– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
విజయవాడ
శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్
వెలగపూడి – అమరావతి వారికి
ఆర్యా !
విశాఖ భూముల వ్యవహారంలో సిబిఐ విచారణ కోరాలి
బహిరంగ లేఖ ద్వారా ముఖ్య మంత్రి ని డిమాండ్ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
విశాఖపట్నం నగరం, పరిసర ప్రాంతాల్లో మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖకు చెందిన భూములతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు,వారి కుటుంబాలకు, మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూములు, సామాన్య మధ్యతరగతికి చెందిన వారి భూములే కాదు, ఎక్కడ ఖాళీగా కనబడితే అక్కడ గత రెండు దశాబ్దలుగా అక్రమార్కులు గద్దల్లా వాలి,వారి కబంధ హస్తాల్లో భూములు కబ్జాలకు గురైన విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా మీ దృష్టికి మరోసారి తెస్తున్నాను.
విశాఖపట్నం & ఉత్తరాంధ్ర జిల్లాల్లో దురాక్రమణకు గురైన భూములను కబ్జా రాయుళ్లు నుండి తిరిగి స్వాధీనం చేసుకుని వాటి నిజమైన యాజమాన్యాలకు అప్పగించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగింది.దర్యాప్తు చేయాల్సిన అంశాలపై ప్రభుత్వం దోబూచలాడుతూ ద్వంద్వ వైఖరి అవలంభించడాన్ని బహిరంగ లేఖ ద్వారా ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నాను.
గత రెండు దశాబ్దాలుగా విశాఖపట్నం పరిధిలో, వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ భూముల కబ్జాలు, ప్రైవేటు, వివాదాస్పద భూముల దురాక్రమణలు జరిగాయని మీకూ తెలుసు. ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని తెగనమ్ముకోవటానికి ఎన్ఓసీలు పొందటం, మాజీ సైనికులకు, స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన ప్రభుత్వ భూములను నయానో భయానో బెదిరించి స్వాధీనం చేసుకుని వాటికి అనేక వక్ర మార్గాల్లో ఎన్వోసీలు పొందడం జగద్విదితం. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వేల కోట్ల విలువైన అక్రమలావాదేవీల మీద, భూములు అన్యాక్రాంతం కావటం మీదా సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.
2004 సం.నుండి అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మొదలైన భూదందా … 2014 లో రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పాలన వరకు, భూకబ్జాలు జరిగాయని మీరూ మీ పార్టీవారూ ఆరోపించారు కదా ? 2019 నుండి ఇప్పటివరకు మీ ప్రభుత్వంలోనూ అక్రమ భూ కేటాయింపులు, అవకతవకలు, అక్రమ, చట్ట వ్యతిరేక లావాదేవీలు జరిగాయని విపక్షాలూ, మీడియా పుంఖాను పుంఖాలుగా ఆరోపణలు చేస్తున్నాయి. అందుకు మీ చిత్త శుద్ధిని నిరూపించుకోవటానికి మొత్తం వ్యవహారాలను సిబిఐ’కి, లేదా సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి సమీక్షకీ ముందుకు రండి.
విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చిన్న మధ్య తరగతి పేద బడుగు బలహీన వర్గాలు నీడకోసం గూడుకోసం కష్టార్జితాన్ని వెచ్చించి కొనుక్కున్న ఇళ్ల స్థలాలకు, వారసత్వంగా వచ్చిన ఆస్తులకు ఆంక్షలు పెట్టిన ప్రభుత్వాలు ప్రభుత్వ భూములను, స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన భూములను, దేవస్థానం భూములను గద్దల్లా తన్నుకుపోతున్న కబ్జాదార్లను ఎందుకు వదిలేస్తున్నారో ? మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నేను ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రశ్నిస్తున్నాను.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రౌడీల్లా ప్రవర్తిస్తూ, అధికారులమీద వత్తిడి తెస్తూ అధికారంలో ఉన్న రాజకీయ నేతలు సామాన్యులను భయభ్రాంతుల్ని చేసి వారి ఆస్తులను కబ్జా చేస్తున్నారు. ఇందులో చాలామంది కబ్జాకోర్లు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి, పెద్దలకు దగ్గరై “క్విడ్ ప్రో కో” అంటూ వాటాలు పంచి నోళ్లు మూయిస్తున్నారు. వీరికి మీరు మద్దతు ఇస్తున్నారన్న భావన ఈ రాష్ట్ర ప్రజలకు కలగ కూడదంటే మీరు నిష్కర్షగా ఈ దందాలకు చెక్ పెట్టి ప్రభుత్వ భూములతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆస్తులను మీ ప్రభుత్వం వెంటనే కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను.అందుకు మీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం సహకారం కోరాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు ఈ విచారణలో అన్ని విధాలా సహకరించటానికి సిద్ధంగా ఉన్నాను.
నాటి కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, నేటి వైసిపి ప్రభుత్వాల్లో పాలకులు, నాయకులుగా మారిన కొందరు శాసనసభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు అందరూ కలిసికట్టుగా ప్రజలను దోచే విషయంలో ఏకమయ్యారన్న ఆలోచనే దుర్భరంగా ఉంది.
*నాటి తెలుగుదేశం ప్రభుత్వం భూ కబ్జాలపై విచారణకు ‘సిట్’ వేసింది, కానీ కమిటీ నివేదిక బహిర్గతం కాకుండానే ఎన్నికలు వచ్చాయి. తరువాత అధికారానికి వచ్చిన మీరు అంతకు ముందిచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వ దురాక్రమణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తారని ప్రజలు వేచి చూచారు. మీ ప్రభుత్వం వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా విచారణలోని అంశాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు? నాటి సిట్ నివేదిక ఏమైంది? మీ ప్రభుత్వ విచారణ ఏమైంది? రెండు ప్రభుత్వాలు…. నాటి మాజీ ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రీ కూడా ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పక తప్పని సమయం ఆసన్నమైంది…
ఈ బహిరంగ లేఖను మీ “స్పందన” లో వచ్చిన అత్యవసర ఫిర్యాదుగా స్వీకరించి తక్షణమే ఉత్తరాంధ్ర భూ కబ్జాల మీద స్పందించండి. 2004 నుండి 2022 వరకు జరిగిన భూభాగోతాలపై జరిపించిన దర్యాప్తు నివేదికలను బయట పెట్టి, ప్రభుత్వానికీ, అసలు యజమానులకూ భూములు బదలాయించండి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ముఖ్యమంత్రి శ్రీ యోగీ ఆధిత్యనాథ్ తన పర భేదం లేకుండా అక్రమార్కుల భరతం పడుతున్నారు. మీరూ అలా చేయాలి. లేదా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సిబిఐ దర్యాప్తు కోసం తన వంతు పోరాటం చేస్తుందని, అపుడు మీరూ ఆ పరిధిలోకి వెళ్లవలసిన పరిస్థితి తప్పదనీ ఈ బహిరంగ లేఖ ద్వారా హెచ్చరిస్తున్నాను.
అభినందనలతో ….
(సోము వీర్రాజు)
బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు.