-
రివర్స్ టెండరింగ్ రద్దు నిర్ణయం అసంబద్ధం
-
దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంతో గండం
-
గతంలో మాదిరిగా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం
-
మాజీ మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు: పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు వల్లనే ప్రాజెక్టుకు ఈరోజు ఆ దుస్థితి నెలకొందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నాడు సీఎంగా జగన్‌గారి కృషి వల్లనే పోలవరంకు కేంద్రం నిధులు ఇస్తోందన్న ఆయన, నిజానికి నాడు ఎన్నికల ముందు, ఆ నిధులు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారని వెల్లడించారు. పోలవరంకు కేంద్రం నిధులపై జగన్‌గారికి క్రెడిట్ రాకూడదన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఆ పని చేశారని, ఇప్పుడు అవే నిధులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలనీ, అభూత కల్పనలని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
పోలవరం మొదటి దశ అంటే 41.15 మీటర్ల నీటి నిల్వకు సంబందించిన దశ కాగా, అది పూరై్తన తర్వాత రెండో దశకు వెళ్తారని గుర్తు చేసిన అంబటి రాంబాబు, అప్పుడు 45.72 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ చేయొచ్చని తెలిపారు. ఆ మొదటిదశ పనుల పూర్తికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.12,157 కోట్ల నిధుల కోసం నాటి సీఎం వైయస్ జగన్, అనేక సార్లు ప్రధానితో, అప్పటి జలశక్తి మంత్రితో చర్చించి, వారిని ఒప్పించి విడుదలకు అంగీకరింపచేశారని వెల్లడించారు.
అంతేతప్ప, ఆ నిధుల విషయంలో చంద్రబాబు చేసిన కృషి ఏ మాత్రం లేదని చెప్పారు. పోలవరం పనులను మొదలు పెట్టిన వైయస్సార్ కాలువల పనులను వేగం చేసి, కుడి కాలువలో 90 శాతం పూర్తి చేశారని చెప్పారు. దాన్నే పట్టిసీమ పేరుతో మనం ఉపయోగించుకుంటున్నామని గుర్తు చేశారు.
నిజానికి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం, ఆ పనులు చేయాల్సి ఉన్నా.. కమిషన్ల కోసమే నాడు చంద్రబాబు ఆ పనులు తామే చేస్తామని తీసుకున్నారని తెలిపారు. అంతే కాకుండా, 2013–14 రేట్ల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2016లో చెప్పడం దారుణమని అన్నారు.
2013–14 స్టాండర్ట్ రేట్ల ప్రకారం నాడు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398 కోట్లు కాగా, అందులో రూ.4,730.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని.. దాంతో మిగిలిన రూ.15,668 కోట్లు ఇస్తామన్నా, అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారన్న అంబటి.. అది ఎవరి కోసం చేశారని నిలదీశారు.
పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలన్నింటినీ సవరిస్తూ.. పెరిగిన రేట్ల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని నాడు సీఎం వైయస్ జగన్ కేంద్రానికి నివేదించారని అంబటి రాంబాబు తెలిపారు. ప్రాజెక్టును మొత్తం పూర్తి చేయడానికి రివైజ్డ్ రేట్ల ప్రకారం రూ.55,656 కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి మేం పంపితే.. అక్కడ టెక్నికల్ ఎస్టిమేషన్ కమిటీ చర్చించి రూ.47,725 కోట్లకు అనుమతి ఇచ్చారని చెప్పారు.
అలాగే ప్రాజెక్టు ఫస్ట్ స్టేజ్ పూర్తి చేయడానికి రూ.31,625 కోట్ల అంచనా వ్యయాన్ని కేంద్రానికి పంపితే, వాటిని సవరించిన కేంద్రం (కేంద్ర జలసంఘం) రూ.30,436 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు. ఇదంతా ఎన్నికల ముందే జరిగిందన్న ఆయన, ఆనాడు దాన్ని క్యాబినెట్ ముందు పెట్టకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. ఆ నిధులనే ఇప్పుడు కేంద్రం ఆమోదిస్తే.. అదంతా తన ఘనత అన్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు ఆక్షేపించారు.
రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడడమే కాకుండా, గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం కూడా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ పనుల్లో అవినీతికి తావు లేకుండా దేశంలో ఎక్కడా లేని వి«ధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు.
పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల ఇదంతా జరిగిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పు బట్టిన మాజీ మంత్రి, గతంలో నవయుగ కంటే ముందు స్టాల్‌స్టాయ్ ఉంటే దాన్ని ఎటువంటి టెండర్లు లేకుండా నామినేషన్ విధానంలో మార్చి నవయుగకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అది రామోజీ బంధువుల కంపెనీ అని అందరికీ తెలుసని చెప్పారు.
తమ ప్రభుత్వం వచ్చాక, పోలవరం పనులకు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల రూ.850 కోట్లు ఆదా అయ్యాయన్న ఆయన.. అదే ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంలోనూ రూ.782 కోట్లు, లెఫ్ట్ కనెక్టివిటీ 65 ప్యాకేజీ పనుల్లో రూ.58.53 కోట్లు, సోమశిల కెనాల్ రెండోదశ పనుల్లో రూ.67.09 కోట్లు, వెలిగొండ రెండో టన్నెల్ పనుల్లో రూ.61.76 కోట్లు.. ఇలా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనే రూ.2400 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.
పేదల ఇళ్ల నిర్మాణంలో 12 రకాల సామాగ్రి సేకరణలో రివర్స్ టెండరింగ్ విధానం వల్ల రూ.5120 కోట్లు ఆదా కాగా, విద్యుత్ రంగానికి సంబంధించి 2021–22లో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా రూ.4925 కోట్లు, హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు కాలువ విస్తరణ పనుల్లో రూ.44.15 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు.