-
బెనిఫిట్ షోలపై కోమటిరెడ్డి ఉక్కుపాదం
-
ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతుల రద్దు
-
‘సినిమా’పై కోమటిరెడ్డి కొరడా
-
బడా బాబులకు సర్కారు సత్తాచూపిన సచివుడు
-
ఇన్నేళ్ల పాలనలో ‘పవర్’ చూపిన మొనగాడు
-
నాగార్జున అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేసిందీ కోమటిరెడ్డే
-
మిగిలిన మంత్రులకు అ దమ్మేదీ?
-
‘పరిశ్రమ’ పెద్దలకు షాకిచ్చిన కోమటిరెడ్డి
-
కోమటిరెడ్డి నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న నెటిజనులు
-
బెనిఫిట్ షోలకు హీరోలెందుకున్న కోమటిరెడ్డి ప్రశ్నను సమర్ధిస్తున్న సోషల్‌మీడియా సైనికులు
-
‘పుష్ప’విలాపం ఖరీదు కేవలం 25 లక్షలేనట
-
మరణానికి ఖరీదు కట్టిన అల్లు అర్జున్
( మార్తి సుబ్రహ్మణ్యం)
సినిమా పరిశ్రమ అంటే కనిపించని నాలుగో సింహం లాంటిది. అంటే పోలీసు అని కాదు అర్ధం. తెరవెనుక కనిపించని బలమైన సింహాలుండే గ్లామర్ పరిశ్రమ అని! సీఎం నుంచి కార్పొరేటర్ల వరకూ అంతా సినీ పెద్దలకు సలాము చేసి గులాములయ్యేవాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు దొరకని సీఎంల దర్శనం, సినిమావాళ్లకు సులభంగా దొరుకుతుంది. వారిని సీఎంలు కార్లదాకా దిగబెట్టివచ్చే కాలమిది. సినిమా వాళ్లపై కేసులు పెట్టాలంటే, సీఎం లెవల్లో నిర్ణయం జరగాలి.
అలాంటి పవర్‌ఫుల్ పరిశ్రమకు షాకిచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు అసలైన హీరోగా అవతరించారు. ఇకపై నగరంలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. ‘వెన్నుముక’ ఉన్న మంత్రిగా నిరూపించుకున్నారు. నిజానికి దానికి చాలా సాహసం కావాలి. అది కూడా ముఖ్యమంత్రి అనుమతితో సంబంధం లేకుండా చేసిన ప్రకటన మరి! ఇలాంటి వెన్నుముక ఉన్న మంత్రులనే ప్రజలను కోరుకునేది. దానికి కోమటిరెడ్డిపై సోషల్‌మీడియాలో కురుస్తున్న ప్రశంసల జల్లే సాక్షి. ఎంతోమంది మంత్రులు ఆయా శాఖలకు నాయకత్వం వహిస్తున్నారు. మరి ఇలాంటి దమ్మున్న నిర్ణయాలు తీసుకునే మంత్రులేరీ?
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా దుమ్మురేపుతోంది. హీరో అల్లు అర్జున్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 1800, 500 రూపాయలు పెట్టి మరీ సినిమా చూస్తున్నారు. సంతోషం. దానివల్ల నిర్మాతకు లాభమే. పైగా రెండు తెలుగు రాష్ర్ట ప్రభుత్వాలు అ‘ధన’పుషో, అ‘ధన’పు రేట్లకు అంగీకరించాయి కాబట్టి, ప్రేక్షకుల జేబులకు వీలైనంత ఎక్కువ చిల్లు పడింది. మాననీయ హైకోర్టు న్యాయమూర్తి కూడా, ఈ సమయంలో సినిమాను అడ్డుకోలేమని విచారణ సమయంలో తేల్చిచెప్పారు. సరే. ఏదేతైనేం. పుష్ప సినిమా రిలీజయి, కలెక్షన్లలో ఎక్కడా ‘తగ్గేదేలే’ అంటోంది.
కానీ ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. పుష్ప సినిమా బెనిఫిట్‌షో, ప్రేక్షకుల చావుకొచ్చి పడటమే విషాదం. వివాదం కూడా! హైదరాబాద్ సంధ్య ధియేటర్‌లో, పుష్ప బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదానికి ఆ సినిమా కారణమయింది. ఒక ఇల్లాలు ఆ తొక్కిసలాటలో మరణించింది. అసలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వంటి కిటకిటలాడే ప్రాంతంలో ఇలాంటి బెనిఫిట్ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడమే దారుణం. దానికి అనుమతులున్నాయా లేవా అన్నది చూడకపోవడం, మెడమీద తలలేని పని. పోనీ షోకు పెద్ద తలలు వస్తున్నాయని తెలిసీ, తగిన బందోబస్తు చేయకపోవడం.. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను ముందుగా అంచనా వేసి, అందుకు తగిన భద్రతను ఏర్పాటుచేయకపోవడం పోలీసుల తప్పు. అసలు సంధ్య థియేటర్‌లో జరిగిన షోకు, పోలీసుల అనుమతి ఉందా? లేదా? థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరిందా? లేదా? అన్నదే ప్రశ్న. ఇప్పుడీ యవ్వారం జాతీయ మానస హక్కుల కమిషన్‌కు చేరింది.
