-పాదయాత్ర హామీల్లో అమలుకానివి 90%– మేనిఫెస్టో వైఫల్యాలు 75%
-నవరత్నాల 40 హామీల్లో చెప్పినమేరకు చేయనివి 39
-హామీల అమలుపై ‘వాస్తవపత్రం’ విడుదల చేసిన అచ్చెన్నాయుడు
-99% హామీలు అమలు చేశామంటున్న జగన్ ను చర్చకు రావాలని సవాల్
గత ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో ప్రజలకిచ్చిన హామీలు, అనంతరం విడుదల చేసిన నవరత్నాలతో కూడిన మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల అమలులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని.. అయినా 99% హామీలు అమలుపరచామని బొంకుతూ ప్రజలను నిరంతరం మోసగిస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఈ మేరకు జగన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే నవరత్నాల అమలు వాస్తవికతపై ‘ప్రకాశించని నవరత్నాలు- జగన్ రెడ్డి మోసపు లీలలు’ పేరుతో తెదేపా కేంద్రకార్యాలయంలో నేడు జరిగిన పత్రికా సమావేశంలో ఒక వాస్తవ పత్రాన్ని ఆయన విడుదల చేశారు.
అనంతరం ప్రసంగిస్తూ.. ‘‘జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లి, ఊరూవాడా తిరిగి కనిపించిన వారికి, అడిగిన వారికి కాదనకుండా, లేదనకుండా హామీలిచ్చాడు. స్వతంత్ర భారతదేశంలో ప్రజలను మోసగించడంలో జగన్ రెడ్డిని మించిన తెలివైన వాడు మరొకడు లేడు. పాదయాత్ర సమయంలో ప్రజలకు 650 హామీలిచ్చాడు. చివరకు ఎన్నికలు దగ్గర పడ్డాక వాటన్నింటిని కుదించి మేనిఫెస్టో రూపొందించాడు. అది తనకు బైబిల్ తో సమానమని’’ప్రజల్ని నమ్మబలికిన జగన్ రెడ్డి ఈ హామీల అమలులో మాత్రం భారీగా వైఫల్యం చెంది ప్రజలను మోసగించాడు అని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ వైఫల్యాలను వివరిస్తూ.. పాదయాత్రలో ఇచ్చిన 650కు పైగా హామీల్లో కనీసం 10% కూడా అమలుకు నోచుకోలేదు. వాటిని కుదించి తయారుచేసి తనకు బైబిల్ సమానమని చెప్పుకునే మేనిఫెస్టోలో 25% హామీలు కూడా జగన్ రెడ్డి సరిగా అమలుచేయలేదని వివరించిన అచ్చెన్నాయుడు.. జగన్ మేనిఫెస్టోలో అంతర్భాగమైన నవరత్నాల అమలు గురించి అంశాల వారీగా అంకెలతో సహా వెల్లడించారు. ఈ నవరత్నాల కింద మొత్తం 40 హామీలు ఇచ్చారని.. వాటిల్లో జగన్ చెప్పిన మేరకు 39 హామీలు అమలుకు నోచుకోలేదని అచ్చెన్నాయుడు వెల్లడించారు. పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడమనే ఒక్క హామీని మాత్రమే నెరవేర్చారని ఆయన చెప్పారు.
నవరత్నాలకు సంబంధించి ప్రతి అంశం వాస్తవ అమలు స్థితిని అచ్చెన్నాయుడు కింది విధంగా వివరించారు.
1.రైతు భరోసా:
ప్రతి రైతుకు సాలీనా రూ.13,500 ఇస్తానని చెప్పి.. కేవలం రూ.7,500 మాత్రమే ఇవ్వడం; లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించడం ; కౌలు రైతులను నిర్లక్ష్యం చేయడం; పంటల బీమా హామీని ప్రహసనంగా మార్చడం; ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం అందించకపోవడం.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఎలా అవుతుందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
జగన్ రెడ్డి వంచనతో ఇక్కట్లు పడుతున్న రైతులను ఆదుకోవడానికి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకు రూ.20 వేల సహాయం చేస్తామని తెదేపా ప్రకటించిందని అచ్చెన్నాయుడు వివరించారు.
