ఇక్కడ
అభిప్రాయాలు
అమ్మబడును.
మేధావి మేకప్‌లో
నిలబడ్డాను —
త్వరపడండి.
అబద్ధం కొంచెం ఖరీదు,
నిజం డిస్కౌంట్లో ఉంది.
మీకు నచ్చిన సిద్ధాంతం
ప్యాక్ చేసి ఇస్తాను,
సందేహాలు ఉచితం.
కొనుగోలు చేసిన వెంటనే
కోట్లాది జనం
మా మాటలనే
జపం చేస్తూ ఉంటారు.
గొంతుల్లో
మా ప్రతిధ్వనులు,
కళ్లలో
మా పోస్టర్లు.
నడిచే దారుల్లో
మా నినాదాలే,
ఇక్కడ
రంగు రంగుల అబద్ధాలే కాదు —
ప్రచార కార్యకర్తలు
హోల్‌సేల్‌లో దొరుకుతారు
త్వరపడండి,
స్టాక్ ఎక్కువ లేదు.
కొత్త అబద్ధాలు
రేపు సృష్టిస్తాము.
ఎవడన్నా నిజం చెబితే
వాని బతుకు మీద
అబద్ధపు లేబుల్ అంటిచేస్తాం
పాత అబద్ధాలను
చరిత్రగా ముద్రిస్తాము,
కొత్త అవసరాలను
వదంతులుగా ప్రచారం చేస్తాము.
మా దుకాణం ముందు
నిలబడ్డ ప్రతి వానికి
కావలసిన కథలను
వండి వార్చుతాం
ఎన్నికలైనా
వ్యాపారమైనా
ఎదుటివాడి
శీల హరణమైనా…
పేమెంటు తక్కువే …
రండి—
సత్యం చప్పుడు
వినపడనంత దూరం తీసుకువెళతాం
—ఇది మీడియా మిడిసిపాటు.