Suryaa.co.in

Political News

అవిశ్రాంత పోరాట యోధుడు

సెప్టెంబర్ 1, 2024న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరొక అరుదైన మైలురాయి చేరుకున్నారు. సరిగ్గా 29 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 1, 1995న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 45 సంవత్సరాల పిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన నవ్యాంధ్రప్రదేశ్కు 4వ సారి ముఖ్యమంత్రిగా ఉండటం మరో అరుదైన ఘనత.

నిజానికి పదవుల కోసం, రికార్డుల కోసం తాపత్రయపడే నాయకుడు కారు చంద్రబాబునాయుడు. పదవి ఉన్నా లేకున్నా.. ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం నిరంతరం, ప్రతిక్షణం ప్రయత్న లోపం లేకుండా చిత్తశుద్ధితో కష్టపడే అత్యంత అరుదైన నాయకుడు చంద్రబాబు. అందుకే కొన్ని సందర్భాలలో ప్రజలు లేనిపోని అపోహలతో దూరం చేసుకొన్నా.. మళ్లీ ఆయనను ఆదరించారు. చంద్రబాబు పాలనలోనే గాడి తప్పిన రాష్ట్రం ముందుకు సాగగలదని విశ్వసించారు. కనుకనే నిన్నటి ఎన్నికలలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు.

రాజకీయాలలో తొలినుంచీ చంద్రబాబు ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీఇన్నీ కావు. మొదటి సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే అనేక సవాళ్లు, సంక్షోభాలు ఆయనకు స్వాగతం పలికాయి. అడుగంటిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కుదేలయిన కీలకరంగాలు, ప్రభుత్వ యంత్రాంగంలో నిస్తేజం, నిర్లిప్తత.. ఇటువంటి సమస్యలెన్నో రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పూర్వరంగంలో చంద్రబాబు సృజనాత్మకతతో కూడిన ఆలోచనలతో, దృఢమైన కార్యదీక్షతో, అచంచలమైన నిబద్ధతతో సమస్యలను, సవాళ్లను ఛాలెంజీగా తీసుకొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కూడగట్టుకొన్నారు. రాష్ట్ర ఆర్ధిక రంగ పునర్వ్యస్థీకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మానవ వనరులను అభివృద్ధి చేయడం, ప్రజలను సాధికారుల్ని చేయడం వల్లనే ఆశించిన ఫలితాలు పొందగలమని భావించి అందుకు అనుగుణమైన చర్యలు, కార్యక్రమాలు చేపట్టడం చంద్రబాబు సాధించిన తొలి విజయం.

ప్రజలపై అధికారుల పెత్తనం తగ్గించి ప్రజల్ని ప్రభుత్వ కార్యక్రమాలలో భాగసామ్యం చేసే సిసలైన ప్రజాస్వామ్య ప్రక్రియ చంద్రబాబు పాలనలోనే మొదలైంది. ఫలితంగా అధికారాల బదలాయింపు జరిగి పరిపాలన వికేంద్రీకరణకు మార్గం ఏర్పడింది. 73వ రాజ్యాంగ సవరణ వల్ల పంచాయితీలకు అంతకుముందెన్నడూలేని విధంగా దేశంలో ప్రప్రథమంగా విశేషమైన అధికారాలు కల్పించి స్థానిక స్వపరిపాలనకు నిజమైన అర్ధం కల్పించిన నాయకుడు చంద్రబాబే!

అదే సమయంలో చంద్రబాబు పని సంస్కృతిని పెంచారు. కష్టపడితేనే ఫలితాలు అందుతాయన్న స్పృహ అందరిలో పెరిగేందుకు దోహదం చేశారు. రాజకీయ రంగంలో హుందాతనాన్ని పెంచడానికి తన పార్టీ ద్వారానే అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు రాజకీయాలలో సాగిన పూలదండల హంగామా, ఊరేగింపులు, సన్మానాలు, తులాభారాలు, ఎయిర్ పోర్టులలో కిరాయి జనాలతో బలప్రదర్శనలు వంటి చౌకబారు సంస్కృతిని కనుమరుగు చేశారు. సెక్రటరియేట్లో, ప్రభుత్వ కార్యాలయాలలో తిష్టవేసే పైరవీకారులకు స్థానం లేకుండా చేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో వెల్లివిరిసిన నూతన రాజకీయ సంస్కృతి రాష్ట్ర ప్రతిష్టను పెంచింది. చంద్రబాబు రాజకీయ నిబద్ధతను జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ వేదికలపై చర్చించే పరిస్థితి ఏర్పడింది.

