-ఫలించిన రాహుల్ రాయబారం
-డికె కు డిప్యూటీ సీఎం, నచ్చిన శాఖలు
-ఆయన సూచించిన వారికి మంత్రి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు
-లోక్‌సభ ఎన్నికలకు సిద్దరామయ్య
-ఆ తర్వాత డికెకు సీఎం పదవి
-రాహుల్ రాజీ ఫార్ములాకు డికె ఓకె
-సిద్దరామయ్య సీఎం పదవికి రూట్ క్లియర్
కర్నాటక కాంగ్రెస్‌లో కిస్సా కుర్సీకా లడాయి ఓ కొలిక్కి వచ్చింది. పార్టీ యువనేత రాహుల్‌గాంధీ రంగంలోకి దిగడంతో పంచాయితీ పరిష్కారమయింది. అప్పటివరకూ ససేమిరా అని, మొండిపట్టుదలతో ఉన్న డికె శివకుమార్ దానితో మెట్టుదిగాల్సివచ్చింది.
లోక్‌సభ ఎన్నికల్లో సిద్దరామయ్యను పోటీ చేయించిన తర్వాత, సీఎం పదవి మీకే ఇస్తామని డికెకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఆలోగా, డికెకు డిప్యూటీ సీఎంతోపాటు, ఆయనకు నచ్చిన కీలక శాఖలు, శివకుమార్ సూచించిన ఎమ్మెల్యేలకు మంత్రి, కార్పొరేషన్ చైర్మన్ పదవులివ్వాలన్న డికె షరతులకు, కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలంటూ పంతం పట్టిన డీకే శివకుమార్ వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగింపుతో పంతం వీడారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని స్వాగతించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ సంప్రదింపులు సఫలం అయ్యాయి. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
ఈ విషయంలో డీకే శివకుమార్ అసంతృప్తిని చల్లార్చేందుకు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ఫోన్ లో, స్వయంగా డీకేతో పలుమార్లు మాట్లాడారు. పార్టీలో ఓ వ్యక్తిగా కాకుండా తమ కుటుంబంలో ఒకరిగా చూస్తున్నానని, పెద్దన్నగా భావిస్తున్నానని డీకేతో రాహుల్ చెప్పినట్లు తెలిసింది. పార్టీలో డీకేకు అన్యాయం జరగదని, ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.
పార్టీ కోసం ఆయన పడిన కష్టం తమకు తెలుసని, ఈ ఒక్కసారికి తమ మాట వినాలని డీకే శివకుమార్ ను రాహుల్ గాంధీ కోరారు. డీకేతో దాదాపు గంట పాటు రాహుల్ గాంధీ ఏకాంతంగా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ పదే పదే రిక్వెస్ట్ చేయడంతో డీకే శివకుమార్ తన పంతాన్ని వీడినట్లు తెలుస్తోంది. తాజా రాజీ ఫార్ములాతో కర్నాటకలో కాంగ్రెస్ కౌన్‌బనేగా సీఎం సినిమాకు తెరపడినట్లే.