– జూలై 15 లోగా మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావలసిందే
– రిటైనింగ్ వాల్ భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి
– ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఏడు రోజులలో నివేదిక అందించాలి
– రెవెన్యూ ,హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం : దశాబ్దాల నుండి ఖమ్మం పాలేరు నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముప్పు సమస్యకు మరో ఏడు నెలల్లోగా శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ ,హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నదీ తీరం వెంబడి రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల ఆర్సిసి రిటైనింగ్వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు.
వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జూలై 15 వ తేదీలోగా ఎట్టి పరిస్దితులలోనూ పనులను పూర్తి చేసి తీరాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి 234 ఎకరాల భూమి అవసరం ఉండగా 64 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండగా 170 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయని వెంటనే ఈ భూములను సేకరించడానికి యజమానులతో మాట్లాడి యుద్ధ ప్రతిపాదికన భూసేకరణ జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో మున్నేరు వాగు పొంగి పొర్లడం వల్ల ఖమ్మం, పాలేరు నియోజకవర్గం ప్రజలు తరచూ వరద సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటువంటి పరిస్థితిని నియంత్రించడానికి రిటర్నింగ్ వాల్ నిర్మాణం ఒకటే పరిష్కారం అని అన్నారు.
రిటైనింగ్ వాల్ డిజైన్ చేసే సమయంలో చెక్ డ్యాం ప్రవాహం పరిగణలోకి తీసుకున్నారా, నగరంలోని క్యాచ్ మెంట్ ఏరియా నుంచి వచ్చే వరద అంచనా ఎంత వంటి వివరాలను ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. ప్రతి నెల రెండు రోజులు ఈ పనులను తనిఖీ చేయడం జరుగుతుందని, ప్రతి రోజూ ఎంత మేరకు పని జరగాలో ప్రణాళిక తయారు చేసుకోవాలని, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఫీల్డ్ లెవల్లో ఏర్పాటు చేయాలని, ప్రతి రోజు పనుల పురోగతి వివరాలు వాట్సాప్ లో అప్ డేట్ చేయాలని అన్నారు.
మున్నేరు నది ఎఫ్.ఎస్.టి. వివరాలు తెలుసుకున్న మంత్రి, గత సెప్టెంబర్ లో వచ్చిన విధంగా భారీ వరదలు వస్తే ఎంత మేరకు నీరు చేరుతుంది, అధికంగా ఫోర్స్ తో నీటి ప్రవాహం వచ్చినప్పుడు తట్టుకునేందుకు రిటైనింగ్ వాల్ లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు.
మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ ఎంజాయ్ మెంట్ సర్వే రెండు రోజులలో పూర్తి చేసి వివరాలు సమర్పించాలని కలెక్టర్ కు తెలిపారు. ఎన్.ఎస్.పి. సంబంధించిన భూములు, ఖమ్మం అర్బన్ లోని భూములు ఎంత సేకరించాలి, దానికి నిర్దేశించుకున్న ప్రణాళిక ఇటువంటి పూర్తి వివరాలు నివేదికలు ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
మున్నేరు నది బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాల వివరాలు, ఖమ్మం అర్బన్ పరిధిలో ప్రభుత్వ భూములలో జరిగిన ఆక్రమణలకు సంబంధించి వారం రోజులలో పూర్తి నివేదిక అందించాలని రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు.
భూ సేకరణ కోసం సంబంధిత రైతులతో సంప్రదింపులు జరిపేందుకు నిపుణుల కమిటీ నియమించుకోవాలని అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చేలా చూడాలని అన్నారు.
ఎంజాయ్ మెంట్ సర్వేలో ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములుగా క్రింది స్థాయి సిబ్బంది ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడ ఎటువంటి అవకతవకలకు పాల్పడడానికి వీలు లేదని మంత్రి స్పష్టం చేశారు.