2024 మే 13న ఏపీలో ముగిసిన ఎన్నికలలో 81.86 % వోటింగ్ నమోదై , 2019తో పోలిస్తే 2% పోలింగ్ పెరిగి రికార్డు నెలకొల్పిన సందర్భం. సాధారణంగా వోటింగ్ పెరిగితే అధికార పార్టీపై అసంతృప్తి అని కూటమి సంబరపడుతుంటే.. కాదు కాదు జగన్ బటన్ నొక్కుడికి సమ్మోహితులై బారులు తీరి ఓట్లు గుద్దారు అని అధికారపార్టీ అంచనాలు వేస్తున్న వైనం.
రెండు ప్రధాన పక్షాలు కూడా అక్కచెల్లమ్మలు, అవ్వాతాతలు అధిక మొత్తంలో వచ్చి మాకు ఓటు వేశారు, కాదు మాకే వేశారు అని సంకలు గుద్దుకొని సంబరపడుతున్నాయి. ఏ అక్కాచెల్లి ఎవరిపక్షాన నిలిచిందో, ఏ అవ్వాతాత ఎవరిని దీవించారో బాక్సులు బద్దలుకొట్టిన తరువాత మాత్రమే తెలుస్తుంది. బటన్ నొక్కుడుకి బానిసలై వైసీపీకి వోట్ వేసారా? ఉచిత బస్సు, గ్యాస్ బండకు సమ్మోహితులై కూటమి కొమ్ము కాసారా అన్నది ఇప్పుడు చెక్కర్లు కొడుతున్న మిల్లియన్ డాలర్ ప్రశ్న.
నాకు తెలిసినంతవరకు వృద్దులు ప్రతిఎన్నికలోను పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారు. సాధారణంగా మనం వృద్దులను బయటకు ఎక్కువ తీసుకెళ్ళం. వోటింగ్ లాంటి సందర్భాలు అవకాశంగా భావించి ముందుకొస్తారు. అదే విధంగా బడుగు బలహీన వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువ శాతం ఓటుకి నోటుకి అలవాటుచేయబడ్డారు కాబట్టి, ప్రతి ఎన్నికలోను వచ్చి ఓటు వేస్తారు. లేదంటే డబ్బు ఇచ్చినవారు కీడు చేస్తారనే భయం. కాబట్టి పైన పేర్కొన్న వర్గాలవల్ల పోలింగ్ శాతం పెరిగే అవకాశం పెద్దగా లేదు.
ఇకపోతే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మహిళలు, యువతీయువకులు పెద్దమొత్తంలో క్యూలో నుంచుని, రాత్రిసమయంలోకూడా ఓటు వేసారని వినికిడి. ఓటింగ్ శాతం పెరగటానికి వీళ్ళే కారణమని నమ్మక తప్పదు. పైన పేర్కొన్న తరగతి వారు జగన్ మార్కు బటన్ సంక్షేమాన్ని ఆదరించి దీవించారా?
భూముల రేట్లు తగ్గాయి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు, శాంతిభద్రతలు, మౌలిక వసతులు బాగాలేవు, కూటమి వస్తే ఇప్పుడున్న పథకాలతో పాటు ఉచిత బస్సు, గ్యాస్ బండ వస్తాయికదా అని బారులుతీరి ఓట్లు కూటమికి గుద్దారా? అన్నది జూన్ 4న తెలుస్తుంది.
ఏది ఏమైనా అందరి కళ్ళు , అందరి చెవులు ఆడవారిపైనే. అందుకే ఆడాళ్ళు మీకు జోహార్లు.
– పులగం సురేష్
జర్నలిస్ట్