కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి

–నీరబ్‌, పూనం, వలెవన్‌ను కాదని జవహర్‌రెడ్డికే పట్టం
-కలసి వచ్చిన విధేయత, వివాదరాహిత్యం
-సీఎంఓలోకి పూనం మాలకొండయ్య
-సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి నిరాశ
-శ్రీలక్ష్మిని సీఎంఓలోకి తీసుకునే అంశంపై కసరత్తు
-చివరకు పూనం వైపే మొగ్గుచూపిన జగన్‌
-ముక్కుసూటి అధికారిగా పూనం మాలకొండయ్యకు పేరు
-సమీర్‌శర్మకు పోల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు చైర్మన్‌ పదవి?
-కోరింది దక్కించుకున్న ప్రవీణ్‌ ప్రకాష్‌
-తొలుత టీటీడీ ఈఓ పదవి ఆశించిన ప్రవీణ్‌
-మరికొందరు ఐఏఎస్‌ బదిలీలు
-ఎన్నికల ముందు ఆచితూచి అడుగులేసిన సీఎం జగన్‌
-జగన్‌ నియామకాల్లో ఇదే బెస్ట్‌ అంటున్న అధికారులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకుందే జరిగింది. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి కెఎస్‌ జవహర్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎంఓలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్‌రెడ్డి, సీఎస్‌గా 2024 జూన్‌ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ఆ ప్రకారంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయనే సీఎస్‌గా ఉండబోతున్నారు. కాగా ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ ఈనెల 30న రిటైర్‌ కానున్నారు. ఆయన స్థానంలో జవహర్‌రెడ్డి డిసెంబర్‌ 1 నుంచి కొత్త సీఎస్‌గా పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు.

అయితే జవహర్‌రెడ్డి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం మూడు బ్యాచ్‌లను కాదని, 1990 బ్యాచ్‌కు చెందిన జవహర్‌రెడ్డిని ఎంపిక చేయడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. నిజానికి 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, 188 క్యాడర్‌కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్‌కు చెందిన కరికల్‌ వలెవన్‌ను కాదని, జవహర్‌రెడ్డిని సీఎస్‌గా ఎంపిక చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారంతో ఆయనను సీఎస్‌గా ఎంపిక చేశారు. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు సీనియర్లను కాదని.. తమకు నచ్చిన వారిని సీఎస్‌లుగా నియమించిన సంప్రదాయాన్ని, జగన్‌ ప్రభుత్వం మరోసారి కొనసాగించినట్లయింది.

కాగా సీఎంఓలో ప్రస్తుతం జవహర్‌రెడ్డి స్థానాన్ని, సీనియర్‌ ఐఏఎస్‌ పూనం మాలకొండయ్య భర్తీ చేయనున్నారు. నిజానికి ఆమె కూడా సీఎస్‌ పదవి ఆశించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న పూనం, ఎవరు చెప్పినా వినరన్న ప్రచారం అధికారవర్గాల్లో ఉంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. వైద్య, వ్యవసాయశాఖకు సంబంధించిన అనేక అంశాల్లో, చంద్రబాబు సూచనలను పాటించలేదన్న ప్రచారం అధికారవర్గాల్లో వినిపించింది.

అసెంబ్లీ జరుగుతున్న సమయంలో.. బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు ఆమెను కలిసేందుకు వెళ్లినప్పుడు, వారిని అవమానించారన్న ప్రచారం అసెంబ్లీ లాబీల్లో జరిగింది. దానితో ఇప్పుడు వైసీపీలో ఉన్న, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేసి, సీఎం చంద్రబాబు వద్దకు రాజీనామా లేఖతో వెళ్లడం కలకలం సృష్టించింది. అయితే అక్కడున్న కొందరు సీనియర్లు వంశీని బుజ్జగించడంతో ఆయన వెనక్కితగ్గారు.ఒకరకంగా మంత్రులంతా ఆమె పనితీరును వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు ఆమెకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఆవిధంగా ప్రజాప్రతినిధులను ఆమె గౌరవించరన్న పేరుంది. కౌన్సిల్‌లో ఓ బీజేపీ నేత ఆమె శాఖ పనితీరు వైఫల్యంపై విమర్శించారు. దానికి సంబంధించి.. ఆమె తన వద్దకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేల వద్ద ఆ విమర్శలను ప్రస్తావించి, సదరు బీజేపీ ఎమ్మెల్సీని తిట్టినట్లు అప్పట్లో అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది.

అయితే నిబంధనలు పాటిస్తారన్న పేరున్న ఆమె.. మారిన రాజకీయ పరిణామాలు, ఒత్తిళ్ల నేపథ్యంలో సీఎంఓలో ఎలా పనిచేస్తారో చూడాలని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్‌ సీఎం అయిన తర్వాత మిగిలిన అధికారుల మాదిరిగానే, ఆమెలో కూడా మార్పు వచ్చినందున, ప్రస్తుత పరిస్థితికి తగ్గట్లు పనిచేయకతప్పదన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. పూనం మాలకొండయ్య ఎవరిమాట వినకపోయినప్పటికీ, కిందివారితో చేయిస్తారన్న పేరుంది కాబట్టి ఆమె సీఎంఓలో సక్సెస్‌ అవుతారని ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు.

ఇక జవహర్‌రెడ్డి ఎంపిక ముందునుంచే ఊహించినప్పటికీ, మధ్యలో మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి పేరు కూడా, ప్రముఖంగా చర్చల్లో వచ్చింది. ఆమె కోసం వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్న, ఓ ఎంపీ ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. అది సాధ్యం కాదని తేలడంతో, శ్రీలక్ష్మిని కనీసం సీఎంఓలోsri-lakshmi-ias నియమించేందుకు ప్రయత్నించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, సీఎం జగన్‌ మాత్రం, సీనియర్‌ ఐఏఎస్‌ పూనం మాలకొండయ్య వైపే మొగ్గు చూపారు. దానితో శ్రీలక్ష్మికి నిరాశ తప్పలేదు.

కొత్త సీఎస్‌ ఎవరన్న చర్చ జరుగుతున్న సమయంలో.. కేంద్ర సర్వీసులో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ గిరిధర్‌ ఢిల్లీ నుంచి వచ్చి, సీఎం జగన్‌ను కలిశారు.దానితో సహజంగానే ఆయన పేరు సీఎస్‌గా చర్చల్లోకి వచ్చింది. సీఎస్‌ పదవి అడిగేందుకే ఆయన, ఢిల్లీ నుంచి వచ్చారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే తన కుమార్తె పెళ్లి కార్డు ఇచ్చి, పెళ్లికి ఆహ్వానించేందుే ఆయన బెజవాడ వచ్చినట్లు ఓ అధికారి వెల్లడించారు.

నిజానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా ఉన్న సమయంలో, గిరిధర్‌కు టీటీడీ ఈఓ పదవి ఆఫర్‌ చేశారు. అయితే తనకు రాష్ర్టానికి వచ్చే ఆసక్తి లేదని, ఆయన ఎల్వీ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. పైగా కీలకమైన రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్న గిరిధర్‌, దానిని వదులుకుని సీఎస్‌గా ఎలా వస్తారని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు సీఎం జగన్‌, సీఎస్‌గా జవహర్‌రెడ్డినే ఖరారు చేసి, సస్పెన్స్‌కు తెరదింపారు. రిటైర్‌ కానున్న సమీర్‌శర్మకు పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డుతో పాటు మరికొన్ని విభాగాలు అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఇక సీఎస్‌గా ఎంపికయిన జవహర్‌రెడ్డికి వివాదరహితుడన్న పేరు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ మెట్రోవాటర్‌బోర్డు ఎండీగా ఉన్నప్పుడు దానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారు. మెట్రోవాటర్‌వర్క్స్‌కు చాలామంది ఎండీలు వచ్చినప్పటికీ, దానిపై ఎల్వీ సుబ్రమణ్యం-జవహర్‌రెడ్డి తమ ప్రత్యేకముద్ర వేసిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ హయాంలో కూడా కీలకమైన శాఖలు నిర్వహించారంటే, ఆయన సమర్ధత ఏమిటన్నది స్పష్టమవుతోంది.

నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, ఆయనను సీఎంఓలోకి తీసుకోవాలని జగన్‌ భావించారు. అయితే ఆయన అంతకుముందే టీడీపీ ప్రభుత్వంలో కీలకశాఖలు నిర్వహించడం, చంద్రబాబు-లోకేష్‌కు సన్నిహితంగా ఉంటారని కొందరు జగన్‌కు చెప్పడంతో, ఆ ఆలోచన అప్పట్లో తాత్కాలికంగా విరమించుకున్నారు. అయితే ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకున్న జగన్‌, ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు.

ఆయన కోరిక మేరకు టీటీడీ ఈఓ పదవి ఇచ్చారు. ఆ పదవిలో ఉన్నప్పుడే సీఎంఓలో స్పెషల్‌ సెక్రటరీగా తీసుకున్నారు. అయితే, ఆయనను సీఎంఓలోకి తీసుకునే ముందే, సీఎస్‌ అవకాశం ఇస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ ప్రకారంగా సీఎం జగన్‌ తాను ఇచ్చినమాట నిలబెట్టుకున్నట్టయింది. అదే విధంగా ప్రద్యుమ్నను ఆర్‌అండ్‌బి కార్యదర్శి, మధుసూదన్‌రెడ్డిని వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌గా, వ్యవ సాయ శాఖ కమిషనర్‌గా రాహుల్‌పాండే, హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా మహ్మద్‌దివాన్‌ను నియమించారు.

కాగా ఎన్నికల సమయంలో అడ్మినిస్ట్రేవ్‌ అపాయింట్‌మెంట్ల కంటే పొలిటికల్‌ అపాయింట్‌లెంట్లవైపే చూసే సంప్రదాయాన్ని, సీఎం జగన్‌ కూడా పాటించినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ-ప్రభుత్వ అవసరాలను గుర్తించడంతోపాటు.. సమర్ధత, వివాదరహిత్యాన్ని కూడా పాలకులు కోరుకుంటారు. అందులో భాగంగానే జవహర్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోందని ఓ రిటైర్‌ సీఎస్‌ వ్యాఖ్యానించారు.

జవహర్‌రెడ్డి, పూనం మానలకొండయ్య వంటి సమర్ధుల నియామకం ద్వారా.. ప్రభుత్వం పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తోందన్న సంకేతాలు పంపించిందని విశ్లేషిస్తున్నారు. అంటే ఇక ఎన్నికల వరకూ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, నియామకాలు ఇప్పటిమాదిరిగా కాకుండా.. ఆచితూచి ఉంటాయని తాజా నియామకాల ద్వారా అర్ధమవుతోందని, మరో మాజీ ఐఏఎస్‌ విశ్లేషించారు. ఏది ఏమైనా ఇప్పవరకూ జగన్‌ చేసిన నియామకాల్లో ఈ నియామకాలే అత్యుత్తమమైనన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కోరింది సాధించిన ప్రవీణ్‌ ప్రకాష్‌
తాజా నియామకాల్లో ఐఏఎస్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌, తాను కోరిన శాఖను దక్కించుకున్నారు. నిజానికి ఆయన తొలుత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పుడు టీటీడీ ఈవో పదవి ఆశించారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న ధర్మారెడ్డితో వెళ్లి చర్చించమని, సీఎం జగన్‌ సూచించినట్లు ప్రవీణ్‌కు సమాచారం. అయితే అక్కడ కూడా praveen-prakashకుదరకపోవడంతో.. ఎడ్యుకేషన్‌, హెల్త్‌ డిపార్టుమెంట్లలో ఒకదాన్ని ఆశించినట్లు సమాచారం. అయితేఆయనను విద్యాశాఖలో నియమిస్తే, అక్కడ ఉన్న రాజశేఖర్‌తో ఇబ్బందులు వస్తాయని సీనియర్‌ అధికారి ఒకరు సీఎం జగన్‌కు సూచించారు. దానితో ఆయనకు ఆర్‌ అండ్‌ బీ శాఖ ఇచ్చారు. తర్వాత రాజశేఖర్‌ సెలవుపై వెళ్లడంతో, ప్రవీణ్‌ప్రకాష్‌కు తాను కోరుకున్న విద్యాశాఖ దక్కింది.

సీఎంఓలో తొలి మహిళ
ఉమ్మడి – విభజిత రాష్ట్ర చరిత్రలో, ఒక మహిళా అధికారి సీఎంఓ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా నియమితులు కావడం ఇదే ప్రధ మం. అదే సమయంలో ఇప్పటివరకూ చరిత్రలో ఒక మహిళా ఐఏఎస్‌ను, సీఎంఓ అధికారిగా నియమించిన ఘనత సీఎం జగన్‌కే దక్కడం విశేషం.

Leave a Reply