ఎంపీ విజయసాయిరెడ్డి
సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2019 మే నెల 23న ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగునాట మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించింది. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్లకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ కు 151 సీట్లు లభించాయి.
నాటి పాలకపక్షం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు దక్కాయి. వైఎస్సార్సీపీకి 49.95 శాతం ఓట్లు రాగా, టీడీపీ కేవలం 39.26 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక రాజకీయపక్షం పది శాతం ఓట్ల తేడాతో ఓడిపోవడం మరిచిపోలేని పరిణామం. మరుసటి రోజు మే 24న కొత్త శాసనసభ ఏర్పాటయింది. 2019 మార్చి 10న ఎన్నికల తేదీల ప్రకటనతో ఎన్నికల సంఘం ప్రారంభించిన ఈ ఎన్నికల ప్రక్రియ మే 24న కొత్త అసెంబ్లీ ఏర్పాటయినట్టు ప్రకటించడంతో ముగిసింది.
ఏపీ చరిత్రలో ఒక పాలకపార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడం, అంతకు ముందు (2014 మే) స్వల్ప శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రతిపక్షం భారీ విజయం నమోదుచేసుకోవడం అదే మొదటిసారి. 2019 ఏప్రిల్–మే ఎన్నికలకు ఏడాది ముందు నాటికే అంటే 2018 వేసవి కాలం నాటికి అప్పటి తెలుగుదేశం సర్కారు కనీవినీ ఎరగని ప్రజావ్యతిరేకత ఎదుర్కొంది. ఓటర్ల జాబితాలను అనుకూలంగా మార్చుకోవడానికి చేసిన అక్రమాలు వెలుగులోకి రావడం వంటి అనేక అననుకూల పరిణామాలు టీడీపీని చుట్టుముట్టాయి.
అన్ని సర్వేలూ పాలకపక్షం ఓడిపోతుందని జోస్యం పలికాయి. అప్పటికి నాలుగేళ్లు కొత్త రాష్ట్రాన్ని పరిపాలించిన టీడీపీ ఎంత గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుందంటే–2019 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా జాతీయపక్షం బీజేపీతో ఉన్న స్నేహబంధాన్ని తెంపుకుంది. కేంద్రంలో నాలుగేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీ ఒక్కసారిగా బీజేపీకి రాజకీయ శత్రువుగా మారింది.
ఐదేళ్ల క్రితం బెంగళూరు కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ నేత!
మారిన టీడీపీ రాజకీయ వైఖరికి అనుగుణంగా ఈ పార్టీ నేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరిగ్గా ఐదేళ్ల క్రితం 2018 మే 23న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. జేడీఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్, ఇంకా ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఆయన గ్రూపు ఫోటోలో కనిపించారు.
ఇలాంటి రాజకీయ జిమిక్కులు ఏవీ కూడా ఏడాది తర్వాత 2019 వేసవిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని ఆపలేకపోయాయి. నాలుగేళ్ల నాటి ఏపీ పాలకపక్షం దీన స్థితి, ప్రజలు భరించలేని ఇబ్బందులతో పోల్చితే రాష్ట్రంలో ఇప్పటి పాలకపక్షం వైఎస్సార్సీపీ ప్రభుత్వ జనరంజక పాలన నిరాటంకంగా సాగుతోంది. సాధారణంగా తెలుగునాట నాలుగేళ్లకే ఏ పాలకపక్షంపైనైనా ప్రజల్లో వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
అలాంటిది సంక్షోభ సమయాల్లో, మామూలు పరిస్థితుల్లో కూడా జన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకుంటూ వారి ఆశలకు, అంచనాలకు అనుగుణంగా వైఎస్పార్సీపీ సర్కారు నడుస్తూ అత్యధిక ప్రజామోదంతో ముందుకు సాగుతోంది. ఏడాదిలో 2024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఎన్నికల్లో మరో చరిత్రాత్మక విజయం నమోదు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఉత్సాహంతో ఉరకలు పెడుతోంది. నిరంతరం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా అన్ని రకాల బడుగు, బలహీన వర్గాలకు అనేక నగదు బదిలీ పథకాలతో బాసటగా నిలుస్తూ ఏపీ ప్రభుత్వం నడుస్తోంది.
జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఏపీలో వచ్చిన సానుకూల మార్పులు ప్రజలను వైఎస్సార్సీపీని వరుసగా రెండోసారి గెలిపించాలనే దిశగా నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జనంలో ఇంతటి పాలకపక్ష లేదా రాష్ట్ర ప్రభుత్వ అనుకూల మానసిక స్థితి ఉండడం ఇదే మొదటిసారి.