భారత రాజకీయాలలో స్థిరపడిన సంప్రదాయ ఆలోచనా ధోరణులను, యధాతథ స్థితిని కొనసాగించడానికి అలవాటు పడిన విధానాలను చంద్రబాబు త్రోసిరాజని భిన్నమైన రాజకీయ ఆలోచనలతో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాలలోని వనరులన్నింటిని వినియోగంలోకి తెచ్చి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం రైతుల సాగునీటి సంఘాలు, విద్యా కమిటీలు, తల్లుల కమిటీలు, వనసంరక్షణ సమితులు, సిఎంఇవై, వాటరెడ్లు, డ్వాక్రా మొదలైన స్వయం సహాయక సంఘాల్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల రూపురేఖల్ని మార్చివేశారు. ఆ పథకాలు పేద ప్రజల స్థితిగతుల్ని గణనీయంగా మెరుగుపర్చాయి. డ్వాక్రా, దీపం వంటి పథకాలతో పేద గ్రామీణ మహిళలకు ఆర్ధికంగా, సామాజికంగా అండదండలందించారు.

ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని, ఆ తర్వాత వ్యవసాయ రంగ విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో జాప్యం చేసి భారీ మూల్యం చెల్లించుకొన్న భారతదేశం అభివృద్ధిలో ఎంతో వెనుకబడిపోయిందన్నది చేదు వాస్తవం. అయితే.. ఐటి విప్లవం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో, ముఖ్యంగా యువతకు ఈ రంగం అందించే ఉపాధి అవకాశాలను ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు హైదరాబాద్ లో ‘హైటెక్ సిటీ’ నిర్మాణాన్ని చేపట్టడం.. రాష్ట్ర చరిత్రలో ఓ మేలి మలుపు.

హైటెక్ సిటీలో అనతికాలంలోనే ప్రపంచంలోని అగ్రగామి సంస్థలు కొలువుదీరాయి. మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్ని హైదరాబాద్కు రప్పించడానికి చంద్రబాబు చేసిన కృషి, పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐటి రంగంలో ఉద్యోగవకాశాలను రాష్ట్ర యువతకు లభించడానికి రాష్ట్రంలో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కంప్యూటర్ విద్య అందించే కళాశాలల్ని ఏర్పాటు చేసి రకరకాల కోర్సులు ప్రవేశపెట్టడం వల్లనే నేడు తెలుగువారు ప్రపంచంలో అమెరికాతోసహా అన్ని దేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు ఐటి ఉద్యోగాలతో తమ ఆర్ధిక స్థితిగతుల్ని ఊహించని స్థాయికి మెరుగుపర్చుకోగలిగారు. అంతేకాదు. గత రెండున్నర దశాబ్దాలలో అమెరికాలో తెలుగు టెక్నోక్రాట్స్ బలీయమైన ఆర్ధిక వ్యవస్థగా రూపొంది.. ఒకప్పుడు యాదులు ఏవిధంగానైతే అమెరికా సమాజంలో ప్రత్యేకంగా చూడబడ్డారో.. నేడు తెలుగువారు ఆ స్థానాన్ని ఆక్రమించారు. దీనికి కారణం చంద్రబాబునాయుడి దార్శనికతే.

ఐటిని ఉద్యోగ కల్పనకే కాక.. పరిపాలనలో అన్ని దశల్లో ప్రవేశపెట్టి.. ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన, పారదర్శక సేవలు అందించి హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకొన్నారు. ఐటితోపాటు బయోటెక్నాలజీ, ఫార్మా తదితర రంగాలకు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించారు.

ఇక, దేశంలో రెండవదశ ఆర్థిక సంస్కరణలను మానవీయతతో అమలు చేసిన ఘనత చంద్రబాబుదే. విద్యుత్ రంగంలో ఎంతో సాహసోపేతంతో చేసిన సంస్కరణల వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత, పంపిణీ వ్యవస్థలు మెరుగుపడ్డాయి. తర్వాతి కాలంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించే స్థాయికి విద్యుత్ రంగం పటిష్టం అయ్యింది. ఒక వైపు అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని సమతుల్యత చేసుకొంటూ వ్యవసాయం, సాగునీరు, ఉపాధి కల్పన, విద్య, వైద్యం, రోడ్లు, ఎయిర్ పోర్టులు తదితర రంగాలలో తీసుకొన్న చర్యలు, ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్ర ప్రగతిని వేగంగా ముందుకు తీసుకువెళ్లాయి. వీటితోపాటు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఆదరణ, చేయూత, ముందడుగు, రోషిణీ తదితర పథకాలు సత్ఫలితాలు అందించాయి. ప్రజల భాగస్వామ్యంతో అమలు చేసిన జన్మభూమి చరిత్ర సృష్టించింది. వీటి కారణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడి 9 సంవత్సరాల పాలనలో దేశ సగటు కంటే అధికంగా, అంతకుముందెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు 10.5%గా నమోదైంది. పారిశ్రామికంగా రాష్ట్రం 20 నుంచి 4వ స్థానానికి ఎదిగింది. చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు అత్యుత్తమ స్థాయికి చేరాయి. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించడంలో చంద్రబాబు చూపే చొరవ గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది.

చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004-14 మధ్య 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన రైతాంగం పక్షాన జాతీయస్థాయిలో ఉద్యమాలు చేశారు. బాబ్లీ అక్రమ ప్రాజెక్టుపై ఉద్యమించి అరెస్టయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో.. ఇరు ప్రాంతాలకు సమాన న్యాయం కోసం పోరాడారు. కులం, మతం, ప్రాంతం అనే వివక్ష చంద్రబాబు డిక్షనరీలో ఏ కోశానా కనిపించదు.

విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు అమరావతిని ప్రపంచ స్థాయిలో రాజధానిగా తీర్చిదిద్దడానికి ఆరాటపడ్డారు. తగిన కార్యాచరణతో ముందుకు సాగారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను, కియా వంటి పరిశ్రమలను రప్పించి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ను తిరిగి అగ్రగామి చేయడానికి నిరంతరం శ్రమించారు. పోలవరం ప్రాజెక్టును 72% పూర్తిచేశారు. విశాఖను ఐటి హబ్ గా మార్చడానికి కృషి చేశారు. అయితే, 2019లో అనూహ్యంగా ఓటమి ఎదురైనా ఆయన కృంగిపోలేదు. నాటి పాలకులు ప్రతిపక్షంలో ఉన్న తనను, తన పార్టీ నేతల్ని వేధించినా, కొందర్ని హత్యలు చేసినా, తనతోపాటు కొందర్ని అక్రమంగా జైల్లో పెట్టినా మొక్కవోని ధైర్యంతో ప్రజల మద్ధతు కూడగట్టి స్ఫూర్తిదాయకమైన పోరాటాలు చేశారు. చివరకు ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పుతో మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు.

4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ముందు.. గతంలో మాదిరిగా సవాళ్లు, సంక్షోభాలు అన్ని రంగాలలో ఎదురవుతున్నాయి. అయితే, చంద్రబాబునాయుడు ఓ అవిశ్రాంత పోరాటయోధుడు. అంతిమ లక్ష్యం సాధించేవరకు విశ్రమించని కార్యదక్షుడు. నేడు ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం ఒక్కటే.. ఆంధ్రప్రదేశ్ను మళ్లీ దేశంలోనే అగ్రగామిగా నిలపాలి. తెలుగు ప్రజలు అన్ని రంగాలలో ఉన్నత స్థానంలో నిలవాలి. ప్రజల ఆశలు, ఆశయాల్ని నెరవేర్చాలి. సమాజంలో పేదరికం శాశ్వతంగా తొలగాలి. ఈ సమున్నత లక్ష్యాల సాధన దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘2047 విజన్’ తో ముందుకు సాగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్కు ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు.

టి.డి. జనార్ధన్
పొలిటికల్ సెక్రటరీ, పొలిట్ బ్యూరో సభ్యులు
తెలుగుదేశం

LEAVE A RESPONSE