Suryaa.co.in

Political News

బాబును అపార్థం చేసుకున్న ఏబీవీ అభిమానులు !?

“కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి….నాలుగు నెలలైతే , ఏబీవీ కి ఇంకా పదవి ఇవ్వలేదేంటి ?”
“చంద్రబాబేంటీ ఇంకా సార్ ను గుర్తించ లేదు !?”
“ఏబీవీ సార్ కి , లోకేష్ కు ఏమైనా గ్యాప్ వచ్చిందా సారూ…!?”
“జూన్ 12 న బాబు గారు సీ ఎమ్ గా ప్రమాణ స్వీకారం చేశారు కదా ! 13 నే ఏబీవీ సార్ కు అడ్వైజర్ పోస్ట్ ఇచ్చి, వాళ్ళ తొక్క తీయిస్తారనుకున్నామే….! ఇంకా పట్టించుకోలేదేంటి !?”
“బాబు సంగతి మనకు తెలియదా ఏంటి !? సాగదీసుడేగా…!”

ఈ తరహా కామెంట్లే, గత నాలుగు నెలలుగా సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్నాయి . యూ ట్యూబ్ చానళ్ళకయితే, ఇదో సూపర్ హిట్ టాపిక్ ….. వేలల్లో వ్యూస్. ఒక రకంగా యూ ట్యూబ్ చానళ్ళ చేతి లో …మోస్ట్ ఎబ్యూజ్డ్ ఆఫీసర్ – ఏబీ వేంకటేశ్వర రావు . ఆయన పేరుతో ఆడుకున్నారు .

ఆయన పట్ల ఐదేళ్ళ పాటు జగన్ అనుసరించిన అనుచిత , అమానుష , అమర్యాదకర , అరాచక వ్యవహార శైలిని ఏబీవీ ఎదురొడ్డి నిలిచి పోరాడిన తీరు, ప్రపంచవ్యాప్తం గా వైసీపీయేతర తెలుగువారిని కదిలించిన ఫలితం ఇది. అందువల్ల , సోషల్ మీడియా ను తప్పు పట్టాల్సిన పని లేదు .

ఈ కారణం వల్లనే; కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి , ఏబీవీ అభిమానులు , శ్రేయోభిలాషులు , పరిచయస్తులు , మనిషి కాకుండా పేరు మాత్రమే తెలిసిన వారు , ఆయన పేరు విన్నవారు కూడా ఈ ఏడాది జూన్ 12 నుంచి ….రోజూ ఓ యుగం గా గడుపుతూ వచ్చారు . ఆయనకు , ప్రభుత్వ గుర్తింపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ . నిజానికి , ప్రభుత్వం తో ఆయనకు పని లేదు . ఆయనతోనే ప్రభుత్వానికి బోలెడంత పని ఉన్నది.

ఆయన వరకు ఆయన – ఈ ఏడాది మే 31 వ తేదీన 35 ఏళ్ళ పోలీసు ఉద్యోగం నుంచి ఘనాతి ఘనం గా రిటైర్ అయ్యాక ; జూన్ మొదటి వారం నుంచి ….శుభ్రం గా పంచె కట్టి, తలపాగా చుట్టుకుని పొలం వెళ్లి పోతున్నారు . పలుగు, పారా (గొడ్డలి కాదు )పట్టుకుని , మొక్కలకు నీళ్ళు పెట్టు కోవడం , పాదుల్లో కలుపు ఏరేయడం చేసుకుంటూ, సాయంత్రానికి ఇంటికి చేరి; 83 ఏళ్ళ తల్లికి పొలం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు . “పొలం లో కలుపు మొక్కలు సరే…, ప్రభుత్వ వ్యవస్థల్లోని కలుపు మొక్కల సంగతేంటి ? బాబు ఇంకా పట్టించుకోడేంటి ?”అని అడుగుతూ ….సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టేవారు కోకొల్లలు .

మామూలు గా ఏ పంట పొలం లో అయినా ….పొలం అంతా పంట పరుచుకుని ఉంటుంది…., కలుపు మొక్కలు అక్కడక్కడా ఉంటాయి. కనుక , ఆ కలుపు మొక్కల్ని పీకేయడం సులభం .

