తనను మరోసారి సస్పెండ్ చేయడంపై ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తనపై ఒక్క ఛార్జ్ షీట్ కూడా లేదని ఆయన అన్నారు. తన సంతకాలను ఫోర్జరీ చేశారని… దీనిపై సీఎస్ కు మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మీద 12 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయని… ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసులు, ఛార్జ్ షీట్లు ఉన్నాయని… వీరికి వర్తించనివి తనకెలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి కొండను తవ్వుతూనే ఉన్నారని… ఇంత వరకు ఒక్క ఎలుకను కూడా పట్టలేదని అన్నారు.
మాట్లాడితే ఇజ్రాయెల్ కంపెనీ అంటుంటారని… అదేమైనా సూట్ కేస్ కంపెనీనా లేక కోల్ కత్తా కంపెనీనా అని ఏబీవీ ప్రశ్నించారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి, వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. సీఎంకు కానీ, సీఎస్ కు కానీ, డీజీపీకి కానీ కొన్ని పరిమితులు ఉంటాయని.. పరిమితులు దాటి ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ కోర్టులో నిలవదని చెప్పారు.
కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకున్నారు..
రాష్ట్రంలో ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉండగా మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని
తగులబెట్టాలనుకున్నారని… అయితే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తాను ఆ ఘటనలు జరగకుండా అడ్డుకున్నానని… అందువల్లే తనను టార్గెట్ చేశారని చెప్పారు.
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి… నీ సంగతి చూస్తామని బెదిరించాడని.. అర్ధరాత్రి సమయం కదా, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో అని తాను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ, ఆ ప్రజాప్రతినిధే నిన్న భోరున ఏడ్చాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయని ఎద్దేవా చేశారు.
రిటైర్ అయ్యేంత వరకు ఖాకీ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తామని మరో ప్రజాప్రతినిధి గతంలో తనను బెదిరించారని ఏబీవీ అన్నారు. ప్రస్తుతం తాను చేయగలిగింది న్యాయ పోరాటం లేదా ధర్మ పోరాటం
మాత్రమేనని చెప్పారు. ఐపీఎస్ అధికారిగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి తాను వ్యవసాయం చేస్తూనే ఉన్నానని… పంటకు పట్టిన చీడపురుగులను ఏరివేస్తూనే ఉన్నానని చెప్పారు.