-లగచర్లలో భూసేకరణకు బ్రేక్
– రైతుల వ్యతిరేకతతో వెనక్కితగ్గిన రేవంత్ సర్కార్
– సీఎం రేవంత్ సోదరులపై ఆరోపణలు
– బలవంతంగా రైతుల నుంచి భూసేకరణ
– ఢిల్లీదాకా వెళ్లిన ఆరోపణలు
– కలెక్టర్‌పై రైతుల తిరుగుబాటు
– డజన్ల సంఖ్యలో అరెస్టులు
– జాతీయ స్థాయికి లగచర్ల పంచాయితీ
– దానితో భూసేకరణ నిలిపివేయాలని రాహుల్ ఆదేశం
– నిలిపివేస్తూ రేవంత్ సర్కారు ఉత్తర్వు
– ఫలించిన బీఆర్‌ఎస్ పోరాటం
– లగచర్లలో బీఆర్‌ఎస్‌దే పైచేయి
– కేటీఆర్ వ్యూహం సక్సెస్
– మరి రైతులను విడుదల చేస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకా లగచర్లలో ఫార్మావిలేజ్ కోసం నిర్వహిస్తున్న భూసేకరణను కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకూ నిలిపివేసింది. ఈ అంశంలో మరింత ప్రతిష్ఠకు పోకుండా వెనక్కితగ్గింది. భూసేకరణ వ్యవహారం.. కలెక్టర్‌పై రైతుల దాడి.. రైతుల అరెస్టులు, జైళ్లతో రైతుల్లో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పోగయింది. లగచర్ల సెగ ఢిల్లీని తాకటంతో, నష్టనివారణకు దిగిన కాంగ్రెస్ నాయకత్వం.. దిద్దుబాటు దిగింది. రంగంలోకి దిగిన రాహుల్‌గాంధీ, భూసేకరణ నిలిపివేయాలని ఆదేశించడంతో, ఆ మేర కు ఉత్తర్వులు ఇవ్వడం ప్రభుత్వానికి అనివార్యంగా మారింది. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్ పోరాటానికి విజయంగా చెప్పక తప్పదు.
లగచర్లలో ఫార్మావిలేజ్ కోసం భూసేకరణ వ్యవహారం, తెలంగాణలో మరో రైతు ఉద్యమానికి కారణమయింది. బలవంతంగా భూసేకరణ చేయడం, మార్కెట్ రేటుకు సగానికంటే తక్కువ ఇస్తామనడం, ఈ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు రంగప్రవేశం చేసి, భూములు ఇవ్వని రైతులను బెదిరించారన్న ఆరోపణలు జాతీయ స్థాయిలో రచ్చగా మారాయి. అక్కడికి వార్తా సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై రేవంత్ సోదరుల అనచరులు దాడి చేయటం జాతీయ స్థాయి దృష్టికి ఆకర్షించింది.
ఈ క్రమంలో అక్కడికి వచ్చిన జిల్లా కలె క్టర్‌పై, బాధిత రైతులు చేతులు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడి.. అది డజన్ల సంఖ్యలో రైతుల అరెస్టు-జైళ్ల వరకూ దారితీసింది. ఇప్పటికీ అమాయక రైతులు జైలులో మగ్గుతున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసి, జైలుకు తరలించిన వైనం.. రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమయింది. బలవంతపు భూ సేకరణ, రైతులను జైళ్లకు పంపించడం వంటి అంశాలు రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేక భావనకు దారితీసింది. అదే సమయంలో బాధిత రైతులకు బీఆర్‌ఎస్ బాసటగా నిలవడంతో, సహజంగా రైతులు బీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపేందుకు కారణమయింది.
దీనిని రేవంత్ సర్కారుపై.. రాజకీయ అస్త్రంగా సంధించిన బీఆర్‌ఎస్ వ్యూహం సక్సె అయింది. బాధిత రైతులను బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి తీసుకువెళ్లి జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు తీసుకువెళ్లారు. జాతీయ మీడియాలో సైతం.. సీఎం రేవ ంత్‌రెడ్డి సోదరులు తమ భూములు లాక్కుంటున్నారని చెప్పడం కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందిగా పరిణమించింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన, రేవంత్ సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్.. రేవంత్ సోదరులు దాష్టీకానికి ఆవేదన చెంది, పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. రేవంత్ సోదరులు తమ ఇంటికి దారి మూసి, అడ్డుగా గోడ కట్టడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు.. మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్‌లో స్పష్టం చేయడం, కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కలిగించింది. ఈ పరిణామం కూడా రైతులను, కాంగ్రెస్‌కు దూరం చేసేలా మారింది. దీనితో దిద్దుబాటు కోసం రంగంలోకి దిగిన రాహుల్‌గాంధీ.. లగచర్లలో భూసేకరణ నిలిపివేయాలని ఆదేశించడం, ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం చకాచకా జరిగిపోయింది.
ఈ మొత్తం పరిణామాల్లో బీఆర్‌ఎస్ రాజకీయంగా పైచేయి సాధించినట్టయింది. ఒకరకంగా రేవంత్ సర్కారుపై, బీఆర్‌ఎస్ నైతికంగా విజయం సాధించింది. కీలకమైన భూసేకరణను ప్రభుత్వం, తనంతట తానే ఆపివేయడమంటే.. విపక్షం ఏ స్థాయిలో పోరాడిందో స్పష్టమవుతూనే ఉంది. రైతులను ఢిల్లీవరకూ తీసుకువెళ్లి, లగచర్ల అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో కేటీఆర్ వ్యూహరచన ఫలించినట్లు, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం స్పష్టం చేస్తోంది.
ఒకరకంగా అటు రేవంత్‌రెడ్డికి ఈ పరిణామం, నైతికంగా నష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లగచర్ల భూసేకరణను లౌక్యంగా పూర్తి చే యాల్సింది బదులు, ప్రతిష్ఠగా తీసుకుని సోదరులను రంగంలోకి దింపడం వల్ల.. రేవంత్ వ్యక్తిగతంగా కూడా దెబ్బతిన్నారని విశ్లేషిస్తున్నారు. చివరకు కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకిదిగి, భూసేకరణను నిలిపివేయడమంటే.. అది రేవంత్‌కు రాజకీయంగా కూడా ఎదురుదెబ్బేనంటున్నారు. ఈ పని అప్పుడే చేసి ఉంటే, సొంత నియోజకవర్గంలో రేవంత్ ప్రతిష్ఠ నిలబడి ఉండేదంటున్నారు.
అయితే ఇప్పటికయినా కాంగ్రెస్ నాయకత్వం దిద్దుబాటుకు దిగి, భూసేకరణను ఉపసహరించుకోవడం మంచి నిర్ణయమేనంటున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మరింత ఎక్కువ రైతు ఆగ్రహానికి గురికాకుండా అడ్డుకున్నట్లయింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. అయితే జైలులో నిర్బధించిన రైతులను విడుదల చేస్తేనే, ప్రభుత్వ ఉత్తర్వులకు సార్ధకత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.