– అందరూ ఉన్నా ఎవరూ లేని అనాధలా ఓ అమ్మ
– అనారోగ్యంతో రమేష్ ఆసుపత్రిలో చికిత్స
– ఆస్తులు తీసుకుని వెళ్లగొట్టిన వారసులు
– కోడలు గుంటూరు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
– మాకు సంబంధం లేదంటూ సమాధానం
– వృద్ధాశ్రమంలో బతుకుతున్న ఓ వృద్ధురాలి దైన్యం
– బోదకాలతో ఆసుపత్రిలో చేరిన వైనం
– జీవితచరమాంకంలోనయినా చూడాలని అమ్మ అభ్యర్ధన
– గుంటూరులో ఇదో మానవ విషాదం
– కలెక్టర్, మానవహక్కుల కమిషన్ జోక్యమేదీ?
– కోరలు లేని సీనియర్ సిటిజన్ యాక్ట్
– తెగిపోతున్న మానవ సం‘బంధాలు’
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది గుంటూరు రమేష్ ఆసుపత్రి. బెడ్ మీద 76 ఏళ్ల వృద్ధురాలు. కాలికి కట్టుతో దీనంగా చూస్తోంది. తనకోసం కొడుకు, కోడళ్లు రాకపోతారా అని కళ్లలో వత్తులు వేసుకుని చూస్తోంది. ఎవరైనా ఆ గదిలోకి వస్తే.. అది తనకోసమేనన్న భ్రమతో వారివైపు ఆశగా చూస్తోంది. ‘‘నరకయాతన పడుతున్నా. తీసుకువెళ్లు కన్నా’ అని కొడుకుకు చేసిన ఫోన్లతో ఆమె ఫోను బ్యాటరీ అయిపోతోంది తప్ప, కన్నకొడుకు కానరాడు.
ఎంతమందికి చెప్పి పంపినా అయిపు అజా లేడు. కోడలు పెద్దాఫీసరు. అంటే గుంటూరులోనే కమర్షియల్ టాక్స్ ఆఫీసరన్నమాట. శ్రీశైలంలో ఉన్న మరో కోడలికి ఫోను చేస్తే ‘తనవి కూడా సినిమా కష్టాలేన’న్న జవాబు. మరి ఆ అమ్మ ఇప్పుడు ఏం చేయాలి? ఆసుపత్రి నుంచి ఎక్కడికి వెళ్లాలి? ఈ వయసులో ఆమెను చూసేదెవరు? ఇదీ.. కోటిరూపాయల ఆస్తులు కొడుకులకు ఇచ్చి, ఎవరూ లేని అనాధలా వృద్ధాశ్రమంలో బతుకుతూ.. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న ఓ అమ్మ కథ. మానవ సం‘బంధాలు’ తెగిపోతున్న కాలానికి బలయిపోతున్న, ఓ వృద్ధురాలి వ్యధాభరిత వేదన ఇది.
ఆమె పేరు మలిశెట్టి గోవిందమ్మ. వయసు 76. గుంటూరులో నివసించే ఆమె భర్త రైల్వేలో పనిచేసి, రిటైరన తర్వాత మరణించారు. ఆమెకు ఇద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు రెండేళ్ల క్రితం మృతిచెందాడు. తర్వాత పెద్దకోడలు-చిన్న కోడలి అవసరార్ధం, ఆమె తన ఇళ్లు అమ్మి చెరో 50 లక్షలు ఇచ్చేసింది. ఇప్పుడు ఆమెకు భర్త ద్వారా సంక్రమించిన పెన్షనే ఆధారం.
ఇక అప్పటినుంచి ఆ వృద్ధురాలిని పట్టించుకోవడం మానేశారు. దానితో గుంటూరులోని బసవపున్నయ్య ఓల్డేజీ హోంలో ఉంటోంది.
బోదకాలితో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని.. ఓల్జేడీ హోం నిర్వహకులు గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స తీసుకుంటోంది. ఆమెను మరికొద్దిరోజుల్లో డిశ్చార్జి చేస్తారు. ఇంతవరకూ బాగానే ఉంది. డిశ్చార్జి చేసిన తర్వాత ఆమె ఎక్కడ ఉంటుంది? ఇదీ ప్రశ్న.
కేంద్రప్రభుత్వ పెన్షనర్ అయిన ఆమె దగ్గర డబ్బులయితే ఉన్నాయి గానీ, చూసేందుకు మాత్రం ఎవరూ లేరు. గుంటూరు బ్రాడీపేట 6/14లోని, యాగంటి అపార్టుమెంట్‌లో ఉంటున్న కొడుకు మలిశెట్టి రవికుమార్‌కు వృద్ధాశ్రమం నిర్వహకులు ఫోన్ చేస్తే.. తన తల్లి చనిపోయిందని, ఆమె గురించి తనకు ఫోన్ చేయవద్దని కసురుకున్నాడట. కోడలు మలిశెట్టి సుచరిత గుంటూరు2, జెసి ఆఫీసు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ అని గోవిందమ్మ చెబుతోంది. శ్రీశైలంలో ఉంటున్న తన పెద్ద కోడలి మలిశెట్టి లతకి ఫోన్ చేసినా, స్పందించడం లేదని కన్నీటిపర్యంతమయింది.
‘నాకు వారి డబ్బులేమీ అవసరం లేదు. నేను ఇచ్చిన డబ్బులు కూడా వారిని అడగటం లేదు. చరమాంకంలో నన్ను కనిపెట్టుకుని ఉండమని మాత్రమే కోరుతున్నా. ఇదే కన్నతల్లిగా నేను చేసే అభ్యర్ధన’ అని గోవిందమ్మ భోరున విలపిస్తూ చెప్పింది. ఇదీ ఆస్తులు తీసుకుని, గోవిందమ్మను వెళ్లగొట్టిన కొడుకు-కోడళ్ల కథ.
అయితే నిజానికి తలిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, సీనియర్ సిటిజన్ యాక్టు ఒకటి అమలులో ఉంది. దానిని రెవిన్యూ శాఖ పర్యవేక్షిస్తుంది. కానీ ఆ చట్టానికి అంతపెద్ద కోరలు ఉన్నట్లు కనిపించడం లేదు. మరి ఇలాంటి గోవిందమ్మలు దేశంలో గజానికి ఇద్దరున్నారు. వారి సంరక్షణ బాధ్యత ఎవరిది? తలిదండ్రులని స్వయంగా దగ్గరుండి చూడాలని ఎందుకు కఠినంగా ఆదేశించరు? ఇవీ వృద్ధులైన తలిదండ్రుల ప్రశ్నాస్ర్తాలు!
జిల్లా కలెక్టర్, మానవ హక్కుల కమిషన్లు కూడా ఇలాంటి అరాచకాలు-అమానవీయ ఘటనలపై, స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ ఇలాంటి వృద్ధులు ఓపిక చేసుకుని కలెక్టర్ బంగ్లా వద్దకు వెళితే, అక్కడ కలెక్టర్ల దర్శనం దొరకడం దుర్లభం. మరి ఈ గోవిందమ్మలకు దిక్కెవరు నాయకా? ఇది కూడా చదవండి:ఇలాంటి మృగాలు..