-తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అడ్రస్ లేని ముఖ్యమంత్రి, మంత్రులు
-తిత్లీ తుఫాన్, ఇతర ఉపద్రవాల సమయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును ప్రజలంతా చూశారు
-తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డికి అభినందనలు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతుంటే ఒక చిరు సందేశాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చోవడం పరిశీలిస్తే… రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగానే ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొంతమంది కిమ్ అని కూడా అంటారు. ఈ అభినవ నీరో కిమ్ ఇప్పటికైనా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు .
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉపద్రవాలు వచ్చిన ప్రాంతంలోనే ఉంటే ఎంత సాధికారికంగా పనులు జరుగుతాయో విశాఖపట్నంలో తిత్లి తుఫాను వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు ద్వారా మనమంతా చూశామన్నారు. ఇలా ఒక్కసారి కాదు, అనేకసార్లు ఉపద్రవాలు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా వ్యవహరించి వాటిని ఎదుర్కొన్నారన్నారని గుర్తు చేశారు . ఒక మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే ప్రజలెంత ఇబ్బందులకు గురవుతారో ఇప్పుడు అర్థమవుతుందన్నారు. ఉభయగోదావరి జిల్లాలో తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఆయన మంత్రివర్గ సహచరుల అడ్రస్ లేకుండా పోయింది.
ముఖ్యమంత్రి, మంత్రులే అడ్రస్ లేనప్పుడు, ఎమ్మెల్యేలు కూడా అడ్రస్ లేకుండా పోతారన్నారు . ప్రస్తుతం రాష్ట్రంలో తుఫాను బాధితులను ఎవరు పట్టించుకోని దుస్థితి నెలకొందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు . ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని, అప్రమత్తత లేకుండా వ్యవహరించడం చూస్తుంటే బాధనిపిస్తుంది. పార్లమెంట్ సమావేశాలలోనూ మా పార్టీ తరఫున తుఫాన్ వల్ల వాటిల్లిన నష్టం గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తుఫాను వల్ల జరిగిన నష్టం గురించి జీరో అవర్లో నేను ప్రస్తావించాలని భావించాను.
కానీ నాకంటే ముందుగానే అవకాశం లభించిన టిడిపి సభ్యుడు గల్లా జయదేవ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. వైకాపా తరపున మాట్లాడిన ఏ ఒక్క సభ్యుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్లమెంటరీ పార్టీ నాయకుడైన విజయసాయిరెడ్డి తో పాటు ఇతర రెడ్లు, పార్టీ సభ్యులు కూడా తుఫాను విపత్తు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నా అనర్హత అంశం గురించే మాట్లాడడం అన్నది హాస్యాస్పదంగా ఉందన్నారు.
తగిన సమయంలో తగు సహాయం చేయటం అన్నది అత్యవసరమన్న రఘు రామ కృష్ణంరాజు, ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు, మా పార్టీ శాసనసభ్యులకు ప్రజలకు సేవ చేసే మనస్తత్వాన్ని కలుగజేయాలని ఆ దేవుడిని ప్రార్థించడం మినహా మనము చేయగలిగింది ఏమీ లేదన్నారు . ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో చెట్లు నేలకొరిగాయి… కొత్తగా చెట్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా బాధిత ప్రజల వద్దకు జగన్మోహన్ రెడ్డి వెళ్లాలని కోరుకుంటున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు.
ఆడే వారిని మాత్రమే ఆడించండి
ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమంలో కచ్చితంగా 12 శాతం మంది ప్రజలు ఆటలు ఆడాలని, మరో 12 శాతం మంది ప్రజలు ఆటలు ఆడడం రాకపోతే, మైదానానికి వచ్చి ఆటలను తిలకించాలని ప్రభుత్వ పెద్దలు షరతులను విధిస్తుండడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. మైదానం వద్ద జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారన్న ఆయన,వాటిని తిలకించడానికైన రావాలని ప్రజలను ఒత్తిడి చేస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆత్మబలం చిత్రంలో జగ్గయ్య పాత్ర తనకు గుర్తుకు వస్తుందన్నారు.
హీరోయిన్ ను పట్టుకొని డాన్స్… డాన్స్ అంటారని, అంతకుముందే పాడమని బలవంత పెడతారని గుర్తు చేశారు. హీరోయిన్, హీరో నాగేశ్వరరావు వైపు కంటిచూపుతో చూసి బలవంత పెడుతున్నాడని కంటితో సైగ చేయగా, వాడు ఒక పిచ్చోడు అని డాన్స్ చేయమన్నట్లుగా ఆయన కూడా సైగ చేస్తారని చెప్పారు. ఆడుకుందాము ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆడే వారిని మాత్రం ఆడనివ్వండి… బలవంతంగా ఆడించే ప్రయత్నం చేయవద్దని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు .
లేపి తన్నించుకునే కార్యక్రమాలు చేయొద్దు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను చేపట్టనున్న రేవంత్ రెడ్డి పై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటుకు నోటు కేసు పెట్టి ఉండకపోతే, ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఉండేవారు కాదేమోనని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారన్నారు. ఎక్కడో ఉన్నవాడిపై అక్రమ కేసులు బనాయించి నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చారని పేర్కొన్నట్టు గుర్తు చేశారు . అలాగే, నాపై… తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై, తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించడం అంటే, లేపి తన్నించుకోవడమే అవుతుందన్నారు .
అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టి, చిత్రహింసలకు గురిచేయాలన్న మానసిక స్థితి నుంచి ముఖ్యమంత్రి బయట పడాలని హితవు పలికారు. అందుకే, పెద్దలు చెరుపకురా చెడేవు అంటారని, వారేమీ ఊరికే చెప్పలేదన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తే మంచిదని రఘురామకృష్ణంరాజు అన్నారు .