1. ఈయన ఒక బహుముఖప్రజ్ఞాశాలి – భరతముని నాట్యశాస్త్రానికి, ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకానికీ వ్యాఖ్యలుు వ్రాసాడు. కాశ్మీరశైవంలో ప్రత్యభిజ్ఞసంప్రదాయానికి చెందిన ఈయన తత్త్వవేత్త కూడ. ఎవరీయన?
2. మొదటి ప్రశ్నలోని వ్యక్తికి ఈ రెండో ఆయన శిష్యుడు. కవీ, ఆలంకారికుడు, నాటకకర్త. ఔచిత్యసిద్ధాంతకర్త. బృహత్కథామంజరి, రామాయణమంజరి, మహాభారతమంజరి అనే పేర్లతొ ఆ యా గ్రంథాలకు సంక్షిప్తకథనం చేసాడు. ఎవరీయన?
3. బృహత్కథ ఆధారంగా కథాసరిత్సాగరం అనే కథాకావ్యాన్ని రచించిన కాశ్మీరకవి ఎవరు?
4. ఎనిమిది తరంగాలతో కలియుగారంభం నుంచి కాశ్మీరరాజుల చరిత్రను వివరించే ఈ గ్రంథం మనదేశంలో వ్రాయబడ్డ తొలి ప్రామాణికగ్రంథంగా పరిగణించబడుతుంది. ఏమా గ్రంథం? ఎవరిచేత వ్రాయబడింది?
5. అనగనగా ఒక రాకుమారి. సంగీతనాట్యాలను కళలను నేర్చుకున్నది. ఆమెకు సాహిత్యవిద్యను నేర్పాలి. దేశాటనం చేస్తూ కాశ్మీరం నుంచి వచ్చిన ఒక కవి అందుకు సమర్థిడని తేల్చుకున్నారు. ఒక చిక్కేమిటంటే – ఆమె యౌవనవతి. ఆ గురువుగారితో ప్రేమలో పడితే? అయితే ఆ రాకుమారి గుడ్డివాడిని చూడదు. అలాగే ఈతడు కుష్ఠువాడిని చూడడు. కాబట్టి అమ్మాయి కుష్ఠురోగగ్రస్తురాలనీ, గురువు జాత్యంధుడనీ ఒకరికొకరికి చెప్పి మధ్యలో తెరగుడ్డ ఉంచి విద్యాభాసం జరిపించాలని నిశ్చయించారు. ఈ విధంగా మొదలైన ప్రణయగాథకు కథానాయికానాయకులెవరు?
6. అనంతనాగ్ సమీపంలోనున్న మార్తాండదేవాలయాన్ని నిర్మించాడీ రాజు. బెంగాల్ నుంచి గుజరాత్ దాకా, కావేరి నుంచి మధ్యాసియా ఎడారుల దాకా ఈయన జైత్రయాత్రలు చేసాడట. కాశ్మీరదేశచరిత్రలో ఈయన పాలనాకాలం స్వర్ణయుగమని చెబుతారు. ఎవరీయన?
7. ఇరవైయ్యారేళ్ళకు సర్వసంగపరిత్యాగం చేసింది. ప్రముఖశైవయోగిని. మన అక్కమహాదేవిలా దిగంబరంగా తిరిగేదట. కాశ్మీర్ ప్రజలు ఆమెను అమ్మగా, అమ్మమ్మగా సంభావించుకుంటారు. ఆమె ‘వాఖ్’లను వేమన పద్యాలతో, కన్నడవచనసాహిత్యంతో పోల్చవచ్చు.. అన్నట్లు తెలుగులో నాగుపాము నవలల నారాయణాచార్యుల కలంపేరు ఈవిడ పేరుమీద వచ్చిందే. ఎవరీవిడ?
8. ఈ హూణరాజు ప్రస్తావన కాశ్మీరదేశపు చరిత్రలో వస్తుంది. “సూర్వవంశానికి చెందిన వాడు ” అని ఇతడి పేరుకు అర్థం. చాలా క్రూరుడు. “సరదా కోసం” ఏనుగులను జలపాతం మీదినుంచి పడదోయించాడట వీడు. విశ్వనాథ నవలలో ఒకటి వీడి పేరు మీద ఉన్నది. ఎవడు వీడు?
9. కాశ్మీరరాజులలో ఒక దుర్మార్గుడు ఉండేవాడు. “తురుష్కప్రభావితు”డైన వీడు నాశనం చేయని దేవాలయం లేదని చరిత్ర చెబుతున్నది (చూ. నాల్గవ ప్రశ్న). దేవాలయాలను నాశనం చేసేందుకు ‘దేవోత్పతననాయక’ అనే పదవిని ఏర్పర్చాడట ఈ నీచుడు. ఎవడు వీడు?
10. ఔరంగజేబు తమను మతం మార్చుకొమ్మని చాలా హింసిస్తున్ణాడని కాశ్మీరీ బ్రాహ్మణులు మొరబెట్టుకోవడానికి వచ్చారీ గురువు దగ్గరకు. “దేశం పూర్తిగా ఇస్లామికరణ చెందకుండా నివారించాలంటే మార్గం ఏమిటి? అందుకు ఒక్కటే మార్గం. ఎవరో ఒక మహాపురుషుడు దేశం, ధర్మం కోసం ఆత్మబలిదానం చేయాలి. కానీ ఎవరు చేయాలి?” అని సాలోచనగా అడిగాడు ఆ గురువు. “మీ కన్నా యోగ్యులెవరు ఆ బలిదానానికి?” అని మారు అడిగాడు అతని కుమారుడు. ఎవరా తండ్రీకొడుకులు?
11. పరంపరానుగతంగా వచ్చిన శాక్త/శైవ తంత్రమార్గాన్ని పాటించే కాశ్మీరీ బ్రాహ్మణకుటుంబాల వ్యక్తుల పేరు చివరన కనిపించే కులనామం ఏమిటి?
12. శ్రీనగర్ లోని ఈ దేవాలయం పేరు ఏమిటి (ఫోటో దిగువన ఉన్నది)? ఇది ఉన్న కొండపేరేమిటి?..
పై ప్రశ్నలకు సమాధానాలు..
1. అభినవగుప్తుడు
2. క్షేమేంద్రుడు
3. సోమదేవుడు
4. రాజతరంగిణి, కల్హణుడు
5. యామినీపూర్ణతిలక, బిల్హణుడు
6. లలితాదిత్యముక్తాపీడుడు
7. లల్లాదేవి/లల్లేశ్వరి/లాల్ దేడ్
8. మిహిరకులుడు
9. హర్షుడు/హర్షదేవుడు
10. గురు తేగ్ బహదూర్, గురు గోవింద్ సింగ్
11. కౌల్
12. జ్యేష్ఠేశ్వరాలయం/శంకరాచార్య ఆలయం, అది ఉన్న గుట్ట పేరు తఖ్త్-ఎ-సులేమాన్, కాదు, శంకరాచార్యుల గుట్ట..
– శర్మ