ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న సంఘటన, మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని సమానత్వం మరియు నిబంధనలపట్ల గౌరవం ఎంత ముఖ్యమో మరోసారి పునరుద్ఘాటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, నారా భువనేశ్వరి , హైదరాబాద్ నుండి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తుండగా, తెలంగాణ ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు తమ కర్తవ్యంలో భాగంగా ఆమె వాహనాన్ని తనిఖీ చేశారు.
ఇక్కడ ప్రధానంగా గమనించదగ్గది తనిఖీ కాదు, ఆమె చూపిన ఔన్నత్యం. ఎటువంటి ఆర్భాటం లేకుండా, విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించడం, చిరునవ్వుతో పలకరించడం – ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలనే విలువను ప్రతిబింబించింది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా నిబంధనలకు లోబడి ఉండటం, విధి నిర్వహణలో ఉన్న అధికారులకు గౌరవం ఇవ్వడం – ఇవే ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు.
ఈ సంఘటనలో భువనేశ్వరి చూపిన సౌమ్యం, హుందాతనం కేవలం వ్యక్తిగత లక్షణాలు కాదు; ప్రజాస్వామ్యానికి ఇచ్చిన నిలువెత్తు గౌరవం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు కాదు; అది రాజ్యాంగ నియమాల సమానత్వం. అధికారంలో ఉన్నవారు కూడా అదే నియమాలకు లోబడి ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఈ సంఘటన మనకు చెప్పే గొప్ప సందేశం – ప్రజాస్వామ్యం విలువలు చిన్న చిన్న సంఘటనల్లో గొప్ప పాఠాలుగా మారుతాయి.