12 రోజులు…. 153.3 కిలోమీటర్లు
5 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 జిల్లాల్లో కొనసాగిన పాదయాత్ర
నేటితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిసమాప్తమైన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర
పోరాటాల జిల్లాలో పాదయాత్రకు అడుగడుగునా నీరా‘జనం’
బండి సంజయ్ ను కలిసి సమస్యలను మొర పెట్టుకున్న వివిధ వర్గాల ప్రజలు
మూసీ, ఫ్లోరైడ్, చేనేత కార్మికుల, వీఆర్ఏ, బిల్ కలెక్టర్ల, కారోబార్ల సమస్యలను వెలుగులోకి తెచ్చిన బండి సంజయ్.
గత 2 విడతలతో కలిపి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్న పాదయాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తయింది. మొత్తం 12 రోజులపాటు ఉమ్మడి జిల్లాలో బండి సంజయ్ 153.3 కిలోమీటర్లు నడిచారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. పాదయాత్రలో భాగంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలను కవర్ చేశారు. అత్యధిక శాతం యాదాద్రి జిల్లాలోనే పాదయాత్ర కొనసాగింది.
యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆశీస్సులతో ఆరంభమై….
ఆగస్టు 2న యాదాద్రి భువనగిరి జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత నుండి ప్రారంభమైన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో బండ కొత్తపల్లి గ్రామం వరకు చేరుకుంది. ఈ 12 రోజుల పాదయాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో నడిచారు. 5 గ్రామ సభలు, 10 పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించారు.
వెలుగులోకి అనేక ప్రజా సమస్యలు
పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ దాదాపు అన్ని వర్గాల ప్రజలను కలిశారు. టీచర్లు, జర్నలిస్టులు, ఉద్యోగులు, నిరుద్యోగులతోపాటు వివిధ కుల సంఘల నాయకులను కలిశారు. వ్యవసాయ కూలీలుతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మూసీవల్ల ఆ ప్రాంత ప్రజలు పడుతున్న వెతలను, పోచంపల్లి నేతన్నల దుస్థితిని, ఉమ్మడి జిల్లా వీఆర్ఏ, బిల్ కలెక్టర్లు, కారోబార్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ద్రుష్టికి తెచ్చారు. మూసీ సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయడంతో మూసీ వాటర్ బాటిళ్లను ప్రగతి భవన్ కు పోస్ట్ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ద్రుష్టిని ఆకర్షించారు.
చారిత్రాత్మక ప్రదేశాలు… వీర తెలంగాణ యోధుల ప్రాంతాలను తాకుతూ..
3వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ పాదయాత్ర పలు చారిత్రాత్మక ప్రదేశాలతోపాటు వీర తెలంగాణ పోరాట యోధుల జన్మస్థలాల గూండా సాగింది. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంతోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోచంపల్లి, రజాకార్లపై పోరు సాగించి ఊచకోతకు గురైన గుండ్రాంపల్లి వంటి ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు.
మువ్వెన్నెల పతాకాన్ని ఎగరేస్తూ… స్వాతంత్ర్య సమర యోధులను స్మరిస్తూ…
9న హర్ ఘర్ తిరంగా జెండా సందర్భంగా చౌటుప్పల్ లో జాతీయ జెండాను ఎగరేసి పాదయాత్రకు తరలివచ్చిన వేలాది మందితో కలిసి పాదయాత్ర చేశారు. అదే రోజు గుండ్రాంపల్లి రజకార్లపై పోరాడి అసువులు బాసిన కుటుంబాలకు ఘనంగా సన్మానించారు. మరుసటి రోజు సొంత ఖర్చుతో 2 లక్షల పుస్తకాలను సేకరించి గ్రంథాలయం నిర్వహిస్తున్న ఆచార కూరెళ్లి విఠలాచార్య స్వగ్రామానికి వెళ్లి సమాజానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. 9వ రోజైన ఈనెల 11న జాతీయ జెండా పరిరక్షణ కోసం రజాకార్లతో పోరాడి వీర మరణం పొందిన బత్తిని మొగిలయ్య గౌడ్ కు ఘన నివాళులు అర్పించారు. యాత్రలో 10వ రోజు రాఖీ పౌర్ణమి.
పాదయాత్రకు మొదలు రాత్రి పొద్దుపోయే వరకు భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి బండి సంజయ్ కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అదే రోజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ పాదయాత్ర లో పాల్గొని మునుగోడు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. 11వ రోజు ఆజాదీ కా అమ్రుత్ మహోత్సవాల్లో భాగంగా పాదయాత్ర శిబిరం జాతీయ జెండాను ఎగరేశారు. 12వ రోజైన ఆదివారం నాడు సైతం 15 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం గమనార్హం.
వెయ్యి కిలోమీటర్లకు చేరువలో…
గత రెండు పాదయాత్రల ద్వారా బండి సంజయ్ కుమార్ 815 కిలోమీటర్లు నడిచారు. అట్లాగే 13 జిల్లాలు, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. మూడో విడత పాదయాత్రలోని 12 రోజులతో కలిపి 970 కిలోమీటర్లకు చేరింది. మరో రెండ్రోజుల్లో బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ద్వారా వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించబోతుండటం విశేషం.