మాస్టారు..
ఇంగ్లీషు మాటాడితే
దొరల లెక్కుంటాది..
ఫ్రెంచిలో నాలుగు ముక్కలు చెబితే ఫ్రెంచోడే సిగ్గుపడతడు..
ఏ భాషలో మాటాడితే
ఆ భాషకే సొగసు..
నాలుగక్షరాలు రాస్తే
తెలిసిపోదా
ఆ భాష మనసు!
రోణంకి అప్పలస్వామి..
తెలుగుమో మాతృకం..
ఆంగ్లం కరతలామలకం..
జర్మనీ టకాటకం..
ఇటలీలో అత్యద్భుత వాచికం..
దేశ పొలిమేరలే
దాటని ఈ ఆచార్యుడు
ఎన్నో భాషలను అవలీలగా ఔపోసన పట్టేసిన శౌర్యుడు..
అనంత విజ్ఞాన
తేజోసూర్యుడు!
బెనారసులో చదివిన
రోణంకికి…
ఇన్ని ప్ర”పంచ”భాషలు
నేర్చిన అప్పలస్వామికి
బెంగాలి రాకుండునా..
మన దేశభాషలు
మరిన్ని నేర్వకున్న
కడుపు నిండునా..
హిందీ..ఒడియా..కన్నడం
అన్నిటిలో పాండిత్యం..
చిన్నప్పటి నుంచి
భాషలతోనే మాస్టారి సాంగత్యం..!
అక్షరాలే ఆయన బొమ్మలు..
పదాలే మురిపించే ముద్దుగుమ్మలు..!!
ఎన్నెన్నో భాషల గ్రంధాలు
ఇంకెన్నో భాషల్లోకి అనువాదాలు..
వేటికవే వేదాలు..
కొన్నయితే వ్యవస్థల
అక్రమాలపై సింహనాదాలు..
మొత్తంగా అన్నీ అప్పలస్వామి మాస్టారి
ప్రతిభకు కొలమానాలు
భావితరాలకు బహుమానాలు..!
ఎమ్మార్ కళాశాల..
శతాధిక వసంతాల
ఆ భవనాలు..
అక్కడ ప్రతీ ఇటిక్కీ
తెలుసు మాస్టారి కవనాలు
తలపై పిట్టల దొర టోపీ..
ఇస్త్రీ నలగని బట్టల సోకు..
ఖాకీ పంట్లాం..
బిరుసుగా గంజి పెట్టిన
తెల్లటి కాటన్ జుబ్బా…
ఇంతకీ ఇతనెవరబ్బా..
కొన్ని తరాల విద్యార్థుల్లో
ఇంగ్లీషు పిచ్చి పెంచిన పడత్తీ
(పడత్తీ మాస్టారి నిక్ నేమ్)
బహు భాషా సుగంధాలు వెదజల్లిన అగర్బత్తీ..
ఆ చారిత్రక కళాశాలకే
వన్నె తెచ్చిన మేరువు…
అందమైన ఆ లాబీల్లో
గంభీరంగా కదలాడిన
సజీవ నిఘంటువు…
చదువుల తల్లి నుదుటిన
సదా మెరిసే
జ్ఞానసింధువు…!
ఆచార్య రోణంకి వర్ధంతి సందర్భంగా అక్షరనివాళి..
ఆ బహుభాషావేత్త పనిచేసిన కాలంలో
కాకపోయినా అదే ఎమ్మార్ కళాశాలలో చదివిన
భాగ్యానికి నోచుకున్న
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286