-నిరుపేదలకు ఏపీలోనే క్యాన్సర్‌కు చికిత్స
-క్యాన్సర్ చికిత్సకు అత్యంత ప్రాధాన్యత
-వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది
-అధికారుల కృషితోనే జగనన్న ఆశయాలు నెరవేరతాయి
రాష్ట్రంలో 3.2 కోట్ల మందికి “అభా” ఐడీలు
-హెచ్ఐవీ అవగాహన కార్యక్రమాలు చురుగ్గా సాగాలి
-అన్ని ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులలో బ్లడ్ బ్యాంకుల ఏర్పాటుకు అంచనాలు ఇవ్వండి
-మరింత పటిష్టంగా అన్ని మెడికల్ కళాశాలల, అనుబంధ ఆస్పత్రుల అత్యవసర విభాగాలు
-క్యాన్సర్, ఎయిడ్స్ నివారణ, కార్యాచరణపై సిఎం దృష్టికి తీసుకెళ్తా
-సిఎం ప్రోత్సాహంతో వైద్య ఆరోగ్య శాఖను మరింత ముందుకు తీసుకెళ్తా
-ఆరోగ్యశ్రీ ద్వారా మూడేళ్లలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు క్యాన్సర్ రోగులకు చికిత్స కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని
-ఏపీ శాక్స్, ఆయుష్మాన్‌భారత్, క్యాన్సర్ చికిత్సపై నూతన విధానం తదితరాలపై పూర్తిస్థాయి సమీక్ష చేసిన మంత్రి విడదల రజిని
ఏపీలో ప్రభుత్వం నుంచి క్యాన్సర్ కి అధునాతన చికిత్స , వైద్యాన్ని అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ కాన్ఫరెన్స్ హాలులో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ( ఏపీ శాక్స్) , ఆయుష్మాన్‌భారత్, క్యాన్సర్ చికిత్సలో నూతన విధానం… తదితర అంశాలపై మంత్రి విడదల రజిని సంబంధిత శాఖ అధికారులతో శనివారం పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2030 కల్లా ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు, అత్యవసరంగా విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో మూడు క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు, తిరుపతిలో చిన్న పిల్లల క్యాన్సర్ కేర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోట్లాది రూపాయల ఖర్చుతో కేన్సర్ చికిత్సా పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ మూడేళ్లలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు క్యాన్సర్ రోగులకు చికిత్స కోసం ఖర్చు చేశామని వివరించారు.
ఇలా అన్ని విధాలా క్యాన్సర్ బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. అధికారులంతా ప్రత్యేక చొరవ చూపాలని, క్యాన్సర్ రోగులు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా చూడాలన్నదే సిఎం ధ్యేయమని చెప్పారు.. జగనన్న ఆశయాలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగునంగా అంతా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధికి చికిత్సలో సరికొత్త విధానాలను తీసుకొస్తున్న ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ క్యాన్సర్ టెస్టులు చేస్తామని, ఇప్పటికే చిత్తూరు జిల్లాను పైలట్‌గా తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. క్యాన్సర్ రోగాన్ని తొలి దశలో గుర్తిస్తే నిర్మూలించడం చాలా తేలికని, అందుకే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయమే అయినా జగనన్న ధైర్యంగా ముందడుగు వేస్తున్నారని చెప్పారు.
పాలియేటివ్ కేర్‌కు అనుమతి
రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల ఆస్పత్రుల్లో కనీసం ఐదు పడకల సామర్థ్యంతో పాలియేటివ్ కేర్ యూనిట్లు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జిఎస్ నవీన్‌కుమార్ మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఆమె వెంటనే స్పందించి ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంఈ విభాగం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి జగనన్న వైద్య ఆరోగ్యశాఖకు ఎన్ని నిధులైనా ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
చావుబతుకుల్లో ఉన్నవారికి భరోసాను, ఉపశమనాన్ని కల్పించే పాలియేటివ్ కేర్ యూనిట్లను వెంటనే ఏర్పాటుచేయాలని చెప్పారు. వీటి నిర్వహణకు ఎన్ హెచ్ ఎం నిధులు వాడుకోవాలని చెప్పారు. అన్ని జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు, అన్ని సీహెచ్‌సీల్లో బ్లడ్ స్టోరేజి యూనిట్ల ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని అధికారుల నుంచి అభ్యర్థన రాగా… మంత్రి సానుకూలంగా స్పందించారు. అన్ని ఆస్పత్రుల్లో వాటి ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాలను మరింత పటిష్టం చేయాలని చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయం వ్యవస్థ వల్ల ఎంతో మేలు
ఇప్పటివరకు ఏపీలో 3.21 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు (అభా) ఇవ్వగలిగామని, మన రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన సచివాలయ వ్యవస్థ వల్లనే ఇది సాధ్యమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. హెచ్ఐవీ నియంత్రణకు సంబంధించి ఏపీ శాక్స్ మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో హెచ్ఐవీ అవగాహన పోస్టర్లు ఏర్పాటుచేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి హెచ్ఐవీ అవగాహన పోస్టర్లు, వాల్ బోర్డులను మంత్రి రజిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులంతా పాల్గొన్నారు.