Suryaa.co.in

Andhra Pradesh

చాలా ప్రమాదకరమైన చట్టం

-అభద్రతా భావంతో ప్రజలు 
-పౌరులు ఆస్తి హక్కును కోల్పోయే పరిస్థితి  
-తాత ముత్తాతలు ఇచ్చిన భూములు కొట్టేసేవారు 
-ఆస్తులను లాగేయడానికి వేసిన ఎత్తుగడలు   
-రాజ్యాంగానికి, భారత వారసత్వ చట్టానికి  విరుద్ధం  
-ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చ 
-రాష్ట్ర 16వ శాసనసభ మూడో రోజు  సీఎం ప్రసంగం 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ సమావేశం మూడవ రోజైన బుధవారం జరిగింది. శాసన సభలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..

అధ్యక్షా…
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మంత్రి బిల్లు ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నోరోజులుగా లాయర్స్ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు. ఈ చట్టం కనుక వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ అధ్యక్షా.. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూవివాదాలు పెరిగిపోయాయి. కుప్పం నియోజకవర్గంలోనే చూస్తే ఎప్పుడూ నాకొక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ల నుంచి నేను అక్కడ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను.

ఈ ఐదేళ్లలో జరిగిన అవకతవకలతో ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్‌లు భూవివాదాల పైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్‌లు పెట్టి మాట్లాడేటప్పుడు ఏదైతే 22A.. ఎవరికైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడ నుంచి ఎవరైతే సెటిల్‌మెంట్ చేసుకోవాలని అనుకుంటారో వీళ్లందరూ రావడం నెగోసియేషన్స్ మొదలుపెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది, మనం కనుక ఒప్పుకుంటే వాళ్లు ఒప్పుకుంటే దాన్ని ఆటోమెటిక్‌గా మళ్లీ ప్రైవేట్ భూమి క్రింద 22A తీసేసి మరలా ప్రైవేట్ భూమి క్రింద సెటిల్‌మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు.

తాత ముత్తాతలు ఇచ్చిన భూములు కొట్టేసేవారు 

టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం రికార్డులు మార్చేయడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్షా.. ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయ్. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది.

మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు కుటుంబం నుంచి వస్తుంటాయి . అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం, రాజముద్ర వేస్తాం అంటే ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫొటో వేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్‌తో ఆడుకోవడం.

ఇది ఎక్కడా చూడలేదు అధ్యక్షా.. ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటిది చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూసర్వే అని కూడా అన్నారు. ఈ భూసర్వే కూడా అధ్యక్షా.. మొత్తం సెటిల్‌మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చుపెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దానిపైన కూడా చాలా స్పష్టంగా చెప్పాను. హోల్డ్ చేశాం, స్టే చేశాం ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం.

ఆస్తులను లాగేయడానికి వేసిన ఎత్తుగడలు

అధ్యక్షా.. ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది. అంటే రానురాను ఇందులో మీరు చూస్తే అధ్యక్షా.. వెరీ ఇంట్రెస్టింగ్ నేను అన్ని మీటింగుల్లో మాట్లాడాను. కనీసం ఒక్కమాట మేము ఇది చేయము, ఇది ఉద్దేశం లేదని ఒక్కమాట చెప్పలేదు. ఇందులో చూస్తే.. భూవివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాలను సెక్షన్ 335 నిషేధిస్తుంది. అంటే అధికారం లేదు ఎక్కడికి పోవాలి.. నేరుగా హైకోర్టుకు వెళ్లాలి. ఎంతమంది హైకోర్టుకు వెళ్లగలరు? అంటే ఇక్కడ ఏవిధంగా పెట్టారో మనకు దీన్నిబట్టి అర్థమవుతుంది. ఇంకోపక్క.. ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు 5(1).

అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం.. సాక్షిలో పనిచేసే వాళ్లందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టారు. రేపు కూడా వీళ్ల గుమస్తాలను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ల గుమస్తాలను పెడితే మన జాతకాలు వాళ్లు రాస్తారు ఏమవుతుంది అధ్యక్షా. అదే రికార్డును మీరొక్కసారి చూస్తే.. ఎవరైనా సరే ఈ భూమి నాది అని పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్‌కు వెళ్లిపోతుంది. అంటే మన చేతుల్లో లేదిది. అంటే వివాదాలను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను లాగేయడానికి ఎత్తుగడలు వేసే పరిస్థితికి వచ్చారు.

రాజ్యాంగానికి, భారత వారసత్వ చట్టానికి  విరుద్ధం

ఇవన్నీ కూడా అధ్యక్షా.. ఒకట్రెండు కాదు ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 246, 300కు విరుద్ధంగా ఉంది. ఇంకోపక్క.. ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెం. 512 రహస్యంగా దాచిపెట్టారు. మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్షా.. చాలా ప్రమాదకరమైన చట్టం.

నేను.. మిత్రులు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని మీటింగుల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం, ప్రజలు నమ్మారు అధ్యక్షా. ఎంత భయంకరంగా అంటే అధ్యక్షా.. ఒక అభద్రతాభావానికి లోనయ్యారు. మళ్లీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు, మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు.

అధ్యక్షా.. ఇక్కడ నుంచి కొంతమంది అమెరికాకు వెళ్లారు. వాళ్లకు భూములున్నాయ్.. వేరే దేశాలకు వెళ్లారు, వేరే రాష్ట్రాలకు వెళ్లారు. వాళ్లు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమెటిక్‌గా డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేశారు నోటీసులు కూడా ఇవ్వరు.

ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్షా.. ఏదేమైనా మేము చెప్పాం. చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డీఎస్సీ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి కేబినెట్‌లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో ఈ చట్టాన్ని రద్దు చేయడానికి బిల్లు ప్రవేశపెట్టాం.

ఇదీ మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ.. ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండదు, ప్రజల ఆస్తులు కాపాడతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఇలాంటి చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షా అని ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A RESPONSE