– పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డగోలు దోపిడీ
– రెండేళ్లు ఆ సిబ్బందికి ప్రభుత్వ జీతాలు మరో స్కామ్
– వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణపై విచారణ
– దోపిడీ భాగస్వాములు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన
అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్
తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారని అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, 7 కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై ప్రజలు మండి పడుతున్నారు.
సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒకవైపు ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్ల అప్పు చేయడమే కాక, మెడికల్ కాలేజీల రూపంలో జగన్ సృష్టించిన వేల కోట్ల విలువైన సంపదను ప్రైవేటుకి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఆయా కాలేజీల్లో పనిచేసే స్టాఫ్‌కి రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో ప్రజా సంపదను దాచిపెడుతున్నారు. కుడి చేతితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి రాసిచ్చి, జీతాల రూపంలో ఒక్కో ఏడాది ఇచ్చే దాదాపు రూ. 800 కోట్ల సొమ్మును ఎడమ చేత్తో వారి నుంచి లాక్కుంటున్నారు.
జీతాల చెల్లింపుల పేరుతో రూ.1400 కోట్లు దోపిడి
– మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పార్టీ అధికార ప్రతినిధి
కాలేజీలను దక్కించుకున్న 10 మెడికల్ కళాశాలల ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా తన బినామీలకు దోచిపెట్టే కుట్రే. ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.70 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 140 కోట్లు.. రెండేళ్లలో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు దోచిపెట్టే కుట్రకు తెర లేపారు. కుడిచేత్తో కాలేజీలను, కాలేజీ భూములను వారి చేతిలో పెట్టి.. ఎడమ చేత్తో జీతాల పేరుతో ఇచ్చిన రూ.1400 కోట్ల డబ్బును వారి నుంచి తీసుకునే దోపిడికి స్కెచ్ వేశారు. .
ప్రైవేటీకరణ వెనుక లక్ష కోట్ల దోపిడి
– ఎమ్మెల్సీ. మొండితోక అరుణ్‌కుమార్
నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించకపోగా.. మెడికల్ కాలేజీలకున్న 50 ఎకరాలు ప్రభుత్వ భూమి, భవనాలు ప్రభుత్వానివి వాటి విలువ వందల కోట్లలో ఉంటే ఎకరా రూ. 100లకు ధారాదత్తం చేశారు. ఇదికాకుండా రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ. 1400 కోట్లు ముట్టజెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రభుత్వ సంపదపై ప్రైవేటువ్యక్తులకు పెత్తనం అప్పజెబుతున్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చింది. 1.36 కోట్ల మందికిపైగా సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెలో కూడా సగం మందికిపైగా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారంటే ఏ విధంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు మా పార్టీ వెనక్కి తగ్గబోదు.