– రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు…10 వేల ఉద్యోగాలు
– దావోస్ పర్యటనలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో ఎంఓయు
– ఏపీ ప్రభుత్వం, అదానీ గ్రీన్ ఎనర్జీ మధ్య ఒప్పందం
– 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు
– 3700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్
– రైతులకు శాశ్వత ఉచిత విద్యుత్ కి సీఎం వైయస్ జగన్ బాటలు
– రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగంను బలోపేతం చేసే దిశగా సీఎం వైయస్ జగన్ దావోస్ వేదికగా భారీ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకోవడం రాష్ట్ర విద్యుత్ రంగంలోనే కీలకమైన పరిణామం అని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆదానీ గ్రీన్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం చేసుకున్న ఎంఓయు చారిత్రాత్మకమని అన్నారు.
సోమవారం దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఇందులో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చిందని, రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు శాశ్వతంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ ను భవిష్యత్ లో కూడా అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుచూపుతో బాటలు వేశారన్నారు. దీని వలన రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని, దాంతో పాటు వేలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
మరో వైపు 3700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు కూడా అదానీ గ్రూప్ ముందుకొచ్చి ఎంవోయూ చేసుకుందని వెల్లడించారు. ఈ రెండు ఎంవోయూలతో రాష్ట్రంలో 60 వేల కోట్ల పెట్టుబడులను అదానీ గ్రీన్ ఎనర్జీ పెట్టబోతుందని, తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు 10 వేల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాలుష్యరహిత పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలను పరిరక్షిస్తూ, మరో వైపు పెట్టుబడులు రప్పించి, ఉద్యోగాలు కల్పించే ఆధునిక అభివృద్ధి ఫార్ములాను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ప్రశంసించారు. కర్బన రహిత ఇంధన తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈ ఎంవోయూతో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా భవిష్యత్ లో పెరిగే విద్యుత్ డిమాండ్ ని కూడా మనం అధిగమించగలుగుతామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.