Suryaa.co.in

Andhra Pradesh

స్మార్ట్ మీటర్ల ముసుగులో రూ.17వేలకోట్ల భారీ కుంభకోణం

-రాష్ట్రంలో జరుగుతున్న స్మార్ట్ కుంభకోణంపై కేంద్రప్రభుత్వం వెంటనే దృష్టిపెట్టి సీబీఐ విచారణ జరిపించాలి
-ప్రజలపై భారంపడుతున్న స్మార్ట్ మీటర్ల టెండర్లను రాష్ట్రప్రభుత్వం వెంటనే రద్దుచేయాలి
-రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు చూస్తుంటే, మధ్యయుగంనాటి పిండారీలనే దోపిడీదొంగలు గుర్తుకొస్తున్నారు
-అవినాశ్ రెడ్డి సంస్థ అయిన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు దోచిపెట్టేందుకు నేరుగా ప్రజలజేబులు కొట్టేయడానికి సిద్ధమైన ప్రభుత్వం
-నిన్నటివరకు ప్రకృతిసంపదను దోచుకున్నపాలకులు, నేడు ఏకంగా ప్రజలజేబులకు చిల్లుపెట్టడానికి సిద్ధమయ్యారు
-స్మార్ట్ మీటర్ల నిర్వహణ, ధరల టెండర్లను గంపగుత్తగా షిరిడీసాయి ఎలక్ట్రికల్స్, అదానీసంస్థలకు దోచిపెట్టడంలోని ఆంతర్యంఏమిటి?
-రైతులు వినియోగించే విద్యుత్ మోటార్లధరలకంటే స్మార్ట్ మీటర్ల ధరలే ఎక్కువ
-టెండర్లలో రెండు సంస్థలుకోట్ చేసిన ధరలు చూస్తే ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్టు స్పష్టమవుతోంది
-ఉత్తరప్రదేశ్ లోటెండర్ దక్కించుకోవడానికి అదానీసంస్థ ఒక్కో మీటర్ నిర్వహణకు రూ.10వేలుకోట్ చేస్తే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ద్వందంగా ఆ సంస్థను తిరస్కరించాడు
-యూపీ ప్రభుత్వం వద్దన్న సంస్థ ఏపీకి ఎందుకు ముద్దు అయ్యిందో ముఖ్యమంత్రి చెప్పాలి?
-సమాచార హక్కు చట్టం కింద స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ కు సంబంధించిన వివరాలు అడిగితే తిరుపతి సీఎండీ ఎందుకు సమాచారంఇవ్వలేదు? మిగిలిన ఇద్దరు సీఎండీలు అరకొర సమాచారంతో ఎందుకు సరిపెట్టారు?
-ఈ వ్యవహారంపై తక్షణమే కేంద్రప్రభుత్వం జోక్యంచేసుకొని సీబీఐ విచారణ జరిపించాలి -పీ.ఎఫ్.సీ (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్) కూడా దీనిపై స్పందించాలి
-కేంద్రం స్పందించకుంటే, రాష్ట్రంలో జరిగే ‘స్మార్ట్’ దోపిడీపై న్యాయస్థానాల్నిఆశ్రయించి సీబీఐ విచారణ జరిగేలా చూస్తాం
-అమరావతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

“ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో స్మార్ట్ దోపిడీకి తెరలేపారు. వేలకోట్ల కుంభకోణంలో డిస్కమ్ ల సీఎండీలుకూడా భాగస్వాములు అయ్యారు.సమాచారహక్కుచట్టంకింద స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ తదితరవివరాలను ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ సీఎండీలను అడగటం జరిగింది. ఆయన తాతసొమ్ము ఏదో అడిగినట్టు తిరుపతి సీఎండీ అసలు స్పందించలేదు.అగ్రికల్చర్, డొమెస్టిక్ మీటర్లకు సంబంధించి మొత్తంగా రూ.17వేలకోట్ల కుంభకోణానికి తెరలేపారు.

వ్యవసాయమీటర్లలో రూ.7వేలకోట్ల కుంభకోణం, గృహాలమీటర్లలో రూ.10వేలకోట్ల కుంభకోణం. మొత్తంగా రూ.17వేలకోట్లు. ఈ సొమ్మంతా ప్రజల జేబులనుంచే కొట్టేస్తున్నారు. ఇంతపెద్ద కుంభకోణంపై ఫిర్యాదే అందలేదని చెబుతున్నారు.రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఏవీ కేంద్రప్రభుత్వానికి కనిపించడంలేదా? ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాల్సిందే.

ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, మైనింగ్, ఎర్రచందనం అన్నీ దోచేశారు. నిన్నటివరకు ప్రకృతిసంపద దోచుకున్నవారు అదిచాదన్నట్టు ఇప్పుడు స్మార్ట్ మీటర్లపేరుతో ఏకంగా ప్రజలజేబులు కొట్టేయడానికి

సిద్ధమయ్యారు. జగన్మో హన్ రెడ్డి తమ్ముడు అవినాశ్ రెడ్డికి చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ అప్పగించేందుకు ఏకంగా ఆ సంస్థ కార్యాలయంలోనే తిరుపతి సీఎండీ మంతనాలు జరిపారు. ఈ వ్యవహారంమొత్తం గమనిస్తే మధ్యయుగంనాటి పిండారీలనే బందిపోటుదొంగలు గుర్తుకు వస్తున్నారు.

ఒక్కో స్మార్ట్ మీటర్ నిర్వహణ, వ్యయం కలిపి రూ.36,975లకు షిర్డీసాయిసంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు. దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రైతులువినియోగించే వ్యవసాయ మోటార్లకంటే, స్మార్ట్ మీటర్లధరే ఎక్కువగా ఉంది. టెక్స్ మో కంపెనీకి చెందిన మోనోబ్లాక్ 3హెచ్.పీ మోటార్ ధర (రిటైల్ ప్రైస్) నెల్లూరులో రూ.22,500లు. అదే కంపెనీ (కోయంబత్తూరు) నుంచి నేరుగా కొనుగోలు చేస్తే రూ.12వేలకే ఆ మోటార్ లభిస్తుంది. 5 హెచ్.పీ మోటార్ రిటైల్ ధర నెల్లూరులో రూ.30వేలుంటే, కంపెనీనుంచి నేరుగాకొంటే రూ.17వేలకే లభిస్తుంది.

7.5 హెచ్.పీ మోటార్ ధర రూ.32వేలుంటే, కంపెనీ ధర రూ.19వేలు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల నిర్వహణ, వ్యయానికి నిర్ణయించినధరకంటే రైతులువినియోగించే మోటార్ల ధరలే తక్కువగా ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల నిర్వహణ వ్యయం ధర ఏపీలోనే ఎక్కువ. ఉత్తరప్రదేశ్ లో అదానీసంస్థ స్మార్ట్ మీటర్ల నిర్వహణ, వ్యయానికి రూ.10వేలు కోట్ చేస్తే, ఆరాష్ట్ర ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ దాస్ కేన్సిల్ చేశారు.

యూపీకి అదానీవద్దు : ఏపీకి మాత్రం అదానీనే ముద్దు. అదానీసంస్థ గుజరాత్ కంపెనీ అయినా, ఉత్తరభారతదేశ కంపెనీ అయినా యోగి ఆదిత్యనాథ్ దాస్ నిర్ద్వందంగా తిరస్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అదానీసంస్థను అక్కునచేర్చుకొని రైతుల్ని లూఠీచేయడానికి సిద్ధమయ్యారు. రాజస్థాన్ లో ఒక్కో స్మార్ట్ మీటర్ ధర, మరియు నిర్వహణకు రూ.7,943లు కోట్ చేస్తే, చండీఘర్ లో ఎన్.ఎస్.జీ.ఎమ్ కంపెనీ రూ.9,710లు, అదే చండీఘర్ లో ప్రభుత్వకంపెనీ రూ.7,127లు కోట్ చేసింది. ఈ కంపెనీలన్నీ ఐదేళ్లకాలపరిమితికి స్మార్ట్ మీటర్ల నిర్వహణకు సంబంధించి కోట్ చేశాయి.

కానీ మనరాష్ట్రంలో మాత్రం ఒక్కో స్మార్ట్ మీటర్ ధర, నిర్వహణకు కోట్ చేసిన మొత్తం రూ.36,975లు. ఇదంతా గమనించాక రాష్ట్రం ఏమైపోతోంది అనిపిస్తోంది. 5స్టార్ రేటింగ్ లేని, నాన్ ఐ.ఎస్.ఐ మోటార్ల వల్ల విద్యుత్ వాడకం ఎక్కువవుతోందని గమనించి, 2018లో టీడీపీప్రభుత్వం పాతమోటార్ల స్థానంలో ఐ.ఎస్.ఐ గుర్తింపుఉన్న 5స్టార్ రేటింగ్ మోటార్లను ఉచితంగా రైతులకు అందించింది. దానివల్ల విద్యుత్ ఆదా అయ్యింది.

మోటార్లు ఏవి పెట్టినా పర్వాలేదు.. ఈమీటర్లు పెడితే చాలంటే విద్యుత్ ఆదా అవుతుందా? అంతిమంగా స్మార్ట్ మీటర్ల పేరుతో దోచుకుంటున్న రూ.17వేలకోట్ల భారం ప్రజలపైనే వేస్తున్నారు. ఈ ప్రభుత్వం రూ.78వేలకోట్లు డిస్కమ్ లకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే నష్టాలదెబ్బకు డిస్కమ్ లు కుప్పకూలిపోయే పరిస్థితి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10వేలు కోట్ చేసిందని అదానీసంస్థను తిరస్కరిస్తే, ఏపీప్రభుత్వం మాత్రం తమ అనుమాయుల కంపెనీ అని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు రూ.36,975లకు అప్పగించింది.

వ్యవసాయమోటార్లు హోల్ సేల్ గా రూ.12వేలు, రూ.17వేలకు వస్తుంటే, మీటర్ ధర రూ.37వేలా? ఏం సమాధానంచెబుతారు? ఈ కుంభకోణానికి సంబంధించి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కార్యాలయంలోనే అంచనాలు తయారుచేశారు. సీఎండీ అయన బృందం తిరుపతిలోని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కార్యాలయంలో కూర్చొని ఈవిధంగా దోపిడీకి ప్రణాళికలు రచించారు.

షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కార్యాలయంలో తిరుపతి సీఎండీకి ఏంపని? ఏంఒరగబెట్టడానికి ఆయన అక్కడ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యాడు. సమాచారహక్కు చట్టం కింద అడిగితే వివరాలు ఎందుకివ్వరు? ఎనర్జీ సెక్రటరీ విజయానంద్తో మాట్లాడినా కూడా ఎస్పీడీసీఎల్ సీఎండీ నేటికీ సమాచారం ఎందుకివ్వలేదు? మిగిలిన ఇద్దరు సీఎండీలుకూడా అరకొర సమాచారమిచ్చారు. దీనిపై తాము సమాచారహక్కు చట్టంకింద వివరాలు అడిగితే తిరుపతిసీఎండీ సమాచారంఇవ్వలేదు. విశాఖపట్నం ఈపీడీసీఎల్ సీఎండీ సమాచారం ఇచ్చారు.

ఆయనిచ్చిన సమాచారంలో ఈపీడీసీఎల్ పరిధిలో 2,58,587 మీటర్లుఉంటే, అదానీ కన్సార్టియం బీ.ఎస్.ఆర్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ (ఓ అండ్ ఎమ్ కాకుండా) వ్యవసాయ స్మార్ట్ మీటర్ ధరను రూ.24,334లుగా కోట్ చేసిందని చెప్పారు. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ రూ.23,647లు కోట్ చేసిందని చెప్పారు. రెండుసంస్థలుకోట్ చేసినదాని మధ్య వ్యత్యాసం కేవలం రూ.600లు. ఇదంతా గమనిస్తే అదానీ, షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థల మధ్యజరిగింది క్విడ్ ప్రోకో కాదా? వ్యవసాయమీటర్లను షిరిడీసాయి, గృహాలమీటర్లను అదానీసంస్థ కొట్టేయడానికి ముందే కూడబలుక్కున్నట్టుగా అనిపించడంలేదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 10లక్షలకోట్ల అప్పుల్లో రాష్ట్రముంటే, అసలే అప్పులపాలైన సీఎండీలను మరింత ముంచేలాఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? రూ.78వేలకోట్ల బకాయిలు పెట్టుకొని, సిగ్గులేకుండా మరో రూ.17 వేలకోట్లకుంభకోణానికి తెరలేపారు. షిరిడీసాయిసంస్థ దోపిడీ బహిరంగమైపోయింది. అందుకే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలంటున్నాం. వైసీపీప్రభుత్వం రాగానే మూడువిడతల్లో రూ.500కోట్లు మాఫీచేశారు. పనులు ప్రారంభించకుండానే షిరిడీసాయి సంస్థకు రూ.600కోట్లు కట్టబెట్టారు. తెలుగుదేశంప్రభుత్వంలో ట్రాన్స్ ఫార్మర్లధరలు ఎలాఉన్నాయో, ఇప్పుడు షిరిడీసాయిసంస్థకోసం ఎలా పెంచారో చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే.

25కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర టీడీపీప్రభుత్వహయాంలో రూ.58,500లు ఉంటే, వైసీపీప్రభుత్వంలో రూ.1,78,000లు. 63కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర అప్పుడు రూ.89వేలుంటే, ఇప్పుడు రూ.2,54,000లు. 100కేవీ ధర అప్పుడు రూ.1,20,000లుంటే, ఇప్పుడు జగనన్న రాజ్యంలో రూ.1,81,000లు. 160కేవీ ధర టీడీపీప్రభుత్వంలో రూ.2లక్షలు ఉంటే, ఇప్పుడు రూ.5,69,000లు. 315 కేవీ ధర అప్పుడు రూ.5,71,000లు, ఇప్పుడు రూ.16,75,000లు.

మా హాయాంలో ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన టెండర్లలో ఒక టెండర్ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్, మరోటెండర్ ఎస్.వీ.ఆర్ ఎలక్ట్రికల్స్, మరోటెండర్ ట్రినిటీ క్లీన్ టెక్, 4 వ టెండర్ తోషిబా వేశాయి. మొత్తంగా దాదాపు 6కంపెనీలు టెండర్లువేశాయి. ఇప్పుడుమాత్రం అదానీసంస్థ, షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థలే గుత్తాధిపత్యం చేస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ తోపాటు, ట్రాన్స్ ఫార్మర్ల కాంట్రాక్ట్ కూడా దక్కించుకున్న షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ఎంపీ అవినాశ్ రెడ్డిదే. ఈ కుంభకోణంద్వారా కొట్టేసినసొమ్ముని బాబాయ్ హత్యకేసునుంచి బయటపడటానికి ధారాళంగా ఖర్చుపెడుతున్నారని చెప్పుకుంటున్నారు.

ఈ విధంగా షిరిడీసాయిసంస్థకు దోచిపెట్టే సొమ్మంతా ప్రజలదే. ఒక విద్యుత్ వినియోగదారుడు 63యూనిట్లు వినియోగిస్తే, ఎనర్జీ ఛార్జీలు రూ.369లు, ఫిక్స్ డ్ ఛార్జీ రూ.150లు, కస్టమర్ ఛార్జీ రూ.40లు, ఎలక్ట్రికల్ డ్యూటీ రూ.63లు, ఎఫ్.పీ.పీ.సీ.ఏ ఛార్జ్ రూ.27లు, సర్ ఛార్జ్ రూ. 150లు, ట్రూఅప్ ఛార్జీ రూ.7లు. మొత్తం రూ.807లు. 63 యూనిట్ల విద్యుత్ వాడితే 807 రూపాయలా? ఒక్కో యూనిట్ ధర రూ.13లు. ఇప్పటికే ఈప్రభుత్వం 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఇప్పుడు ఈ 17వేలకోట్ల భారం కూడా అంతిమంగా ప్రజలపైనే పడనుంది. ప్రజలు ఇప్పటికైనా మేల్కోకపోతే ఇంకాఇంకా నష్టపోతారు.

నేను దీనిగురించి మాట్లాడుతున్నది ప్రజల్ని దృష్టిలోపెట్టుకొని. ఈ విషయాన్ని మీడియాకూడా ప్రజలదృష్టికి తీసుకెళ్లాలి. సాక్షిమీడియా కూడా వాస్తవాలు వెల్లడించాలి. నేను మాట్లాడిన దానిలో తప్పుంటే ఏ మీడియాసంస్థ అయినా నన్ను నిలదీయవచ్చు? వ్యవసాయ మీటర్ పై కేంద్రప్రభుత్వం రూ.900ల సబ్సిడీ, గృహల్లోని మీటర్ పై రూ. రూ.600ల సబ్సిడీ ఇస్తోంది. ఒక మీటర్ కు కేంద్రప్రభుత్వం రూ.900లు సబ్సిడీ ఇస్తుంటే ఏపీప్రభుత్వం రూ.36,975లుగా ధర నిర్ణయిస్తే ప్రజలకు ఎంతనష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతభారీగా ధరలు నిర్ణయించి, షిరిడీసాయిసంస్థకు వేలకోట్లు కట్టబెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాం. దేశంలోనే పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10వేలు కోట్ చేసిందని ఆదానీ సంస్థను తిరస్కరిస్తే, ఏపీ ప్రభుత్వం రూ.36,975లకు కట్టబెట్టడమేంటి?ఇంతభారీ ధర దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తిరుపతి సీఎండీ తన సిబ్బందితో షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకార్యాలయంలో ఏంచేశారు. ఎందుకు సమావేశమయ్యారు?

ట్రాన్స్ ఫార్మర్స్ సప్లై చేయకపోయినా, షిరిడీసాయిసంస్థకు వేసిన పెనాల్టీ రూ.500కోట్లను ఎందుకు మాఫీచేశారు? మిగతా కంపెనీల పెనాల్టీలు ఎందుకు రద్దుచేయలేదు?ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ టీడీపీప్రభుత్వం 6 కంపెనీలకుఇస్తే, ఈ ప్రభుత్వం ఒక్క షిరిడీసాయిసంస్థకే ఎందుకు ఇచ్చింది? ట్రాన్స్ ఫార్మర్లధరలు భారీగాపెంచి మరీ షిరిడీసాయిసంస్థకు టెండర్లు ఎందుకు కట్టబెట్టారు? ఏపీలో ఒక్కో మీటర్ నిర్వహణ, ధరను రూ.37వేలుగా ఎందుకు నిర్ణయించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పమనండి. అప్పుడు ఎవరిది తప్పో తేలుతుంది.”

వ్యవసాయ, గృహావసరాలకు సంబంధించిన స్మార్ట్ మీటర్ల టెండర్లను ఏపీప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఇంతజరుగుతుంటే కేంద్రప్రభుత్వం ఏంచేస్తోంది? తక్షణమే కేంద్రం ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి. పీ.ఎఫ్.సీ (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్) కూడా జోక్యంచేసుకోవాలి. కేంద్రం స్పందించకుంటే దీనిపై న్యాయస్థానాల్ని ఆశ్రయించి సీబీఐ విచారణ జరిగేలా చూస్తాం.”

LEAVE A RESPONSE