Suryaa.co.in

Andhra Pradesh

నరకకూపంలో నగర శివారు కాలనీలు

-తటాకాలను తలపిస్తున్న రహదారులు
-తమని అసలు మనుషులుగా పాలకులు గానీ అధికారులు కానీ గుర్తించటంలేదని ఆవేదన వ్యక్తం చేసిన నేతాజీ నగర్ వాసులు
-ఎన్నికలప్పుడు కనిపించిన కార్పొరేటర్ చంద్రగిరి సువర్ణ కుమారి
-కంట కునుకు లేకుండా 48 గంటల పాటు నరకయాతన పడ్డామంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు , నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఎదుట కన్నీటి పర్యంతమైన 25 వ డివిజన్ ప్రజలు

గుంటూరు: మౌలిక సదుపాయాల కల్పనలో నగరపాలక సంస్థ అధికారులు , వైసీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని , గుంటూరు నగర శివారు కాలనీలు నరకకూపంలా మారాయని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు , నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం 25 వ డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ , పట్టంశెట్టి వెంకటేశ్వరరావు నగర్ , యతిరాజ్ కాలనీల్లో వీరు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమని అసలు మనుషులుగా వైసీపీ నేతలు కానీ నగరపాలక సంస్థ అధికారులు కానీ గుర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవైపు జోరున వర్షం , మరోవైపు కరెంట్ లేక చిన్నపిల్లలతో 48 గంటల పాటు నరకం అనుభవించామని నేతల ఎదుట తమ గోడుని వెళ్లబుచ్చారు. ఇల్లాల్లోకి వర్షపు నీటితో పాటూ పాములు కూడా వచ్చాయని ఆవేదన చెందారు. ఎన్నికల సమయంలో కనిపించిన కార్పొరేటర్ చంద్రగిరి సువర్ణ కుమారి మరలా ఇప్పటివరకు కనపడలేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు , నేరేళ్ళ సురేష్ లు మాట్లాడుతూ నగరంలో 600 కోట్లతో అభివృద్ధి చేశామని పదే పదే జబ్బలు చరుచుకునే వైసీపీ నేతలు ఒకసారి ఇక్కడికి వస్తే తాము చేసిన అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ప్రత్యక్షంగా చూడొచ్చని ఎద్దేవా చేశారు.

గుంటూరు మున్సిపల్ స్థాయి నుండి నగరపాలక సంస్థగా ఏర్పడి దశాబ్దాలు గడిచినా ఇంకా సరైన రోడ్లు , సైడు కాలువల నిర్మాణాలు లేని ప్రాంతాలు ఉండటం సిగ్గుచేటన్నారు. చిన్నపాటి వర్షానికే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయన్నారు. రహదారులు తటాకాలను తలపిస్తున్నాయని , పాములు సైతం ఇల్లల్లోకి వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి వంగి వంగి నమస్కారాలు పెట్టి ఓట్లు అడిగిన నేతలు సమస్యల పరిష్కారం లో మాత్రం కంటికి కరువయ్యారని దుయ్యబట్టారు. స్థానిక కార్పొరేటర్ చంద్రగిరి సువర్ణ కుమారి ఎన్నికల సమయంలో కనిపించారని , గెలిచాక ప్రజా సమస్యల్ని గాలికొదిలేసారని ధ్వజమెత్తారు.

వైసీపీ నేతలకు ప్రజాధనాన్ని దోచుకోవటంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవ చేయటంలో లేదన్నారు. కనీసం నగరపాలక సంస్థ అధికారులన్నా బాధ్యత తీసుకొని స్థానికంగా నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని అడిషనల్ కమీషనర్ కు ఫోన్ చేసి గాదె వెంకటేశ్వరరావు , నేరేళ్ళ సురేష్ కోరారు. పరిస్థితి తీవ్రతను తెలియచేశారు. సమస్యల్ని పరిష్కరించని పక్షంలో ప్రజల్ని కలుపుకొని కార్పోరేషన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

డివిజన్ అధ్యక్షుడు కదిరి సంజీవ్ , జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి , జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్ , కార్యదర్శి త్రినాధ్ , నగర కార్యదర్శి పులిగడ్డ గోపి , 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ , మిద్దె నాగరాజు , శ్రీకాంత్ , కుమారస్వామి , గోపి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE