-వైసీపీ నేతలు చెప్పిన మాట వినాల్సిందే
-సచివాలయ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి హెచ్చరిక
పింఛన్లు, ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే మా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగానే ఇవ్వాలి. అలా కాకుండా మీరే ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. అంటూ సచివాలయ సిబ్బందిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి హెచ్చరించారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మీరు యువకులు. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చారు. మీకు అనుభవం లేదు. ప్రజాప్రతినిధులను, నాయకులను గౌరవించండి. త్వరలోనే మీకు బదిలీలు ఉంటాయి.
ప్రజాప్రతినిధులకు, నాయకులకు గౌరవం ఇస్తేనే మీరు ఇక్కడ ఉంటారు. మా వాళ్లను లెక్క చేయకపోతే సరిహద్దులకు పోతారు. మీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని నాగార్జునరెడ్డి వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 లాంటి కార్యక్రమాల నిర్వహణ సమయంలో ప్రజాప్రతినిధులను, నాయకులను పిలిచి అవసరమైతే సన్మానాలు చేయాలని సూచించారు.