– చికాగో బౌద్ధాలయంలో ప్రసంగించిన ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, డా. శివనాగిరెడ్డి
చికాగో: రెండో బుద్ధునిగా కీర్తి గడించి, సా.శ. 1-2 శతాబ్దాల్లో కృష్ణా తీరంలో శ్రీపర్వత-విజయపురిలో (ప్రస్తుత నాగార్జునకొండ)తన జీవిత చివర దశలో నివసించిన ఆచార్య నాగార్జునుడు, తన బోధనలను పొందుపరిచి రచించిన సుహృల్లేఖ, రత్నావళి, మూలమాధ్యమికకారిక, శూన్యతాస్తపతి గ్రంథాలు ఇప్పటి తరానికి ఆచరణీయాలని ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇల్లినాయిస్ రాష్ట్రం చికాగోలో 1944లో, రెండో ప్రపంచ యుద్ధ శిబిరాల్లో బంధితులైన జపాన్- అమెరికన్ల పునరావాస సందర్భంగా నిర్మించిన మిడ్ వెస్ట్ అమితాభ బౌద్ధాలయాన్ని గురువారం నాడు సందర్శించిన శివనాగిరెడ్డి.. ఆచార్య నాగార్జునుని మధ్యమమార్గం, శూన్యవాదం, నైతిక వర్తన, సశ్చీలత, వివేకం, శాశ్వతానందాన్నిచ్చే బుద్ధుని చతురార్య సత్యాలు, ఆర్య అష్టాంగిక మార్గాలను ఆచరిస్తే ప్రస్తుత సమాజంలోని రుగ్మతలను నిర్మూలించవచ్చని తన ప్రసంగంలో వివరించారు.
బుద్ధుని బోధనలు, నాగార్జునుని తాత్వికతలను ఈ తరానికి అందించి, బౌద్ధ సంస్కృతిని పరిరక్షించటానికి బుద్ధవనాన్ని నిర్మించటమైందని, దేశంలోనే అతిపెద్దదైన బుద్ధవనాన్ని దేశంలో నుంచి కాక దక్షిణాసియా, పశ్చిమ దేశాల బౌద్ధ పర్యాటకులు సందర్శిస్తున్నారని శివనాగిరెడ్డి చెప్పారు.
అనంతరం చికాగో -మిడ్ వెస్ట్ బుద్దిస్ట్ టెంపుల్ ప్రధానాచార్యులు పూజ్య గ్యాదో కోనో వారి ప్రచురణలను శివనాగిరెడ్డికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో చికాగో సాహితీ మిత్రులు సంస్థ కార్యదర్శి జయదేవ్ మెట్టుపల్లి పాల్గొన్నారు.