Suryaa.co.in

Political News

భారత రాజకీయాల్లో సంచలనం తెలుగుదేశం ఆవిర్భావం

1982 మార్చి 29 న సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నాలుగు దశాబ్ధాల క్రితం నందమూరి తారక రామారావు అమృత హస్తాల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.తెలుగు సినీ వినీలాకాశంలో తనను ధృవతారగా నిలిపిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలన్నఎన్ఠీఆర్ తపన, ఆశయం నుండి తెలుగుదేశం ఉద్భవించింది. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని డిల్లీ పాలకులకు పాదాక్రాంతం చేసిన పరిస్థితుల్లో తనను ఆదరించి జీవితంలో ఇంత వాణ్ణి చేసిన రాష్ట్ర,తెలుగు ప్రజలను సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి ఎన్టీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు. శ్రామికుడి చెమటలోనుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లోనుంచి,రైతుకూలీల రక్తంలోనుంచి, నిరుపేదల కన్నీటిలోనుంచి,కష్టజీవుల కంటి మంటల్లో నుంచి,అన్నార్తుల ఆకలి మంటల్లో నుంచి పుట్టిందే తెలుగుదేశం అన్నారు ఎన్ఠీఆర్. తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ళు పూర్తీ చేసుకొని 42 వ ఏట అడుగిడుతున్నది. తెలుగుదేశం. ఆ పార్టీ 41 ఏళ్లను నామ మాత్రంగా పూర్తీ చేసుకోలేదు.సాధారణంగా గడపలేదు. 22 ఏళ్ళు తెలుగుప్రజలను పాలించింది. కేంద్రంలో కనీసం అయిదు ప్రభుత్వాలు ఏర్పడటానికి,మన గలగడానికి కారణం అయింది తెలుగుదేశం పార్టీ. దేశాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడలేక,దారి తెన్నూ తెలియక దిక్కుతోచని స్థితిలో వున్న ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత,అనతికాలంలోనే ప్రత్యామ్నాయ సంకీర్ణాన్ని నిర్మించిన చరిత్ర కూడా తెలుగుదేశానిదే.ఒక ప్రాంతీయ పార్టీని పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిపిన ఘనత తెలుగుదేశానిదే. ఎవరు అనుకోని విధంగా 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లో కూకటి వేళ్ళ తో పెకలించి వెయ్యడం భారత దేశ చరిత్రలో ఎరుగనిది.ఎన్టీఆర్ తనకు తాను సృష్టించి న చరిత్ర అది.తెలుగు గడ్డమీదనే కాదు యావత్తు భారత దేశంలోనే అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ 40 ఏళ్ళ కు పైగా మన గలగడం చిన్న విషయంకాదు.రాజకీయాలలో జయాపజయాలు రాత్రి,పగలు వంటివి.అవి ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి.వాటిని ఎవరు ఆపలేరు. దుష్ట శక్తుల గ్రహణం తొలగి తెలుగుతేజం దశ,దిశలా వ్యాప్తి చెందాలన్న లక్ష్యంతో కుల,మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా తెలుగుదేశం రూపుదిద్దుకొన్నది. తెలుగువారంతా పచ్చగా వుండాలని,అన్ని రంగాల్లో తెలుగువాడు ముందుండాలని తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష,లక్ష్యం. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకనే సమాజంలోని అణగారిన వర్గాలకు కులాలకు రాజకీయంగా,సామాజికంగా గుర్తింపు వచ్చింది.బడుగుల బతుకుల్లో పచ్చదనం నింపి, నిరుపేదల ఆకలి తీర్చి గూడులేని దీన జనులకు నీడనిచ్చిన పార్టీ తెలుగుదేశం.మహోజ్వలంగా మొదలయిన తెలుగుదేశం ప్రస్థానం 41 ఏళ్ళు పూర్తి చేసుకొన్నది.ఈ 41 ఏళ్లలో ఎన్నో ఎత్తు,పల్లాలు దాటుకొంటూ చరిత్ర గతిలో తన ఉనికిని బలంగా చాటుకొంటూనే వున్నది.ఎన్నడూ ఓటమి కి నిరాశతో వెనకడుగు వేసిఎరుగదు,సంక్షోభం ఎదురైనప్పుడల్లా మహోత్సాహంతో ముందడుగు వేస్తూనే వుంది.

1982 మార్చి 29 న ఆవిర్భావం నుండి 2023 మార్చి 29వరకు తెలుగుదేశం స్థాపించి నాలుగు దశాబ్దాలు.ఇది తక్కువ సమయం కాదు.ఈ 41 ఏళ్లలో ఎన్టీఆర్ 13 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడుగా వుండగా,నారా చంద్రబాబు నాయుడు 28 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.ఎన్టీఆర్ 8 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వుండగా,చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వున్నారు,మొత్తం ఈ 40 ఏళ్లలో 22 ఏళ్ళు అధికారంలో వున్నది తెలుగుదేశం పార్టీ. ఎన్ఠీఆర్ పార్టీని స్థాపించినప్పుడు అది ఇన్నేళ్లు మన గలుగుతుందని,ఇంతకాలం తెలుగు ప్రజలను ఏల గలుగుతుందని ఎవరు అనుకోని వుండరు. వ్యవస్థాపకులు ఎన్ఠీఆర్ కూడా అనుకోని వుండరు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే 200 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వస్తుందని అనుకోని వుండరు. తెలుగుదేశం ఏక పక్ష విజయం ప్రపంచాన్ని అబ్బురపరిచింది.విలక్షణ రాజకీయ పక్షంగా తెలుగుదేశాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్, చంద్రబాబు అహర్నిశలు కృషి చేశారు.ఎన్ఠీఆర్ లేకపోతె తెలుగుదేశం లేదని అందరు అనుకొన్నారు. ఎన్ఠీఆర్ కూడా ఒకసారి నాతో వచ్చిన పార్టీ నాతోనే పోతుంది అన్నారు. కానీ ఆలా జరగలేదు. చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటికీ ఆ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ముందుకు సాగుతుంది.తెలుగుదేశం రాష్ట్రానికి,ప్రజలకు చేసిన మేలు ఏమిటి?తెలుగు ప్రజలవల్ల తెలుగుదేశం లాభపడిందా? తెలుగుదేశం వల్ల తెలుగుప్రజలు లాభపడ్డారా వంటి ప్రశ్నలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం తన భాధ్యతను నిర్వహించడంలో అన్నీ పార్టీలు కన్నా ముందున్నది. ప్రజాస్వామ్య పద్దతిలో తెలుగుదేశం నిర్వహించిన పాత్ర రాజకీయ,సామాజిక, ఆర్ధిక రంగాలలో తెచ్చిన మార్పులు,ప్రవేశపెట్టిన ఆలోచనలు ప్రజల,రాష్ట్రాభివృద్ధికి దోహదపడ్డాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు. అధికారంలో ఎన్నాళ్ళు వున్నామన్నదానికంటే ఆ సమయంలో రాష్ట్రానికి,సమాజానికి ఎంత మేలుచేసింది అనేది ముఖ్యం.

