– ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
– నేడు చలో మెడికల్ కాలేజ్
గుంటూరు: ప్రపంచంలోనే పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసి ప్రజారోగ్యాన్ని అమ్మకానికి పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని శాసనమండలి సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా ఇటు వైద్య విద్య అటు వైద్యం రెండూ కూడా పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగానే ఈనెల 19వ తేదీన “చలో మెడికల్ కాలేజీ” కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈనెల 19న జరుగనున్న “ఛలో మెడికల్ కాలేజీ” కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఇతర విద్యార్ధి నాయకులతో కలిసి అప్పిరెడ్డి ఆవిష్కరించారు.
వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ, నేటి ఆధునిక సమాజంలో అత్యంత ప్రాధాన్యత గల విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. ఈ వాస్తవం తెలిసిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తన హయాంలో పెద్ద సంఖ్యలో వైద్యులను తయారు చేసి తద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలన్న సంకల్పంతో 8,500 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాపతోటి అంబేద్కర్, దూపాటి వంశీ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బత్తుల దేవానంద్, రవి, బాజీ, గోపీ, కోటి, భరద్వాజ్, బాలు, మస్తాన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.