Home » పవన్ ఓటమి ఖాయం..లేదంటే పేరు మార్చుకుంటా

పవన్ ఓటమి ఖాయం..లేదంటే పేరు మార్చుకుంటా

-ముద్రగడ చాలెంజ్

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని… ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని… మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామని అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరినీ దగ్గరకు రానివ్వరని… కనీసం తన వద్ద పనిచేసే డైరెక్టర్లకైనా కప్పు కాఫీ ఇచ్చారా? అని ప్రశ్నించారు.

వాళ్ల ఇంట్లో పది మంది ఉన్నారని… ఎవరి బర్త్ డే వచ్చినా వాళ్లింటికి కేకుతో పాటు, భోజనాలన్నీ ప్రొడ్యూసర్లు పంపించాలంట అని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేక్ నుంచి ఫుడ్ వరకు నిర్మాతే భరించాలట అని అన్నారు. కాఫీ ఇవ్వడానికి కూడా పవన్ కు మనసు రాదని… ఆయనకు డబ్బే ప్రాణమని చెప్పారు. ఇతరులను గౌరవించే గుణం తనకు ఉందని అన్నారు.

కష్టమొస్తే మాట్లాడటానికి ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇచ్చారా? అని పవన్ ను ముద్రగడ ప్రశ్నించారు. ఎవరినీ ప్రేమించరు, ఎవరినీ దగ్గరకు రానివ్వరని అన్నారు. పవన్ ను నమ్ముకుని నాశనమయ్యామని ఆయన పార్టీలో ఉన్నవారే అంటున్నారని చెప్పారు. రైతుల కోసం చందాలు వసూలు చేశామని చెపుతున్నారని… ఏ రైతుకు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్లు కూడా అమ్ముకున్నారని అంటున్నారని చెప్పారు. పవన్ కు సినిమా ఆదాయం కంటే… రాజకీయాల్లో ఆదాయమే ఎక్కువని మీ సన్నిహితులే చెపుతున్నారని అన్నారు. పవన్ ఎవరికీ పెట్టరని, పెట్టమని చెప్పినా ఆయనకు నచ్చదని ఎద్దేవా చేశారు. తనను ఉప్మా, కాఫీ అనడానికి సిగ్గులేదూ? అని అన్నారు.

Leave a Reply