రాష్ట్ర రాజకీయాల్లోకి ఎన్ఠీఆర్ ప్రవేశంతో రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసింది.అంతకుముందు చాటు మాటు రాజకీయాలను జనంలోకి తెచ్చిన ఘనత ఎన్ఠీఆర్ దే. ఈ రోజు జనంలో ఇంత రాజకీయ చైతన్యం వచ్చిoదంటే అది ఎన్ఠీఆర్ పుణ్యమే.అసలు ప్రజలకు ఏమికావాలో ఆలోచించి ఆ సిద్దాంతాన్ని ఆవిష్కరించిన పార్టీ. పేద ప్రజలకు ఎదో ఒకటి చెయ్యాలన్న తపన పట్టుదలలో ఎన్ఠీఆర్ తర్వాతనే అని చెప్పాలి. కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకు అన్నారు ఆయన. పేదవాడికి కిలో 2 రూపాయలకే బియ్యం,కూడు,గుడ్డ,నీడ కల్పించడాన్ని మించిన కమ్యూనిజం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేవుడు ఇచ్చిన భూమికి శిస్తు ఏమిటి రైతన్న అన్నారు.భూమి శిస్తు రద్దు చేశారు.దేశంలో మొదటి సారి సంక్షేమ రాజ్యానికి బలమైన పునాదులు వేసి పేదల గుండెల్లో శాశ్వత బంధువుగా నిలిచిపోయిన మహానాయకుడు ఎన్ఠీఆర్. పాలన సంస్కరణల్లో కొత్త ఒరవడి తెచ్చి అభివృద్ధిని ముందడుగు వేయించిన దార్శనికుడు. ఆయన వేసిన పునాది తెలుగుదేశం పార్టీని నలభై ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా నిలిపింది.వ్యవసాయం ,చేతి వృత్తులు,గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధమిక వసతులు,సౌకర్యాలు,ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కొత్త రీతిలో ఆలోచనలు చేసి కార్యక్రమాలు రూపొందించిన పార్టీ తెలుగుదేశం.విధ్యుత్తు,సాగు,తాగు నీరు,రహదారులు,సబ్సిడీ బియ్యం, వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసింది.కృష్ణానదిలో మిగులు జలాలు వాడుకోవచ్చని కనిపెట్టి హంద్రీ-నీవా,గాలేరు -నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన దార్శనికుడు ఎన్టీఆర్,తెలుగు జాతికి ఆయన తెచ్చిన ప్రపంచస్థాయి గుర్తింపు,మద్రాస్ తప్ప మరొకటి తెలియని ఉత్తరాది ప్రజలకు ,ప్రపంచ ప్రజలకు కూడా తన సమున్నత వ్యక్తిత్వంతో తన విలక్షణ వ్యవహార శైలితో తెలుగుజాతి ఒకటి వున్నది,దానికి గతమెంతో ఘనమైన చరిత్ర ఉందని ఎలుగెత్తి చాటారు. నీతి,నిజాయితీలు,పేద ప్రజల గురించే చివరి వరకు తపన పడిన ఎన్ఠీఆర్ ముద్ర రాజకీయాల పై చెరగనిది. ఇప్పటికి పేదప్రజల హృదయాలలో ఆయన బొమ్మ చెక్కు చెదరనిది. నిజానికి ప్రజా జీవితంలోఇన్నేళ్లు తెలుగుదేశం మనుగడ సాగించింది అంటే అధికారంలో వున్నా,ప్రతిపక్షంలో వున్నా ప్రజల మధ్యలో వుండి వారి సమస్యల పరిష్కరిస్తూ వారితో మమేకం కాబట్టే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోలేదు.

తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల చరిత్రను రెండు భాగాలుగా చూడాలి. తెలుగుదేశంలో మలిదశ నారా చంద్రబాబు నాయుడిది.నలభై ఏళ్లలో 28 ఏళ్ళ అధ్యాయం చంద్రబాబు దే.ఎన్ఠీఆర్ మరణాంతరం చంద్రబాబు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్ఠీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కృషి చేస్తే చంద్రబాబు తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు నిరంతరం శ్రమించారు.28 ఏళ్ళుగా పార్టీ అధ్యక్షుడుగా వున్న చంద్రబాబు అందులో 14 ఏళ్ళు అధికారంలో ఉండి ఉమ్మడి రాష్ట్రాన్ని,విభజిత ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కించారు. ఆధునికతకు,వాస్తవికతకు,అంతర్జాతీయ కరణకు ప్రతిబింబం చంద్రబాబు అని చెప్పాలి.చంద్రబాబు ఫుల్ టైం పొలిటీషన్,ప్రొఫెషనల్ పొలిటీషన్,అంతకు మించి పరిపాలనా దక్షుడు. నిరంతరం పనిచెయ్యడం ఆయన వ్యాపకం. ప్రజల వద్దకు అధికారులను పంపి పరిపాలన ప్రజలకు చేరువ చేశారు. సంస్కరణలు,టెక్నాలజీ,వంటి రంగాలలో ప్రపంచగమనం ఎలా వున్నది,భవిష్యత్ ఎలా వుండబోతుంది అనే విషయాలు సుదీర్ఘంగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ను అందుకు అనుగుణంగా పాలన సాగించి ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచంలో గుర్తింపు తెచ్చింది తెలుగుదేశమే.విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను ఆకళింపుచేసుకొని భవిష్యత్ ను ముందుగానే ఊహించి ఆధునికతను అందిపుచ్చుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచంలో గుర్తింపు తెచ్చారు ఆయన. హైదరాబాద్ నగర రూపురేఖలు మారడానికి ఆయన దూరదృష్టే కారణం.ప్రపంచంలో ఐటి విప్లవం రాగానే దూరదృష్టితో చంద్రబాబు ఐటిని హైదరాబాద్ కు తెచ్చి తెలుగుజాతికి ఐటిని పరిచయం చేసి సామాన్యులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దారు. చంద్రబాబు చేసిన కృషిఫలితంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. టైమ్ మ్యాగజైన్ చంద్రబాబుని సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తిస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చంద్రబాబును ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్ లో ఉండాల్సిన వ్యక్తిగా ఎంపిక చెయ్యడం గర్వకారణం. ఇండియా టుడే పత్రిక చంద్రబాబును ఐటి ఇండియన్ ఆఫ్ ది మిలీయంగా సత్కరిస్తే, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎకనామిక్ టైమ్స్ గౌరవించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొనడానికి ఒక రాష్ట్ర్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం రావడం అనేది చంద్రబాబు తోనే ప్రారంభం అయింది. చంద్రబాబు ఆధునిక పాలన అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. రాజకీయంగా ఎన్ఠీఆర్ తెలుగుజాతికి ప్రపంచ గుర్తింపు తెస్తే ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అంతర్జాతీయ గౌరవం తెచ్చారు.ఇంజనీరింగ్,మేనేజ్ మెంట్,మెడికల్ సంస్థలు ఇబ్బడి ముబ్బడి గా ఏర్పాటు చెయ్యడంతో ఆర్ధిక వ్యవస్థ బలపడింది.విద్యుత్తు,విద్యా,రహదారులు,వైధ్యం వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి.అభివృద్ది వేగం పెరిగింది.ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది,ఆర్ధిక విధానాలను,అభివృద్ధి రాజకీయాలను నమ్ముకున్న రాష్ట్ర స్థాయి నేతలతో అగ్రగణ్యుడు చంద్రబాబు.

తెలుగుదేశాన్నిఎన్ఠీఆర్ మరణాంతరం కూడా అంతే స్థాయిలో నిలబెట్టడం చంద్రబాబు సాధించిన అపూర్వ ఘనత. రాజకీయంగా ఎన్ఠీఆర్ రాష్ట్రానికి,తెలుగుజాతికి ఎంతటి ప్రాముఖ్యత,ప్రాభవం తెచ్చారో,అభివృద్ధి విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, విభజన నవ్యాoధ్రకు చంద్రబాబు అంతే గుర్తింపు తెచ్చారు. ఎన్ఠీఆర్ వేసిన పునాది పై చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సౌధాన్ని చెక్కు చెదరకుండా పటిష్టoగా నిర్మించారు.అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడిగలిగింది అంటే అందుకు కారణం పార్టీ నిర్మాణం పై చంద్రబాబు చూపిన శ్రద్ద,నిరంతర అప్రమత్తతే కారణం. ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాష్ట్రంగా అగ్రభాగాన నిలబడింది అంటే అది తెలుగుదేశం వేసిన బలమైన పునాదులు అనే చెప్పాలి. తన విన్నూత్న విధానాలతో,కార్యక్రమాలతో,విలువలతో రాజకీయాలతో రాష్ట్రప్రయోజనాలు కాపాడాటానికి,రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టడానికి నిరంతరం శ్రమించింది తెలుగుదేశం పార్టీ. వినూత్న ఆలోచనలు, విలువలతో కూడిన రాజకీయాలతో రాష్ట్రప్రయోజనాలు కాపాడటానికి, అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టడానికి నిరంతరం శ్రమించింది తెలుగుదేశం పార్టీ.41 ఏళ్ళు పూర్తిచేసుకున్న ఈ తరుణంలో ఎన్ఠీఆర్ ఏ ఆశయాల కోసం అయితే కలలు కన్నారో వాటిని సాకారం చేయడానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలి. ఆంధ్రప్రదేశ్ లో నేడు నెలకొన్న అవాంఛనీయ, సంక్షోభ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరం. ఈ నలభై ఏళ్ల వేడుకతో మరోసారి తెలుగోడి సత్తా చాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర భవిష్యత్ కోసం మరో పోరాటానికి పసుపు సైనికులు కార్యోన్ముఖులు కావాల్సిన సమయం ఆసన్నమైంది.

టి డి జనార్దన్

LEAVE A RESPONSE