– ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్
విజయవాడ: ఇంజనీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశాలకు నిర్ధేశించిన ఎపిఈసెట్ 2024 తుదిదశ సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. గురువారం సీట్ల కేటాయింపును విడుదల చేశామని ఈ నెల 9 నుండి 13వ తేదీ లోపు విద్యార్దులు అయా కళాశాలల్లో వ్యక్తిగత అన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు కళాశాలలో కూడా నమోదు కావలసి ఉందన్నారు.
తుదిదశ ప్రవేశాల అనంతరం 240 కళాశాలలలో 41922 సీట్లు ఉండగా , 20969 భర్తీ అయ్యాయన్నారు. 19 విశ్వవిద్యాలయ కళాశాలల్లో 2181 సీట్లు ఉండగా 1823 మంది సీట్లు పొందారన్నారు. 221 ప్రవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 39741 సీట్లుకు గాను 19146 సీట్లు భర్తీ చేసామని గణేష్ కుమార్ వివరించారు. ఎపిఈసెట్ 2024 లో 32,881 మంది అర్హత సాధించగా, తుది దశ కోసం 2128 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
వీరిలో 2098 మంది అర్హత పొందారు. అయితే తుది దశలో అడ్మిషన్లు పొందిన సంఖ్య 4,890గా ఉంది. కళాశాలల యాజమాన్యాలు ఆగస్టు 14లోపు భర్తీ అయిన సీట్లు, విద్యార్ధుల వివరాలను సాంకతిక విద్యా శాఖకు పొందుపరచవలసి ఉందని కన్వీనర్ వివరించారు.