– అది వదిన, మరిది మధ్య ఉన్న కుటుంబ తగాదా
– వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్
తాడేపల్లి: అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారి పల్లెలో సంధ్యారాణి అనే మహిళకు తన మరిది అజయ్ దేవ్ తో ఉన్న వివాదాల నేపథ్యంలో జరిగిన కుటుంబ తగాదాని వైయస్సార్సీపీకి ఆపాదిస్తూ మంత్రి నారా లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ వివరించారు. అతడు జనసేన పార్టీ కార్యకర్తేనని నిర్ధారించేలా ఉన్న సోషల్ మీడియా పోస్టులు, ఆ గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ ఆడియో టేపును నాగార్జున యాదవ్ ప్రెస్మీట్లో వినిపించారు.
వైయస్ జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా టపాసులు పేల్చవద్దన్నందుకు వైయస్సార్సీపీ కార్యకర్త గర్భిణిని కాలితో తన్ని దాడి చేశాడని ఒక కట్టు కథ అల్లి దుష్పచారం మొదలుపెట్టారు. వదిన, మరిది మధ్య జరిగిన కుటుంబ తగాదాని వైయస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ వీరాభిమాని, జనసేన పార్టీకి చెందిన అజయ్ దేవ్ ని వైయస్సార్సీపీ కార్యకర్తగా ప్రచారం మొదలుట్టారు.
అజయ్ దేవ్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆ వ్యక్తి పాల్గొన్న ఫొటోలు, మొన్న ఎన్నికల్లో జనసేన గెలవాలని కోరుకుంటూ షేర్ చేసిన వీడియోలు కనిపిస్తాయి. వైయస్సార్సీపీకి సంబంధం లేని వ్యక్తి అని ఇన్ని ఆధారాలు కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తున్నా ఎలాగైనా బురదజల్లాలనే కుట్రతో ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు.
ఆ గ్రామానికే చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ కూడా ఆ వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్తేనని అతడి చేతి మీద పవన్ కల్యాణ్ పచ్చ బొట్టు కూడా ఉందని చెబుతున్నాడు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత అతడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాడు.జనసేన పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ మీద పవన్ కల్యాణ్ కి ఎందుకంత కోపమో అర్థం కావడం లేదు. దీనిపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి.