– కమలం వికసిస్తేనే కిషన్‌రెడ్డికి ఇమేజ్
– సంజయ్ తొలగింపుపై తీర్పు
-35-40 సీట్లు వస్తాయని ఢిల్లీకి నివేదిక పంపిన నాయకత్వం
– పోలింగ్ తర్వాత 33 సీట్లు వస్తాయని నివేదిక
– అందులో సగం వస్తేనే కిషన్‌రెడ్డికి పరువు
– సీట్లు, ఓటు శాతం పెరిగితేనే ప్రతిష్ఠ
– ప్రచారంలో కనిపించని సినిమా తారలు
– కవిత తప్ప కనిపించని జయసుధ, జీవిత, ప్రియారామన్
– మంద కృష్ణ మాదిగను ప్రచారానికి పంపించని నాయకత్వ వైఫల్యం
– కిషన్‌రెడ్డి సొంత పార్లమెంటు సంగతేమిటి?
– అంబర్‌పేటలో పార్టీని గెలిపిస్తారా?
– కృష్ణాయాదవ్‌ను గెలిపించకపోతే కిషన్‌రెడ్డికి కష్టాలే
– ఇప్పటికే కిషన్‌రెడ్డిపై సొంత క్యాడర్ అసంతృప్తి
– అందుబాటులో ఉండటం లేదన్న అసంతృప్తి
-నామినేటెడ్ పదవులివ్వలేదని సీనియర్ల ఆగ్రహం
– అభ్యర్ధులకు డబ్బు పంపిణీపై ఆరోపణలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ బీజేపీ రధసారథి గంగాపురం కిషన్‌రెడ్డి సత్తాకు ఎన్నికల ఫలితాలు సవాలుగా పరిణమించాయి. బీజేపీని పంచకల్యాణి గుర్రంలా పరుగులుపెట్టించిన బండి సంజయ్‌ను, ఎన్నికల ముందు తొలగించి.. ఆయన స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించిన నాయకత్వ నిర్ణయం సరైనదా? కాదా? అన్న అంశం ఫలితాల్లో తేలిపోనుంది.
వీటికి మించి.. కిషన్‌రెడ్డి సారధ్యంలో పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుంది? అసలు ఆయన సొంత సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కథేమిటి? అక్కడ ఆయన బీజేపీకి ఎన్ని సీట్లు పార్టీ ఖాతాలో వేయిస్తారు? సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన అంబర్‌పేట అభ్యర్ధిని గెలిపించే సత్తా కిషన్‌రెడ్డికి ఉందా? లేదా? ఎన్నికల ప్రచారంలో మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ దన్ను పార్టీకి ఎంతవరకూ అక్కరకు వచ్చింది? మొత్తంగా పార్టీకి సీట్లు పెరుగుతాయా? ఓట్లు పెరుగుతాయా? ఇంకొద్ది గంటల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి నాయకత్వ ప్రతిభకు ఎన్నికల ఫలితాలు పరీక్షగా మారాయి. టికెట్ల ఎంపిక-ప్రచారం-నిధుల పంపిణీ అంతా ఆయన సారథ్యంలోనే జరిగినందున.. కిషన్‌రెడ్డి తన పార్టీని ఎన్ని చోట్ల గెలిపిస్తారు? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. గౌరవప్రదమైన స్థానాలు వస్తేనే, పార్టీలో కిషన్‌రెడ్డి నాయకత్వానికి విలువ-గౌరవం పెరుగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టికెట్ల పంపిణీ అంతా కిషన్‌రెడ్డి కనుసన్నలలోనే జరిగినందున, పార్టీ జయాపజయానికి ఆయనే బాధ్యత విహ ంచాలని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
బండి సంజయ్ హయాంలో.. బీఆర్‌ఎస్-బీజేపీ నువ్వా నే నా అనే పరిస్థితి ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్‌ది, మూడవ స్థానం అన్న భావన సర్వత్రా కనిపించింది. పైగా కాంగ్రెస్‌లో అప్పుడు అంతర్గత కలహాలు విపరీతంగా ఉండేవి. ఫలితంగా యువకులు బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. బీజేపీ చరిత్రలో తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్ష స్థానానికి ఎదిగింది..బండి సంజయ్ సారథ్యంలోనే అన్న విషయం విస్మరించకూడదు.
హైదరాబాద్‌కు చెందిన బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి వంటి ప్రముఖులు రాష్ట్ర-జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు సైతం బీజేపీ ఈ ఘనత ఎప్పుడూ సాధించలేదు. అలాగే ఏ ఉప ఎన్నికలో కూడా బీజేపీ విజయం సాధించింది లేదు. కానీ సంజయ్ ఆధ్వర్యంలో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం విశేషం.
అంతదూకుడుగా వెళుతున్న సంజయ్‌ను అర్ధంతరంగా తొలగించి, కిషన్‌రెడ్డికి పట్టం కట్టినప్పుడే…. బీజేపీ పని అయిపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తమయింది. ఆ తర్వాతనే బీజేపీలో చేరిన సీనియర్లు ఒక్కొకొక్కరు పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరిన పరిస్థితికి నాయకత్వ వైఫల్యమే కారణమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. ఫలితంగా ఎన్నికల యుద్ధంలో బీజేపీ పోటాపోటీ నుంచి మూడవ స్థానానికి పడిపోయింది.
ఇక టికెట్ల పంపిణీ కూడా.. సమర్ధుల ప్రాతిపదికన జరగలేదన్న విమర్శలు చెలరేగాయి. కనీసం కార్పొరేటర్ల స్థాయి కూడా లేనివారిని తెచ్చి, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారన్న విమర్శలు బలంగా వినిపించాయి. ప్రధానంగా బండి సంజయ్, మందకృష్ణ మాదిగను హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో, ప్రచారానికి పంపించకపోవడం వ్యూహాత్మక తప్పిదమంటున్నారు.
మంద కృష్ణమాదిగ బీజేపీకి మద్దతు ప్రకటించిన్పటికీ, ఆయన ఏ నియోజకవర్గంలో కూడా, బహిరంగంగా ప్రచారం చేయని విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చే స్తున్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్, కంటోన్మెంట్, ముషీరాబాద్, సనతనగర్ నియోజకవర్గాల్లో మాదిగల సంఖ్య ఎక్కువ. అక్కడ మంద కృష్ణతో విడిగా ప్రచారం చేయించి ఉంటే, సానుకూల ఫలితాలు వచ్చేవని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ ఇమేజ్‌ను వాడుకోవడంలో కిషన్‌రెడ్డి నాయకత్వం, విఫలమైందన్న విమర్శలు వినిపించాయి. సంజయ్‌కు హైదరాబాద్‌లోని యువతలో క్రేజ్ ఉన్నందున, ఆయనను కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి పంపించి ఉంటే, మరికొన్ని సీట్లు వచ్చేవంటున్నారు.
పేరుకు జయసుధ, జీవిత, కవిత, ప్రియారామన్, శివకృష్ణ, భానుచందర్, సాయికుమార్ వంటి సినిమా తారలు బీజేపీలో ఉన్న్పటికీ.. కవిత ఒక్కరే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రస్తావనార్హం. ఆమె మిర్యాలగూడ పాలక్‌గా కూడా పనిచేశారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన జయసుధ ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు ఆమెను ఏ లక్ష్యంతో పార్టీలోకి తీసుకువచ్చారు? ఆమెను ప్రచారానికి ఎందుకు పంపించలేదన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక పార్టీలో చేరి సెన్సార్‌బోర్డు పదవి తీసుకున్న జీవిత కూడా ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు.
బీజేపీ గెలుస్తుందని నివేదిక ఇచ్చిన ఆ 33 సీట్లు ఇవే..
ఇదిలాఉండగా ఎన్నికల్లో పార్టీ 33 స్థానాల్లో విజయం సాధిస్తుందని రాష్ట్ర నాయకత్వం తాజాగా ఢిల్లీకి ఒక నివేదిక పంపినట్లు సమాచారం. 26 స్థానాలు వచ్చిన్పటికీ, బీజేపీ ప్రభుత్వ,ం ఏర్పాటుచేస్తుందని ఆ నివేదికలో పేర్కొనడం విశేషం. వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన నివేదికల మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ఢిల్లీకి ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా.. బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (హుజూరాబాద్) ధర్మపురి అర్వింద్ (కోరుట్ల), రాజాసింగ్ (గోషామహల్), రఘునందన్ (దుబ్బాక), ఈటల రాజేందర్ (గజ్వేల్), హుస్సేన్ నాయక్ (మహబూబాబాద్), మురళీయాదవ్ (నర్సాపురం), కాలోజీ ఆచారి (కల్వకుర్తి), నితిన్‌రెడ్డి (మహబూబ్‌నగర్), వికాస్‌రావు (వేములవాడ), కీర్తిరెడ్డి (భూపాలపల్లి), రమేష్‌రాథోడ్ (ఖానాపూర్), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), రామారావు పటేల్ (ముథోల్), నారాయణగుప్తా (నిజామాబాద్ అర్బన్), దినేష్ కులచారి (నిజామాబాద్ రూరల్), శ్రీరాముయాదవ్ (మహేశ్వరం), రాజేందర్‌రెడ్డి (రాజేంద్రనగర్), రవికుమార్‌యాదవ్ (శేరిలింగంపల్లి), రాకేష్‌రెడ్డి (ఆర్మూర్), వెంకటరమణారెడ్డి (కామారెడ్డి), కృష్ణారెడ్డి (మునుగోడు), శ్రీశైలంగౌడ్ (కుత్బుల్లాపూర్), రంగారెడ్డి (ఎల్బీనగర్), ఆరేపల్లి మోహన్(మానకొండూరు), భోగ శ్రావణి (జగిత్యాల), కృష్ణాయాదవ్ (అంబర్‌పేట), రావు పద్మ (వరంగల్‌వెస్ట్), ప్రదీప్‌రావు (వరంగల్ ఈస్ట్), పాయల్‌శంకర్ (ఆదిలాబాద్), మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి (మక్తల్), సోయం బాపూరావు (బోధ్) నియోజకవర్గాల్లో విజయం సాధిస్తార ని రాష్ట్ర నాయకత్వం, కేంద్ర పార్టీకి నివేదిక పంపింది. మిత్రపక్షమైన జనసేన అభ్యర్ధి కూకట్‌పల్లిలో గెలుస్తారని పేర్కొంది. ఆ మేరకు బీజేపీ విజయం సాధించకపోతే, పోర్టీలో కిషన్‌రెడ్డిని లెక్కచేసేవారు ఉండరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సికింద్రాబాద్‌లో గెలుపు సంగతేమిటి?
ప్రధానంగా కిషన్‌రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలోని 7 అసెంబ్లీనియోజకవర్గాల్లో, బీజేపీ సాధించబోయే సీట్లపైనే ఆయన ఎంపీ విజయం ఆధారపడి ఉంది. మార్చిలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు తాజా ఫలితాలు ఒక సంకేతమేనంటున్నారు. అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు-అభ్యర్ధులతో కలిపి ఒక్క సమావేశం కూడా పెట్టలేదన్న ఫిర్యాదులున్నాయి. పోనీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఉన్న నాయకులయినా పిలిచి బుజ్జగించారా అంటే అదీ లేదంటున్నారు. ఆయన కేవలం తన ఎన్నికలప్పుడు మాత్రమే ఆ పనిచేస్తారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
పైగా లోక్‌సభ పరిథిలో మెజారిటీ నాయకులు-కార్యకర్తలు కిషన్‌రెడ్డి పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఎవరికీ అందుబాటులో లేరని, మొదటినుంచీ పనిచేస్తున్న నాయకులకు ఒక్కరికి కూడా, నామినేటెడ్ పదవులు ఇప్పించలేదన్న అసంతృప్తి బలంగా నాటుకుపోయింది.
కిషన్‌రెడ్డి తన విజయానికి తమను వాడుకుంటున్నారన్న భావన, నియోజకవర్గ నేతల్లో లేకపోలేదు. అంబర్‌పేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సొంత అంబర్‌పేట నియోజకవర్గంలో.. బీజేపీ అభ్యర్ధి సి.కృష్ణాయాదవ్‌ను గెలిపించకపోతే, కిషన్‌రెడ్డికి అప్రతిష్ఠ తప్పదంటున్నారు.
కాగా ఎన్నికల్లో జరిగిన నిధుల పంపిణీపై కూడా పార్టీ వర్గాల నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభ్యర్ధులందరికీ నిధులు సకాలంలో సమానంగా పంపిణీ చేయకపోవడం, మధ్యవర్తులుగా ఉన్న పార్టీ నాయకులు వాటి ని పూర్తిగా అభ్యర్ధులకు చేరవేయకపోవడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు, పూర్తి స్థాయిలో కిందకు చేరడం లేదని సీనియర్లు చెబుతున్నారు. నిజం నారాయణుడికెరుక?