అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్

అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి, అంగన్వాడీల సమ్మె విరమణకు చొరవ చూపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు.

తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. గత 4 ఏళ్లుగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించమని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టలేదు. సమ్మె నోటీసు ఇచ్చి 20 రోజులు గడిచినా జగన్ సర్కార్ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడంతో అంగన్వాడీలు సమ్మెకు వెళ్ళక తప్పలేదు. గత ఎన్నికలకు ముందు తాను అధికారం చేపట్టగానే అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.1000లు పెంచి జీతాలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాటతప్పి మడమ తిప్పారు.

జీతాలు పెంచబోమని ఖరాఖండిగా చెబుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను తీర్చి, సమ్మె విరమింప చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

మార్క్సిస్టు మేధావి, సిపిఐ అగ్రనేత కామ్రేడ్ నీలం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ నీలం రాజశేఖర్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలోని భూస్వామ్య కుటుంబంలో జన్మించారన్నారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన కాలంలో కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితులైనారని, ఆ తదుపరి కాలంలో అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగా, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యునిగా కమ్యూనిస్టు పార్టీ పురోభివృద్ధికి ఎనలేని సేవలందించారన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారన్నారు. పోరాటంతో పాటు అధ్యయనం కూడా ముఖ్యమైననే అంశాన్ని చాటి చెప్పారన్నారు.

సిద్ధాంతంతో కూడిన ఆచరణ ముఖ్యమని నమ్మిన నీలం రాజశేఖర్ రెడ్డి గారు మార్క్సిస్టు అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించారన్నారు. ఎంతోమంది యువ కమ్యూనిస్టులను తయారు చేశారని కొనియాడారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ కార్మికవర్గ దృక్పథంతో పనిచేశారన్నారు. ఎంతోమందికి ఆయన అభిమానపాత్రుడయ్యారనీ, ఆ మహనీయుని స్ఫూర్తితో నేటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.

దేశంలో వ్యవస్థలకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కమ్యూనిస్టు ఉద్యమం మరింత ముందుకు పోవాల్సిన ఆవశ్యకత తప్పనిసరన్నారు. ఆ దిశగా కమ్యూనిస్టు శ్రేణులు ఐక్యంగా దేశంలోని విపత్కర పరిస్థితిలను ఎదుర్కోవాల్సి ఉందని, కోట్లాదిగా ఉన్న కార్మిక వర్గ శ్రేణులు సంఘటితంగా కదిలి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని కాపాడుకోవాలని కోరారు.

Leave a Reply