Suryaa.co.in

Telangana

మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం

  • సోనియమ్మ మాట ఇస్తే అది శిలాశాసనం
  • తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండుగ రోజు
  • సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: దసరా వరకు మంచిరోజులు లేవని వేదపండితులు సూచించారు. అందుకే ఇవాళ హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారు. సోనియమ్మ మాట ఇస్తే అది శిలాశాసనం. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు.

పదేళ్లు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారు. నేనే తెలంగాణ.. తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించారు. ప్రజా ప్రభుత్వం అలాంటి విధానాలకు వ్యతిరేకం. సచివాలయం తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు గుండెకాయలాంటిది. గత పాలకులు పదేళ్లు సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదు.

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు వారికి మనసు రాలేదు. ట్యాంక్ బండ్ నలువైపులా ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం ఒక లోటుగా కనిపించింది. మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని వివాదం చేసేందుకే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడి పెట్టారు.

పదేళ్లు అధికారంలో ఉండి వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని మేం గతంలోనే ప్రకటించాం. కన్నతల్లిని తపించేలా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలన్నది మా అభిమతం. విగ్రహం రూపొందించే బాధ్యతను జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించాం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం.

తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండుగ రోజు. వేలాది మందితో పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇది అరుదైన అవకాశం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా.

LEAVE A RESPONSE