కానీ, పొలం అంత కలుపు మొక్కలే విస్తారం గా పెరిగిపోయి ….; అసలు పంట మొక్కలే కనపడినంతగా కుంచించుకు పోతే ; ఆ కలుపును ఏరి వేయడం చంద్రబాబుకు సాధ్యమయ్యే పనేనా ? ఇంత కలుపును ఆయన , తన 45 ఏళ్ళ ప్రజా జీవితంలో చూసి ఉండరు .

అందుకే , ఏబీవీ పోరాటం పై ఎంతటి అభిమానం వెల్లువెత్తిందో; ఆయన సేవలను చంద్రబాబు ఇంకా ఉపయోగించుకోవడం లేదనే అసంతృప్తి అంతగా జనం లోకి చొచ్చుకుపోయింది .

ప్రతి నియోజకవర్గం లోనూ ఒక మినీ జగన్ , ఒక మినీ సజ్జల రామకృష్ణారెడ్డి , ఒక మినీ గుడివాడ అమర్నాథ్ , ఒక మినీ అంబటి రాంబాబు , ఒక మినీ కొడాలి నాని, ఒక ఆ రెడ్డి , ఒక ఈ రెడ్డి …..ఐదేళ్ళ పాటు జనాలపై బడి స్వైర విహారం చేశారు అనే ఆరోపణలకు లెక్కే లేదు .

వారికి పోలీసులు ఊతం గా నిలిచారు . ‘పోలీసులు ‘ అంటే ….మామూలు పోలీసులు కాదు . ఐపీఎస్ లు . ఈ ఐపీఎస్ లు అందరూ దాదాపుగా ఏబీవీ ముందు గతం లో చేతులు కట్టుకు నిలబడిన వారే . ఈ ఐపీఎస్ లు…. వైపీఎస్ లు గా మారిపోయి వ్యవహరించిన తీరు – “సీతారామ” కళ్యాణం సినిమా లోని కొన్ని దృశ్యాలను గుర్తుకు తెస్తున్నది .

అందుకే , ప్రభుత్వానికి ఏబీవీ సేవలు అవసరం అని జనం ఎదురు చూసింది . ఈ వైపీఎస్ ల్లో ప్రతి ఒక్కరూ ఆయనకు జూనియర్ , సబ్ జూనియర్ లే .

అయితే , చంద్రబాబు ఆలోచన వేరు . వెళ్లిపోయిన పాలకులు ఏబీవీ బట్టలకు అంటించిన మలినపు మరకలు ఓ మూడు ఇంకా అలాగే ఉండగా; ఆయనకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించడం ఎందుకన్న మీమాంస లో చంద్రబాబు ఉన్నారని, ఆయనకు సన్నిహితం గా మెలిగే ఓ మాజీ మంత్రి చెప్పారు

నిజానికి , ఏబీవీ కి దాదాపు కోటి రూపాయలకు పైగా జీతభత్యాల బకాయిలు ప్రభుత్వం నుంచి రావల్సిఉంది. అవీ రాలేదు. ఇప్పుడు… రెండు అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఇంకో మరక ఉంది. ఇజ్రాయెల్ దేశం నుంచి కొననీ, పెట్టనీ, అసలు కొనడానికి అధికారమే లేని ఏబీ వేంకటేశ్వర రావు …. ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో అవినీతి కి పాల్పడ్డారనేది ఆ పనికిమాలిన అభియోగం. అది కూడా ఈ వారంలో ప్రభుత్వం ఉపసంహరించుకోవచ్చునని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి .

ఇది కూడా క్లియర్ అయితే ; ఆయన సేవలను ఏ స్థాయిలో ….ఎలా ఉపయోగించుకోవాలో చంద్రబాబు నాయుడుకు ఒకరు చెప్పాల్సిన పని లేదు . కలుపు మొక్కల ఏరివేత అప్పుడు మొదలవుతుంది .

– భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE