సివిల్ సర్వీసెస్‌ 2022 ఫలితాలలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

16

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్ సర్వీసెస్‌ 2022 తుది ఫలితాలను విడుదల చేసింది. మంగళవారం ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 933 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది.

ఇందులో భాగంగా ర్యాంకులను ప్రకటించింది. వీటిలో ఐఏఎస్‌ సర్వీసెస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38 మందిని, ఐపీఎస్‌కు 200 మందిని ఎంపిక చేశారు. అలాగే సెంట్రల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌-Aకు 473 మందిని, గ్రూప్‌-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్‌-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022గా ఉంది.

యూపీఎస్‌స్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఇషితా కిషోర్‌ టాపర్‌గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇక ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జీవీఎస్‌ పవన్‌ దత్తా 22వ ర్యాంకు సాధించగా.. శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంతకుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200 ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 217, బల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌.చేతనారెడ్డి 346, శృతి యారగట్టి 362, యప్పలపల్లి సుషకమిత 384, సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426 ర్యాంకులతో సత్తా చాటారు.

ఇదిలా ఉంటే ఈ ఫలితాల్లో మహిళలు చరిత్ర సృష్టించారు. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం విశేషం. తొలి ర్యాంక్ ను ఇషిత కిషోర్ సాధించగా, రెండో ర్యాంక్ ను గరిమా లోహియా, మూడో ర్యాంక్ ను ఉమా హారతి, నాలుగో ర్యాంక్ ను స్మృతి మిశ్రా సాధించారు.