Suryaa.co.in

Andhra Pradesh

చుక్కల భూమి సమస్యకు శాశ్వత పరిష్కారం

-ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు పాలాభిషేకం
-నెల్లూరు రైతులకు ఇక ఆ భూసమస్యలు ఉండవు
-చుక్కల భూమి పరిష్కారంపై జీఓ నెం.163 జారీ
-సీఎం నిర్ణయంతో 23 వేల మంది రైతులకు లబ్ధి
-చుక్కల భూమి రైతులకు త్వరలో పట్టాల పంపిణీ
-ఒకే విడతలో అన్నీ క్లియర్‌. రైతులకు భూములు
-మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రకటన

దశాబ్ధాల సమస్యకు పరిష్కారం:
దశాబ్దాలుగా చుక్కల భూమి సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతులు మరింత సమస్య ఎదుర్కొంటున్నారు. చుక్కల భూమి సమస్య పరిష్కారం కోసం గతంలో చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి. ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలా.. సీఎం వైయస్‌ జగన్, సరళీకృత నిబంధనలు తీసుకొచ్చారు. వీఆర్‌ఓ, ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్‌.. చివరకు సీసీఎల్‌ఏ ఆమోదం తర్వాత చుక్కల భూమి నుంచి తొలగించాలనే నిబంధనను సీఎంగారు సరళీకరించారు. దీంతో నెల్లూరు జిల్లా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇందుకు జిల్లా రైతుల పక్షాన సీఎం వైయస్‌ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడి రైతుల గోడు పట్టించుకుని, సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినందుకు ఆయనకు పాలాభిషేకం చేశాం.

అసలు ఏమిటీ సమస్య:
బ్రిటిష్‌ పాలన హయాంలో సర్వే చేసినప్పుడు ఒక భూమి ఎవరికీ చెందినట్లు లేకపోతే, ఆ భూమికి మూడు చుక్కలు పెట్టారు. వాటినే చుక్కల భూములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చుక్కల భూముల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. చుక్కల భూమి సమస్యపై రైతు దరఖాస్తు చేస్తే, అధికారుల దగ్గర నెలల తరబడి అపరిష్కృతంగా ఉండి పోయేవి. దీంతో రైతులు ఆందోళన చేసినా, ఉద్యమం కొనసాగించినా కూడా ప్రయోజనం లేకపోయింది.

సీఎం చొరవ:
గత ప్రభుత్వ హయాంలో కొందరు రైతుల దరఖాస్తులపై కలెక్టర్‌ సంతకం చేసినా, సీసీఎల్‌ఏ సంతకం పెట్టకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ దరఖాస్తులు కలెక్టర్‌ వద్దే పరిష్కారం అయ్యేలా సీఎంగారు నిబంధనలు సరళీకృతం చేశారు. ఒకే విడతలో చుక్కల భూముల నుంచి పట్టా భూములగా గుర్తించి అడంగళ్‌ 1(బీ) ఇవ్వమని ఆయన ఆదేశించారు. ఆ చుక్కల భూముల్లో కాల్వ పోరంబోకులు, వాటర్‌ బాడీలు, ప్రభుత్వ భవనాలు ఉన్నవి పక్కన పెట్టి.. మిగతావి పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకపై ఆ భూమి సమస్య పరిష్కారం కోరుతూ, రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వారు తమ అధీనంలో ఉన్న భూములు సాగు చేసుకోవచ్చు. ఆ మేరకు నెల్లూరు జిల్లాలో చుక్కల భూములకు సంబంధించి గత నెల 31న జీఓ నెం.163 జారీ చేయడం జరిగింది.

నాడు నిషేధిత జాబితాలో..:
చుక్కల భూములకు సంబంధించి గత ప్రభుత్వం 2016, మే 5న, జీఓ నెం.198 జారీ చేసింది. దాని ప్రకారం చుక్కల భూముల్ని 22(ఏ)లో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అంతే కాకుండా వారం తర్వాత.. అంటే 2016, మే 13న, ఆనాటి ప్రభుత్వం మరో జీఓ నెం. 216 జారీ చేస్తూ.. చుక్కల భూముల జాబితాలో మరిన్ని భూములు చేర్చి, ఎవ్వరూ చుక్కల భూములు లావాదేవీలు చేయటానికి లేదని, అవన్నీ ప్రభుత్వ భూములుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. అలా మొత్తం చుక్కల భూములను నిషేధిత జాబితాలోకి చేర్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేసినా, ఉద్యమం కొనసాగించినా గత ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు.

రాష్ట్ర చరిత్రలో మైలురాయి:
సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం వల్ల దాదాపు 23,023 రైతులకు చెందిన 43,270 ఎకరాలను ఒకేసారి చుక్కల భూముల జాబితా నుంచి తొలగించటం జరిగింది. త్వరలో చుక్కల భూముల రైతులకు సీఎంగారు స్వయంగా పట్టాలు పంపిణీ చేస్తారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక మైలు రాయిగా భావించాలి. ఇది రైతులకు ఎంతో ఊరట కలిగించే అంశం.

100 ఏళ్ల తర్వాత రీసర్వే:
రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత భూముల రీసర్వే. వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు. భూరక్ష కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిషర్లు రూపొందించిన రికార్డులపైనే మనం ఇప్పటికీ ఆధారపడుతున్నాం. కానీ అన్ని భూములకు సంబంధించి ఆ తర్వాత అనేక లావాదేవీలు జరిగాయి. కానీ రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో అనేక సమస్యలు. భూమి కొనుగోలుదారుడు సర్వే చేయించుకుంటే ఆ సర్వే నెంబర్‌లో ఆ భూమి ఉండకపోవటం, వేరే సర్వే నెంబర్‌లో ఆ భూమి ఉండటం వంటి ఉదంతాలు ఎన్నో. వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపే విధంగా, రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్, సమగ్ర రీసర్వే (వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు. భూరక్ష కార్యక్రమం) చేపట్టారు.

చంద్రబాబు–కరవు కవల పిల్లలు:
ఈ ప్రభుత్వ హయాంలో గత నాలుగేళ్లలో ఒక్క కరవు మండలం ప్రకటించ లేదు. ప్రాజెక్టుల కింద రెండో పంటకూ నీళ్లు ఇచ్చాం. వర్షాలు బాగా కురుస్తుండడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు ఆర్బీకేలు రైతులకు అండగా నిలుస్తున్నాయి. దీని వల్ల కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా రైతులకు 20–25% అధిక ఆదాయం వస్తోంది. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా, రాష్ట్రంలో కరవే. చంద్రబాబు–కరవు కవల పిల్లలు అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు.

LEAVE A RESPONSE