-ప్లీనరీ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ జగన్ రెడ్డి
-రాజ్యాంగం అందరికి సమానమే అన్న విషయాన్ని మరిచిన ప్రభుత్వం
-2 రోజుల ప్లీనరీ – ఆర్టీసీకి రూ.10 కోట్లు నష్టం
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేయడానికి అనేక సాకులు చెప్పి అనుమతించకుండా అడ్డంకులు సృష్టించే ప్రభుత్వం నేడు వైసీపీ ప్లీనరీకి మాత్రం సపర్యాదాలు చేస్తున్నారు. అధికారపక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షానికి మరొక న్యాయమా? రాజ్యాంగం అందరికి సమానమే అన్న విషయాన్ని జగన్ రెడ్డి మర్చిపోయారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవాలంటే అడ్డంకులు సృష్టించారు ఆఖరికి పోలీసులతో వాహనాల టైర్లలో గాలి తీయించారు. హైవోలో ట్రాఫిక్ జామ్ అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలకు షరతులు పెట్టారు. పైపెచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రకరకాలు ఇబ్బందులకు గురి చేశారు. రాజధాని రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తామంటే అనుమతినివ్వలేదు. ఎట్టకేలకు పాదయాత్ర చేపడితే అనేక అంతరాలు సృష్టించారు.
నేడు వైసీపీ ప్లీనరీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరి సేవలు చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో విద్యార్ధులకు పరీక్షాలున్నా కూడా బలవంతంగా రెండు రోజులు సెలవులిచ్చారు. స్కూల్ బస్సులను పాఠశాలల నుంచి లాక్కుని విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేశారు. ఆర్టీసీ బస్సులను ఇష్టానుసారంగా ప్లీనరీకి ఉపయోగిస్తున్నారు. ఐదు జిల్లాల నుంచి రెండు రోజుల పాటు దాదాపు 1,812 బస్సులను వినియోగిస్తున్నారు. రోజుకి ఒక బస్సుకు రూ.30వేల ఆదాయం చొప్పున 1812 బస్సులకు రెండు రోజులకు గాను దాదాపు రూ.10.87 కోట్ల ఆదాయం ఆర్టీసీ నష్టం వాటిల్లితుంది. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిందని మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. నేడు పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ బస్సులను వినియోగించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారు. పొట్టకూటి కోసం నిద్రలు సైతం మానుకొని కుటుంబం సాగించుకుంటున్న ప్రైవేట్ వాహనదారులను బెదిరించి వాహనాలను సరఫరా చేయాలని హుకుం జారీ చేయడం ఎంత వరకు సబబు. డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా హైవేపై ఫ్లెక్సీలు పెట్టడంతో వాహనదారులు నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. జాతీయ రహదారిని పోలీసులు ఆదీనంలోకి తీసుకున్నారు. చెన్నై – కోల్ కత్తా జాతీయ రహదారిపై వందలాది వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో వాహనాలు ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి. మీడియాపై కక్షపూరితంగా ఆంక్షలు విధించారు.