Suryaa.co.in

Features

నగరంలో ఓ జీవితం..

కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాల్లో అందరి జీవితాలు యాంత్రికమే..!
నీకు నేనున్నానని, నీకు తోడై నిలుస్తాను అని భరోసా ఇచ్చేవారి జాడలు ఎండమావులే ఇక్కడ.
బ్రతుకు పోరాటంలో ఎందరిలోనో మానసిక సంఘర్షణలు..మరెన్నో ఆవేదనలు, ఆ వెనుకనే తమని తామే ఊరడింపు చేసుకునే ఘటనలు నిత్యకృత్యాలే ఇక్కడ వారికి.
అందుకే..” మూడు కాలాలలో ను… ముల్లోకాలలోను శ్రమైక శ్రమైక జీవనానికి సమానమైనది లేదురా..” అనే శ్రీ శ్రీ గీతంలోని ధోరణికి అద్దం పడుతూంటాయి నగరాల్లోని చాలమంది జీవితాలు.అటువంటి ఒకరి యాంత్రిక జీవితానికి అక్షర రూపాన్ని ఇచ్చే ప్రయత్నమే “నగరంలో ఓ జీవితం”.. అనే ఈ కధానిక..!
***

సకల జనానికి రాత్రి అంతా జోలపాడి అలసినట్టుగా చంద్రుడు నిష్క్రమిస్తూంటే… ఎవరి విధులను వారికి గుర్తు చేస్తునట్లుగా సూర్యుడు తన దినచర్య ప్రారంభిస్తున్నాడు.
ఆ రోజు శనివారం… అబిడ్స్ ప్రాంతం.
చుట్టూ పరికించి చూస్తే ఎత్తైన భవనాలు.. వాటిని తాకుతున్నయా అన్నట్లుగా ఆకాశంలోని మేఘాల పరుగులు… ఆ మేఘాల వేగంతో పోటీ పడుతున్నట్టు గా భూమి మీధ జనం బ్రతుకు తెరువు కోసం పరుగులు.
వాహనాల రణగొణ ధ్వనుల అలికిడికి అప్పుడే మెలుకువ వచ్చింది మోహన్ కి. బద్ధకంగా ఆవలిస్తూనే గత జ్ఞాపకాల ఒడిలోకి జారుకున్నాడు.
***
పట్నంలోని బడికి వెళ్ళే బస్సుకోసం తాము ఉండే పల్లెలోని పచ్చని పైర్లు మీదగా పొలాల వెంబడి పరుగులు….
ఆసమయంలో చల్లని చిరు గాలికి పచ్చని పైర్ల సవ్వడిలు..
ఆ పైర్ల నడుమే అమ్మ పొదుగు కోసం లేగదూడల అరుపులు..
….అంతేనా…”ఓరేయ్ మోహన్.. ఈ క్యారేజి తీసుకుని లంచ్ టైమ్ లో తినరా.. అంటూ ఆ పచ్చని పైర్ల వెంబడి పరిగెడుతూ అమ్మ పిలుస్తున్న పిలుపులు…. ఒక్కసారి తన చెవిని తాకినట్లుగా అనూభూతి కలిగింది మోహన్ కి.
అల్లారం గట్టిగా మ్రోగడంతో జ్ఞాపకాల ఒడిలో నుండి వర్తమానంలోకి వచ్చేసాడు…!

***
శనివారం కావడంతో..త్వరగానే ఆఫీసులో పని ముగించుకుని తన మావయ్య ఇంటికి చేరుకున్నాడు మోహన్.
“ఏరా మోహన్ బాగున్నావా..” అని తన మావయ్య అంటున్నమాటలు గుమ్మంలోకి అడుగు పెట్టిన మోహన్ కి వినపడ్డాయి.
ఆ పిలుపులోని అప్యాయతకి మోహన్ మనస్సు ఒక్కసారిగా పులకించిపోయింది. ఆ పులకరింతతో తాను రోజంతా పడుతున్న కష్టం ఒక్కమారు ఎవరో చేతితో తీసిపారేసినట్టు అనిపించింది మోహన్ కి.
“అవును మావయ్య..బాగానే ఉన్నాను.. మీరందరూ ఎలా ఉన్నారు? రేపు ఆదివారం కదా మీ అందరితో సరదాగా గడపొచ్చు అని వచ్చాను. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. మీరు తప్ప అని మోహన్ తన మాటను పూర్తి చేస్తుండగానే.
“ వారం తర్వాత మాకు పిల్లలతో ప్రశాంతంగా గడిపేరోజు ఆదివారం.. ఆరోజు కూడా ఎవరో ఒకరు వచ్చి ఇంటిమీద పడితే ఎలా..పైగా ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఇది. అంటూ కిచెన్ లో నుండి అత్తయ్య అంటున్న మాటలు నెత్తిమీద పిడుగు పడినంతగా బాధించాయి మోహన్ కి.
మరుక్షణమే బిక్కమొహంతో… చాలా కాలం అయిందని ” మిమ్మల్ని ఓ మారు చూసి పోదామని వచ్చాను అంటూ పలకడం మినహా మోహన్ కి మరో గత్యంతరం లేకపోయింది.
“తటపాయిస్తూనే.. “కనీసం వారానికి ఒక్కసారైనా మీరు ఎలా ఉన్నారో ఫోన్ చేస్తూ ఉంటాను మావయ్య అంటూ నిలబడి ఉండిపోయాడు మోహన్.
“ఎందుకురా ఫోన్లు చేస్తూ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోవడం. ఏదైనా పని ఉంటే నేనే చేస్తానులే” అంటూ మోహన్ వైపు చూడకుండానే దినపత్రిక పేజీలను విసురుగా తిరగేస్తు అన్నాడు మావయ్య.
తనపట్ల మావయ్య వైఖరి, అత్తయ్య పుల్ల విరుపు మాటలు మనస్సుకు తూటాలుగా తాకడంతో అక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు మోహన్ కి.
***

ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూనే చీకటి వేళకి మెస్ కి చేరాడు మోహన్.
“ జీవితం మరీ యాంత్రికం అయిపోయింది. అవసరాల ప్రాతిపదికనే గౌరవ మర్యాదలు..ఆదరణలు దక్కుతున్నాయి.
చివరికి చావు విషయాలకు సంబంధించిన పలకరింపుల విషయంలో కూడా ఆర్థిక స్తోమత అంశాలే ప్రాధాన్యతవహిస్తున్నాయి.
నిజంగా నగర జీవితాలు చాలమటుకు నరక ప్రాయం అని మనస్సులో అనుకుంటూ పరజ్ఞానంలో మునిగిపోయాడు మోహన్.
“ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక…ఏ దారి ఎటుపోతుందో ఎవరిని అడగక….” అంటూ మెస్ లోని స్పీకర్ లో వస్తున్న పాట విన్న మోహన్ కి కళ్ళు చెమర్చాయి.

****
“ నీలోని కష్టపడే గుణం భవిష్యత్తులో నిన్నుఎంతో ఎత్తుకు తీసుకుని వెలుతుందిరా మోహన్”అంటూ చిన్నతనంలో తనతోటి స్నేహితులు అన్నమాటలు రూమ్ లో సేదతీరుతున్న మోహన్ కి గుర్తుకొచ్చాయి.
“ఎంతో ఎత్తుకు ఎదడగడం మాట దేవుడెరుగు..జీవితం మాత్రం కష్టాలు పాలవుతోంది..
మనుషుల్లో ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, మానవీయ విలువలు అంతకంతకూ అంట కాగుతున్నాయి ఈ కాంక్రీట్ జంగిల్ లోని చాలామందిలో…
అన్నింటా స్వార్థమే… ” – తాము బాగుంటే చాలు, మిగతా సమాజం ఏమై పోయిన పరవాలేదు అనుకునేవారిదే పైచెయ్యి అవుతోంది ఈ రోజుల్లో… అంటూ బాధతప్త హదయంతో ఒక్కమారు ఆకాశం కేసి చూసాడు మోహన్..
సరిగ్గా ఆ సమయంలోనే మేఘాలు ఎరుపెక్కి ఉన్నాయి. మనస్సులోని బాధతో బరువెక్కిన తన గుండెల్లాగే ఆ మేఘాలు ఉన్నట్లుగా తోచింది మోహన్ కి.
ఇంతలో చినుకులు కూడా ప్రారంభమయ్యాయి..తన మనసులోని భారాన్ని చినుకుల రూపంలో మేఘాలు జార విడుస్తున్నట్టుగా అనిపించింది మోహన్ కి.
కొన్ని జ్ఞాపకాలు మకరందపు మాధుర్యాన్ని కురిపిస్తాయి…ఆ మాటునే తెనెటీగల కాటు బాధను కూడ మనస్సుకు కలిగిస్తాయి. అటువంటి జ్ఞాపకాలు గత సంఘటనలను సజీవంగా మనలో నిలుపుతాయి.
అటువంటి జ్ఞాపకాలు పొరలు పొరలుగా మోహన్ మనస్సులోకి చొచ్చుకొచ్చాయి ఆక్షణంలో…
**
అట్లతద్ధినాడు ఉదయాన్నే స్నేహితులతో చద్దిమూట ఆటలు…ఆ ఆటల్లో భాగంగా స్ధానికుల పెరట్లలోని చెట్ల కాయలను కోసేయ్యడం… మరొకరి ఇంటికి గొళ్లాలను పెట్టడం.. ఒకరి ఇంటి నెమ్స్ బోర్డులను మరొకరి ఇంటికి తగిలించేయడం. ఈ క్రమంలో దొరికి పోయిన వాళ్ళకి పెద్దలచే అరదండలు వంటి తన చిన్ననాటి సంఘటనలు మోహన్ కళ్ళముందు కదలాడాయి…
అంతేనా… “అందరికి ఒకే బంతి బదులు తలోకరికి ఒక్కొక్క బంతిని ఇస్తే ఎవరి ఆటను వారే ఆడుకుంటారు కదా..” అని ఫుట్ బాల్ ను ఆడిస్తున్న డ్రిల్ మాష్టారుతో పరిహాసం..వెనువెంటనే మాష్టారి చేత చివాట్లు తినడం.
అదే విధంగా.. జనవరి ఫస్ట్ నాడే పుట్టిన రోజు జరుపుకునే ఆడ పిల్లలను ఉద్దేశించి… “నూతన సంవత్సర తార…ఉదయించెను ఈపూట…ప్రకాశించును ఇకపై ప్రతి ఏటా” అని క్లాస్ రూంలోని బ్లాక్ బోర్డ్ పై కొంటెగా వ్రాయడం.
దరిమిలా క్లాస్ లోని మగ పిల్లలు అందర్నీ మాస్టర్లు ఎండలో నిలబెట్టడంవంటి నేటికీ నవ్వు తెప్పించే నాటి సంఘటనలు కళ్ల ముందు తచ్చాడాయి మోహన్ కి …
“మీరు మాకు కన్నబిడ్డల కంటే ఎక్కువే.మీకు జన్మ ఇచ్ఛింది తల్లి తండ్రలు అయితే…మంచి నడతతో సమాజంలో ఉన్నత స్థితికి మీరందరూ చేరుకోవాలనే తపన మీ పట్ల మా అందరికీ వుంటుంది. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని దండించాం, కాని అవి అన్ని మీపై ఉన్న మమకారంతో చేసినవే… మీ అభ్యున్నతిని ఆశించి చేసినవే. విద్యా సంవత్సరం ముగిసినప్పుడు కన్నబిడ్డల్ని వీడుతున్నామనే బాధ మాకు ప్రతి ఏడాది రివాజై పోయింది.
మేము కూడ మీ వయస్సులో మీలాగే అల్లరి చేసిన వాళ్లమే, గురువుల చేత దండింపబడ్డ వాళ్ళమే. నాటి అల్లర్లు, దండనలు. మమ్మల్ని మేము తీర్చి దిద్దుకునేందుకు సోపానాలు అయ్యాయి” అని నాడు ఉపాధ్యాయిలు అంటున్న సందర్భం తన కండ్ల ముందు కదలాడాయి మోహన్ కి.
ఈనాటికి అనిపిస్తూ ఉంటుంది. ఏ నలుగురైనా గుమికూడినచోట నాటి స్నేహితులు, ఉపాధ్యాయులు ఎవరైనా తారస పడతారేమోనని.
..అయినా ఈ జీవిత ప్రయాణంలో ఎవరి గమ్యం వాళ్లది…
…..ప్రయాణంలో ఉన్నంత వరకే ఒకరికొకరం… అటు తరువాత ఎవరికి వారే యమునాతీరే కదా….. అని మనసులో అనుకున్నాడు మోహన్.
ఈ విధంగా నాటి జ్ఞాపకాల ఊరడింపు తో కొంత బరువును తన గుండెలపై నుండి దించుకున్నట్లు అనిపించింది మోహన్ కి.
క్రమ క్రమంగా తీపి జ్ఞాపకాల జోలపాటతో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు మోహన్.
***
రోజులాగే తెల్లవారింది. పక్షులు తమ కిలకిల రావాలతో బయలు దేరాయి.వాటి జీవన యాత్ర కోసం!
“కాలం, పరిస్థితులు మోసం చేస్తున్నాయని నిందించుకుంటూ కూర్చోవడంకాదు.
కాలంతో మమేకమై నడవడమే ఉత్తమం. అప్పుడే పరిస్థితులు అవగతం అవుతాయి.చక్కని జీవన పరిస్థితులకు మార్గాలు ఏర్పడతాయి.” అనే స్ఫూర్తి పక్షులను తదేకంగా చూస్తున్న మోహన్ కు కలిగింది.
…. వాటిలాగే మోహన్ కూడా ఆశల జీవితంలోకి పరుగులు తీస్తున్నాడు యాంత్రికంగా.

-శ్రీపాద శ్రీనివాస్

LEAVE A RESPONSE