చింది. వీరిని క్రమపద్దతిలో మతం మారేలా చేసిన వైనం ఇప్పుడు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. వీరికి సంబంధించిన వివరాల్ని తెలుసుకున్నప్పుడు అప్రయత్నంగా ది కేరళ స్టోరీసినిమా గుర్తుకు రాక మానదు.
అదుపులోకి తీసుకున్నవారిలో దాదాపు ఎనిమిది మంది హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వారు కావటం గమనార్హం. వారిలో మహ్మద్ సలీం పూర్వ రంగంలో సౌరభ్ రాజ్ వైద్య అయితే.. అబ్దుల్ రెహ్మాన్ గతంలో దేవి నారాయణ్ పాండా. ఇక.. మహ్మద్ అబ్బాస్ అలీ అయితే బెను కుమార్. వీరు కాకుండా మరో ఐదుగురు ఉన్నారు. వీరి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఉగ్ర అనుమానితులంతా కొన్నేళ్ల క్రితం ఇస్లాంలోకి మారినట్లుగా గుర్తించారు. వీరిలో భోపాల్ కు చెందిన ఇద్దరు ఉన్నారు.
వారు.. జిమ్ ట్రైనర్ యాసిర్ ఖాన్ అయితే.. మరొకరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న మహ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య. ఇతను రిటైర్డు ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ అశోక్ జైన్ కుమారుడిగా మధ్యప్రదేశ్ ఏటీఎస్ చెబుతోంది. మహ్మద్ సలీం హైదరాబాద్ లోని ప్రముఖ రాజకీయ నేతకు చెందిన ఫార్మసీ కాలేజీలో సీనియర్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. తమ కొడుకు సలీంగా ఎలా మారింది చెప్పుకొచ్చారు వారి తల్లిదండ్రులు.
‘మాకు ఐదుగురు సంతానం. వారిలో సౌరభ్ ఒక్కడే కొడుకు. అతడ్ని ఇస్లాంలోకి మారాలని డాక్టర్ కమల్ బ్రెయిన్ వాష్ చేశారు. వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు డాక్టర్ జాకీర్ నాయక్ వీడియోల్ని నా కొడుక్కి చూపించారు. వాడిని ఇస్లాంలోకి మార్చేలా చేశారు. మేం ఇస్లాంకు వ్యతిరేకం కాదు. అయితే దేశానికి.. మన మతాన్ని.. కల్చర్ కు వ్యతిరేకంగా బ్రెయిన్ వాష్ చేసే వారిని వ్యతిరేకిస్తాం’ అని చెప్పారు. 2010 నుంచి తన కొడుకు హిందు మతం గురించి కల్చర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టినట్లు చెప్పారు.
‘ఒకసారి ప్రవక్త విశ్వాసాల్ని వ్యతిరేకించానని నాపై దాడి చేస్తానని బెదిరించాడు. 2011-2012లో భోపాల్ లో జరిగిన ఒక ప్రోగ్రాంలో బారాబంకికి చెందిన ఒక ఇస్లాం మత పెద్ద నా కొడుకు.. కోడలితో కలిమాను చదివించాడు. వారిని ఇస్లాంలోకి మార్చినట్లు ప్రకటించాడు. నా కొడుకు అదే ఏడాది సిరియాకు వెళ్లాలని ప్లాన్ చేశాడు. రాఖీ రోజున అక్కచెల్లెళ్లతో రాఖీ కట్టించుకోవటం మానేశాడు. అతను ఇతర మత సూత్రాల్ని అనుసరించటం.. మా మతం.. విశ్వాసాల్ని అగౌరపర్చటంతో అతన్నిఇల్లు వదిలి వెళ్లిపోమని చెప్పాం.
అంతకు మించి మాకు మరో మార్గం లేకపోయింది. ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత సౌరభ్ సలీమ్ గా మారిపోయాడు. కొన్నాళ్లు భోపాల్ లో ఉండి తర్వాత హైదరాబాద్ షిఫ్టు అయ్యాడు’ అని అతని గురించి అతని తల్లిదండ్రులు వెల్లడించారు. ఇదంతా వింటే.. ది కేరళ స్టోరీ సినిమా చటుక్కున గుర్తు రాక మానదు.
వడ్డి వెంకట రామస్వామి