ఇదే సినిమా ఫంక్షన్ ను నగరంలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించారు. దానికోసం ట్రాఫిక్ పక్కదారి పట్టించారు. ఫలితంగా ఆరోజు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించి, జనం నానా చావు చావాల్సి వచ్చింది. దాదాపు 100మంది పోలీసులు ఆ ఫంక్షన్‌కు బందోబస్తుకు వచ్చారంటే, పోలీసుశాఖ ఎవరి సేవలో మునిగింది? పోనీ నిర్వహకుల నుంచి యోజర్‌చార్జీలు వసూలు చేశారా?
ఒక ప్రైవేటు ఫంక్షన్ కోసం ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? అందుకు ప్రభుత్వం వారిని ఎందుకు అనుమతించాలి? నగరానికి చివరలో ఏ పొలాల్లోనే సినిమా ఫంక్షన్లు చేసుకోవచ్చు కదా? ఈ బరితెగింపేమిటి? అందుకు పాలకుల ప్రోత్సాహమేమిటి? సినిమా వాళ్లంటే ఎందుకంత ప్రేమ? సినిమా వాళ్లు ఎన్ని అడ్డగోలు పనులు చేసినా పట్టించుకోరా? అన్నది పాలకులపై పాలితులు సంధిస్తున్న ప్రశ్న.
సరే.. సంథ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషాదంపై ఎవరూ స్పందించకపోయినా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాత్రం కదిలించడం గొప్ప విషయం. ఆఫ్టరాల్ ఒక సినిమా.. మనిషి జీవితాన్ని కబళించడంపై సచివుడు సీరియస్ అయ్యారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకువస్తారా? అంటూ సినిమా కంపెనీపై కన్నెర్ర చేసిన తీరు అభినందనీయం.
‘‘అసలు హీరోలు ఆ టైమ్‌లో థియేటర్‌కు వెళ్లడం కరె క్టేనా? ఈ ఘటనపై హీరో గానీ, మేనేజ్‌మెంట్ గానీ స్పందించకపోవడం బాధాకరం. మనిషి ప్రాణం తీస్కొస్తరా? కలెక్షన్లు వేల కోట్లు అంటున్రుకదా? చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇవ్వండి. ఇకపై ఎక్కడా సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులిచ్చేది లేదు. దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తోంది’’అని సినిమావాళ్లను దులిపేసిన కోమటిరెడ్డి దమ్మును, మనసున్న ప్రతి ఒక్కరూ మెచ్చుకోవలసిందే.
అది కూడా సీఎం అనుమతి లేకుండా మంత్రి చేసిన ప్రకటన ఆయన ఖలేజాను చాటుతోంది. సహజంగా బడా నిర్మాతలతో సర్కారు పెద్దతలలకు లింకులుంటాయి. ముఖ్యంగా ఇలాంటి ప్రకటనలు చేసేముందు మంత్రులు, సీఎంల అనుమతి తీసుకుంటారు. కానీ కోమటిరెడ్డి మాత్రం సీఎం అనుమతి లేకుండానే, బెనిఫిట్‌షోలపై నిషేధం విధించడమే గ్రేట్. ఈ ప్రత్యేక షోలు, టికెట్ల రేట్ల పెంపు వ్యవహారంలో సర్కారే అసలు ముద్దాయి. పాలకులు పర్మిషన్ ఇవ్వకపోతే, పుష్ప బెనిఫిట్ వేసేవారు కాదు. బెనిఫిట్ షో వేయకపోతే, ఆ మహిళ థియేటర్‌కు వచ్చి ఉండేది కాదు. సో.. ఒకరకంగా పాలకులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అదీ మంచిదే!
నిజానికి మంత్రి కోమటిరెడ్డి చేసింది మామూలు సాహసం కాదు. ఆయన ఏకంగా సినిమా లాబీనే ఢీకొన్నారు. ఇంత పెద్ద ప్రకటన ఇవ్వడానికి.. ఇంత సాహోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఆషామాషీ కాదు. స్వాతంత్య్రం వచ్చి, ఏపీ విడిపోయిన తర్వాత.. విభజిత రాష్ట్రం వరకూ, ఇప్పటిదాకా సినిమా వాళ్ల జోలికి వెళ్లిన సందర్భాలు బహు స్వల్పం.
అప్పట్లో ఎన్టీఆర్-కృష్ణ మధ్య సినిమా-రాజకీయపరమైన ఆధిపత్యపోరు జరిగింది. ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు పవన్ సినిమాలకు బెనిఫిట్స్ షో, ఎక్స్‌ట్రా రేట్లకు అనుమతి ఇవ్వలేదు. ప్రభాస్, మహేష్, చిరంజీవి వంటి అగ్రనేతలను చూసేందుకు జగన్ వారిని తన ఇంటికి పిలిపించుకున్నారు. ఏదైనా జగనన్న రూటే వేరు. కొందరికి కొంతమంది మొగ్గుళ్లు సెట్టవుతారు. ఆ ఘటనతో సినిమావాళ్ల కొమ్ములు విరిచిన మొనగాడిగా జగన్‌కు పేరొచ్చింది. అది వేరే కథనుకోండి.
సీనియర్ మంత్రి అయిన కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అప్పట్లో సినీ ప్రముఖులు ఆ శాఖమంత్రులతో బాగా అంటకాగేవారు. వ్యక్తిగత సంబంధాలు కొనసాగించేవారు. మరి కోమటిరెడ్డి మంత్రి అయిన తర్వాత బడా నిర్మాత, దర్శక ప్రముఖులెవరూ కలిసినట్లులేరు. అందరూ నేరుగా సీఎం రేవంత్‌రెడ్డితోనే భే టీ అవుతున్నారు.
ఈ క్రమంలో అక్కినేని ఎన్ కన్వన్షన్ అక్రమ కట్టడంపై, మంత్రి కోమటిరెడ్డి స్వయంగా హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దానితో రంగంలోకి దిగిన హైడ్రా, అక్కినేని ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది. అసలు అప్పటివరకూ నాగార్జున ఫంక్షన్‌హాల్‌వైపే చూసేందుకు భయపడ్డ అధికారులు, ఏకంగా దానిని కూల్చేయడమే ఆశ్చర్యం. కోమటిరెడ్డి రంగంలోకి దిగకపోతే, నాగార్జున ఆస్తి పదిలంగా ఉండేది. దానితో సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి తన సత్తా చాటారు.
మళ్లీ ఇప్పుడు పెద్ద సినిమా నిర్మాతల ఆదాయానికి గండికొడుతూ.. ఇకపై నగరంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూ చేసిన ప్రకటన, జనంలో కోమటిరెడ్డి ఇమేజీని మరింత పెంచేందుకు కారణమయింది. సహజంగా బడా నిర్మాతలు, బడా స్టార్లు మంత్రులను పెద్దగా ఖాతరు చేయరు. వారంతా నేరుగా సీఎంలనే కలుస్తారు. అందుకు అధికారంలో ఉన్న పార్టీల్లోని తన కులం వారినో, మిత్రుల ద్వారానో సీఎంతో భేటీ అవుతుంటారు. కానీ ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ సత్తా ఏమిటన్నది కోమటిరెడ్డి రెండోసారి చాటిన తర్వాత.. ఇకపై సినీ పెద్దలు, కోటమిరెడ్డి పట్ల క్రమశిక్షణతో ఉంటారేమో?!
అసలు పెద్ద హీరో సినిమాలకు ప్రత్యేక రాయితీలు ఎందుకివ్వాలన్నది ప్రశ్న. దానివల్ల బడా నిర్మాతల జేబు నింపి ఎవరికి లాభం చేకూరుస్తున్నారు? అందులో సర్కారు పెద్దలు పొందే నజరానా ఎంత? చిన్న సినిమాలకు ఇవ్వని రాయితీలు, వెసులుబాటు బడా హీరోల సిన్మాలకే ఎందుకిస్తున్నారు? అన్న ప్రశ్నలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నవే. కానీ ఇప్పటికీ వాటికి సమాధానం దొరకడం లేదు. దొరకదు కూడా! ఒక్కో టికెట్ 1800 రూపాయలకు అమ్ముకోమని చెప్పడమంటే.. జనం జేబులు కొట్టేసుకోమని పాలకులే పర్మిషన్ ఇచ్చినట్లు కదా? అసలు ఇలాంటి విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉండటం అవసరమా? అన్నదే ఇప్పుడు ‘పుష్ప విలాపం‘ మిగిల్చిన ప్రశ్న. సంథ్య థియేటర్ ఘటన నిస్సందేహంగా ఒక సినిమా చేసిన హత్యనే.
తన సినిమాకు వచ్చిన మహిళ మృతి చెందినందుకు పరిహారంగా, హీరో అల్లు అర్జున్ ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించినా.. పోయిన ప్రాణం తెచ్చివ్వగలరా? వందలకోట్ల బిజినెసు చేసుకుంటున్న సినిమా నిర్మాత, ఒక మహిళ ప్రాణానికి కేవలం 25 లక్షల ఖరీదు కట్టడాన్ని సమాజం స్వాగతించాలా? ఇలా అడ్డగోలుగా అనుమతి లేకుండా ప్రీ సినిమా రిలీజ్ ఫంక్షన్లు, బెనిఫిట్ షోలు నిర్వహించి… ఆ నరమేధంలో తెగిపడే తలలకు ఖరీదు కట్టడం ఫ్యాషనయిపోయింది. ఈ పాపం పాలకులదే! అవును.. ప్రేక్షకుల శవాలపై పేలాలు ఏరుకునేందుకు సినీపెద్దలకు, సర్కారు అధికారికంగా ఇచ్చిన లైసెన్సు ఇది! కాదనే దమ్మెవరికుంది? అయినా ఎర్రచందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలన్న సినిమాకు అవార్డులు కట్టబెట్టిన పాలకుల ఎదుట ఈ వేదన అరణ్యరోదనే!