– నేడో రేపో కేసీఆర్ నిర్ణయం
– నేరుగా హరీష్, సంతోష్‌పై ఆరోపణలు కురిపించిన కవిత
– కేసీఆర్‌కు అవినీతి మరక అంటించింది వారిద్దరేనని ఆరోపణ
– తన లేఖల లీకులపై గతంలో కవిత లొల్లి
– ఇప్పటివరకూ ఆమె ఆరోపణలు అన్న కేటీఆర్ మీదేనన్న భావన
– తాజా ఆరోపణలతో బావమీదేనని తేలిన వైనం
– చాలాకాలం నుంచి పార్టీకి దూరంగా కవిత
– సొంత బ్యానర్‌పై ప్రెస్మీట్లు
– సింగరేణిలోనూ సొంత దారి
– హరీష్‌పై ఆరోపణలను ఖండిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
– జలదృశ్యం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న హరీష్‌ను అవమానిస్తారా?
– ఎన్నో జటిల సమస్యలు పరిష్కరించిన ట్రబుల్షూటర్గా పేరు
– నిరంతరం పార్టీ కార్యక్రమాల్లోనే హరీష్
– కేసీఆర్ అందుబాటులో లేని రోజుల్లోనే పూర్తి సమయం పార్టీకి కేటాయించిన హరీష్
– తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్ తర్వాత హరీష్‌దే కీలకపాత్ర
– అలాంటి హరీష్‌పై ఆరోపణలేమిటని సీనియర్ల ఫైర్
– కవితపై వేటుకు ఇప్పటికే లేటయిందని నేతల అసంతృప్తి
– గతంలో ధిక్కరించిన నేతలపై వేటు వేసిన కేసీఆర్
– ఇప్పుడు బిడ్డ తిరగబడుతున్నా మౌనం ఎందుకంటూ ప్రశ్నల వర్షం
– పార్టీ మీడియా గ్రూపునుంచి కవిత పీఆర్ఓ నెంబరు తొలగింపు
– నేడో రేపో బీఆర్ఎస్ నుంచి వేటు?
– కవిత కోరుకుంటున్నదీ అదేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్యపోరులో కొత్త మలుపు లాంటి కుదుపు. ఇన్నాళ్లూ లీకు లేఖలతో గులాబీలో గుబులు పుట్టించిన కేసీఆర్ బిడ్డ కవిత ఎట్టకేలకూ, తనకు సొంత పార్టీలో శత్రువులెవరో బయటపెట్టారు. సొంత బంధువులయిన హరీష్‌రావు, సంతోష్‌రావుతోపాటు..పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పి, ‘శ్రమదానం’ చేసిన మెగా కృష్ణారెడ్డిలే తన తండ్రికి అవినీతి మరక అంటించారని, ఆరోపణల వర్షం కురిపించటం పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
అయితే గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ తన అన్న కేటీఆర్నుద్దేశించినవేనని చాలామంది భావించారు. తాను ఎవరి నాయకత్వాన్ని అంగీకరించనన్న ఆమె వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చాయి. కానీ ఇప్పుడు తన బావ హరీష్‌తోపాటు, బంధువయిన సంతోష్‌రావు తన శత్రువులని ఆమె తేల్చేశారు.
‘‘మా నాన్నకు అవినీతి మకిలి అంటించింది హరీష్‌రావు, సంతోష్‌రావు, మెగా కృష్ణారెడ్డిలే. కాళేశ్వరం అవినీతికి హరీష్‌దే బాధ్యత. అందుకే ఆయనకు రెండోసారి ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు. రేవంత్‌రెడ్డితో వాళ్లకు ఒప్పందాలున్నాయి. కేసీఆర్‌పైనే సీబీఐ వేస్తే ఇక పార్టీ ఉంటే ఏంటి? పోతే ఏంటి? నేను ఇండిపెండెంట్‌గానే ఉంటా’’నంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్లో భూకంపం పుట్టించిన కవిత వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు సోషల్‌మీడియా వేదికగా విరుచుపడుతున్నారు.
దానితో జరగబోయే నష్టం గ్రహించిన కేసీఆర్, తన బిడ్డపై వేటు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ మేరకు ఒకటి రెండు రోజుల్లో ప్రకటన రావచ్చని పార్టీ వర్గాల సమాచారం.
అసలు కవిత ధిక్కారధోరణిపై ఎప్పుడో వేటు పడాల్సిందని, గతంలో ఇలాగే పార్టీని ధిక్కరించిన నరేంద్ర, విజయశాంతి, ఈటల వంటి అగ్రనేతలపై నిర్దయగా వేటు వేసిన కేసీఆర్.. తన బిడ్డ విషయంలో మాత్రం, ఇప్పటివరకూ సంయమనం పాటించడానికి కారణం.. బంధుప్రీతి మాత్రమేనన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు.
