– అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
-ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరిగిన న్యాయపోరాటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయం సాధించిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు.
అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ఈ విజయం పేదల విజయం అని ఆయన అభివర్ణించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని తేదేపా చేసిన కుట్రలు కుతంత్రాలు ఫలించలేదని అన్నారు.
గత ప్రభుత్వంలో 5 లక్షల ధర నిర్ణయించే టిడ్కో ఇళ్లు నేడు రూపాయికే
గత ప్రభుత్వం రూ. 5లక్షలు ధర నిర్ణయించే టిడ్కో ఇళ్లు నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయికే ఇస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కేటగిరీల్లో టిడ్కో ఇళ్లు కేటాయిస్తున్నట్లు, ఉచితంగా ఇవ్వడం లేదని, 5 లక్షల రూపాయలు చెల్లించాలని పచ్చ పార్టీ ప్రచారం చేసిన దాంట్లో వాస్తవం లేదని అన్నారు. జగనన్న ఇళ్లు రెండు కేటగిరీల్లో అందిస్తున్నారని గ్రామాల్లో 653.4 చదరపు అడుగులు అనగా 1.5 సెంటు, పట్టణాల్లో 435.6 చదరపు అడుగులు అనగా 1 సెంటు విస్తీర్ణంలో పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. అదే అసలు నిజమని అన్నారు.
పాదచారుల రహదారి భద్రతా ప్రణాళిక అమలు చేయాలి
2021 సంవత్సరంలో 29200 మంది పాదచారులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, 60వేల మంది పాదచారులు గాయపడ్డారని నివేదికలు వెల్లడించాయని విజయసాయి రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రతి పదిమందిలో ఒకరు పాదచారి అన్న గణాంకాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని, ఆందోళన కల్గిస్తున్నాయని అన్నారు. పాదచారుల భద్రత కోసం తయారు చేసిన రహదారి భద్రతా ప్రణాళిక అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. రహదారులు డిజైన్ చేయడంలో, నిర్మించడంలో, అమలు చేయడంలో ప్రతి స్థాయిలో పాదచారులకు భద్రతా పరమైన సదుపాయాలు కల్పించాలని తద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు.
ఉపరాష్ట్రపతి, మాజీ ప్రధానిలకు జన్మదిన శుభాకాంక్షలు
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్, మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యులు, దేవగౌడలకు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఈ ప్రముఖులు జన్మదినం సందర్బంగా విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. భగవంతుడు చక్కటి ఆరోగ్యం, సంతోషంతో దేశానికి మరింత కాలం సేవలందించేలా దీవించాలని కోరుకుంటున్నానని అన్నారు.