తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ వినతిపత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వివాదాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇటీవల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ నేతలు గోరంట్ల మాధవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయ నాయుడు తదితరులు స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కి గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు. మాధవ్ గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులు, ప్రత్యేకించి హోం మంత్రిత్వ శాఖ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అతనిపై గతంలో ఉన్న ఆరోపణలపై ఎంక్వయిరీ జరపాలని కూడా వారు కోరారు.
తెలుగు యువత నేతలు గోరంట్ల మాధవ్ గతంలోనే వివిధ ఆరోపణలకు గురయ్యారని, ఆయనపై మరింత దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. “గత వైసీపీ సైకో పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే” అని వారు ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నారాయణస్వామి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోజ్ కుమార్, శివకుమార్, ఎస్సీ సెల్ నాయకులు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.