ప్రధానంగా పార్టీ అనుమతి లేకుండా తన తెలంగాణ జాగృతి ద్వారా కార్యకలాపాలు నిర్వహించడం, వాటిలో పార్టీ జెండాలు లేకపోవడం, లేఖల లీక్‌పై పార్టీ అనుమతి లేకుండానే మీడియాతో మాట్లాడటం, సింగరేణిలో పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించడం పార్టీ సీనియర్లకు రుచించడం లేదు. ఇలాంటి కార్యకలాపాలు మిగిలిన ఏ నాయకుడయినా నిర్వహిస్తే, వారిపై వెంటనే వేటు వేసే కేసీఆర్.. తన బిడ్డ విషయంలో మాత్రం పక్షపాతం చూపించడంపై, పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది.
అయితే ఆమె కేసీఆర్ బిడ్డ కావడం, క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న కవితకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఎక్కడ తమ ఉనికి గల్లంతవుతుందేమోనన్న భయంతో సీనియర్లు సైతం నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు స్వయంగా కవితనే తాను ఇకపై స్వతంత్రంగా ఉంటానని వెల్లడించినందున, ఇప్పుడు కూడా ఆమెపై వేటు వేయకపోతే తప్పుడు సంకేతాలు పోతాయని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రధానంగా జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో సంయమనం వహించి, ఆచితూచి మాట్లాడాల్సిన కవిత.. ఆంధ్రావారిపై పలుసార్లు చేసిన విమర్శలు, ఆంధ్రా బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు సెటిలర్లు ఎక్కువగా ఉండే జూబ్లిహిల్స్ నియోజవర్గ ఉప ఎన్నికలో పార్టీ విజయానికి అవరోధంగా పరిణమించాయి. ఇది సెటిలర్ల ఓట్లపై ఆధారపడి గెలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంకటంగా పరిణమించినా, బాసు బిడ్డ కావడంతో ఎవరికి వారు మౌన ంగా ఉండి, తమ ఆవేదనను సన్నిహితులతో పంచుకున్న పరిస్థితి.
ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిసర నియోజకవర్గాల్లోని సెటిలర్లు.. అంతపెద్ద కాంగ్రెస్-రేవంత్ గాలిలోనూ, బీఆర్ఎస్కే ఓట్లు వేసి గెలిపించారు. కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ సర్కారు వైఫల్యాలపై దునుమాడుతున్న బీఆర్ఎస్, ఇలాంటి క్లిష్ట సమయంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ప్రతిష్టాత్మకం. అక్కడ ఓడిపోతే పార్టీ పతన సంకేతాలు మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయి. ఆ విషయం కూడా తెలియని కవిత.. ఆంధ్రా సెటిలర్లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందిపెట్టాయని పార్టీ సీనియర్లు అప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను దునుమాడి, అన్ని వర్గాలను దరిచేర్చుకోవలసిన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కవిత అందుకు భిన్నంగా.. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నట్లు, ఉద్యమ స్వభావంతో మాట్లాడటం వల్ల అంతిమంగా నష్టపోయేది పార్టీయేనని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కేటీఆర్, హరీష్‌రావు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతితోపాటు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోయిన వర్గాల కోసం పోరాడి.. ఆ వర్గాల ఓటు బ్యాంకును కూడగట్టే పనిలో ఉన్నారు.
కానీ కవిత వ్యవహార శైలి మాత్రం.. ఇంకా ఉద్యమ నాయకురాలిగానే ఉండటం వల్ల పార్టీకి నష్టమేనంటున్నారు. పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని ఎందుకు తొలగించారు? ఏపీలో అధ్యక్షుడిని ఎందుకు నియమించారంటూ, కాంగ్రెస్-బీజే పీ వేస్తున్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో, ఇంకా ఉద్యమ స్వభావం ప్రదర్శించడం అది బూమెరాంగవుతుందని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘‘మొన్నటి వరకూ మనది ఉద్యమపార్టీ. ఇకపై మన ది ఫక్తు రాజకీయ పార్టీ’’ అని స్వయంగా కేసీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కాగా కవిత-కేటీఆర్ పార్టీలో ప్రవేశించని రోజుల్లోనే కేసీఆర్ వెంట నడిచిన హరీష్‌రావుపై కవిత ఆరోపణలు చేయడాన్ని పార్టీలోని మెజారిటీ క్యాడర్ సహించలేకపోతున్నారు. ఉద్యమకాలంలో కేసీఆర్ తర్వాత, తెలంగాణ ప్రజలు మెచ్చింది హరీష్‌రావును మాత్రమేనని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కేసీఆర్-హరీష్‌రావు రాష్ట్రవ్యాప్తంగా చెరో దిక్కు పర్యటించి తెలంగాణ నినాదానికి ఊపిరిపోశారు. అసలు పార్టీ తీసుకునే నిర్ణయాల్లో హరీష్‌రావుదే కీలకపాత్ర అన్నది బహిరంగమే.
రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వానికి అత్తెసరు మెజారిటీ ఉన్న సందర్భంలో ప్రభుత్వ బలోపేతానికి.. టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడి, వారిని టీఆర్ఎస్లో చేర్పించిన హరీష్‌పై కవిత ఆరోపణలు చేయడం ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఎవరినీ కలవని క్రమంలో, పార్టీ నేతలు హరీష్రావుతోనే తమ సమస్యలు చెప్పే సంస్కృతి అప్పటినుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉందని గుర్తు చేస్తున్నారు.
పార్టీ స్ధాపించిన నాటి నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తు, అందరికీ అందుబాటులో ఉండే హరీష్‌పై ఆరోపణలు చేస్తే, పార్టీ క్యాడర్ నమ్మదని సీనియర్లు చెబుతున్నారు.
‘‘ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్ తర్వాత అంతా అభిమానించేది, పార్టీలో ఫాలోయింగ్ ఉన్నది హరీష్రావుకేనన్నది నిష్ఠుర నిజం. ఆయనకున్న సహనం, ఓర్పు, వ్యూహం మా పార్టీలో ఎవరికి ఉందో చెప్పండి? పార్టీ పెట్టినప్పుడు, ఉద్యమ సమయంలో ఆయనెంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన చొరవ తీసుకుంటేనే ఈరోజు ఇంతమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారు. అలాంటి నాయకుడిపై కవిత ఆరోపణలు చేస్తే ఎవరూ అంగీకరించరు. స్వాగతించరు. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. పైగా తాను ఇకపై స్వతంత్రంగా ఉంటానని కవిత స్వయంగా ప్రకటించినందున, స్వతంత్రంగా వ్యవహరించే వారిపై వేటు వేయడం కేసీఆర్ సారుకూ అనివార్యమవుతుంది’’ అని పార్టీ స్థాపన నుంచి, కేసీఆర్‌తో ఉన్న ఓ మాజీ మంత్రి స్పష్టం చేశారు.
కవిత కోరుకుంటున్నదీ వేటేనా?
కాగా రోగి-వైద్యుడి చందంగా.. గత కొంతకాలం నుంచి పార్టీ విధానానికి భిన్నంగా వ్యవహరిస్తున్న కవిత కూడా, పార్టీ నుంచి బయటకు రావాలన్న ఆలోచనతో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరిగింది. అందుకే కొంతకాలం నుంచి, తన తెలంగాణ జాగృతి పేరుతో మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సింగరేణిలో ఆమె పూర్తిగా పార్టీ లైన్ దాటడంతో, అక్కడ మాజీ మంత్రిని నియమించడం ఆమెకు ఝలక్ ఇచ్చినట్లయింది.
ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం.. సీబీఐ విచారణకు ఆదేశించడం ఆమెకు కలసివచ్చిన ట్లు కనిపించింది. దానితో కాళేశ్వరం అవినీతికి హరీష్ కారణమన్న ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. దానితో తొలుత ఆమె కార్యక్రమాలు పోస్టు చేసే పార్టీ సోషల్‌మీడియా గ్రూపుల నుంచి కవితకు సంబంధించిన నెంబర్లు తొలగించడం ప్రస్తావనార్హం. పార్టీ వాట్సాప్ గ్రూపులతో సహా, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి కవిత పీఏ శరత్‌ను, పీఆర్వో నవీన్‌ను తొలగించాలని ఆదేశాలు అందాయి. వెంటనే శరత్‌ను పార్టీ మీడియా వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించారు.
కవిత పార్టీలో చేరిన నాటి నుంచి శరత్ వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నారు. ఇటీవలే నవీన్ రావు పీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరిని పార్టీ మీడియా వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించారు. దీన్నిబట్టి కవితపై వేటు ఖాయమని స్పష్టమవుతోంది. పార్టీ తనపై వేటు వేస్తే.. సొంత పార్టీ స్థాపించాలన్నది ఆమె ఆలోచన అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.