2.ఆరోగ్య శ్రీ:
వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన అన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని, పేదలకు కార్పోరేట్ వైద్యం అందిస్తామని నమ్మబలికిన జగన్ రెడ్డి.. ఆసుపత్రులకు బకాయిలు చెల్లించక ఆరోగ్యశ్రీని అటకెక్కించారని.. ఇదేనా పేదలకిచ్చిన ఆరోగ్యరక్షణ హామీని అమలుచేసే విధానమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
3.అమ్మఒడి
జగన్ రెడ్డి శైలి ‘ప్రచారం గొప్ప- ఊరుదిబ్బ’ చందంగా ఉందని, వివిధ పథకాల కింద బటన్ నొక్కిన ప్రతిసారి భారీ ప్రకటనలపై ప్రజాధనం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది స్కూల్ పిల్లలు ఉంటే.. వారందరి చదువు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని నమ్మబలికి నేడు కేవలం 42 లక్షల మందికే సాయం అందిస్తున్నారని.. ఇదేనా ఇచ్చిన ప్రతిహామీ నెరవేర్చడమా అని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థి అన్న మాట మరిచి కేవలం తల్లికి మాత్రమే అంటూ ఇస్తున్న రూ.15వేలల్లో కూడా రూ.2వేలు కట్ చేస్తున్నారని చెప్పారు. పిల్లలకు చదువు ప్రాముఖ్యత తెలిసిన తెదేపా అధికారంలోకి వచ్చాక ప్రతి స్కూల్ విద్యార్థికి సాలీనా రూ.15 వేలు ఇస్తుందని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు
4.పింఛన్ల పెంపు
గత తెలుగుదేశం ప్రభుత్వం నెలవారీ పింఛన్ ను రూ.200 నుంచి రూ.2వేలకు పెంచగా.. దానిని రూ.3 వేలకు పెంచుతామన్న జగన్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత కూడా ఇంకా తన హామీని నెరవేర్చలేదని.. పలు సాకులతో పింఛన్ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాడని.. వయోపరిమితి తగ్గింపుతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరగవలసి ఉండగా.. ఆ మేరకు పెరగలేదని జగన్ రెడ్డి మోసపు నైజాన్ని అచ్చెన్నాయుడు వివరించారు.
5.పేదలందిరికీ ఇళ్లు
ఐదేళ్లలో పేదలకు 25 లక్షల పక్క ఇళ్లు కట్టిస్తామని డాంభికాలు పలికిన జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 823 ఇళ్లు మాత్రమే కట్టగలిగిన వాస్తవాన్ని వెల్లడిస్తూ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో తెలిపిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఎలాంటి సిగ్గుఎగ్గూ లేకుండా చంద్రబాబునాయుడు నిర్మించిన ఇళ్లకు రంగులేసుకుని తానే కట్టినట్లు జగన్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
6.ఫీజు రీయింబర్స్ మెంట్
పేదల చదువుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని నమ్మబలికిన జగన్ రెడ్డి.. కుంటిసాకులతో లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించి ఆ మేరకు పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేశాడని అచ్చెన్నాయుడు ఆగ్రహం వెలిబుచ్చారు. చంద్రబాబునాయుడు హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించగా.. జగన్ రెడ్డి వారిని 10 లక్షల లోపునకు కుదించాడని తెలిపారు.
7.సాగునీటి ప్రాజెక్టులు
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తానని ఆడంబరాలు పలికిన జగన్ రెడ్డి.. తన బైబిల్ పలుకులకు భిన్నంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును అగమ్యగోచరం చేశాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఒక్క సంవత్సరంలో పోలవరాన్ని పూర్తిచేస్తామని చెప్పిన ఆ ఘనుడు ఈ హామీ అమలులో పూర్తి వైఫల్యం చెందలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చంద్రబాబు రూ.64 వేల కోట్లు ఖర్చుచేయగా.. ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి.. తెలుగుదేశం పూర్తిచేసిన సంగం ప్రాజెక్టుకు కేవలం రంగులేసి తానే చేశానని చెప్పుకునే దైన్యస్థితిలో ఉన్నారని.. సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడానికి, పులిచింతల గేట్లు ఊడిపోవడానికి కూడా కారణమయ్యారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
8.మద్య నిషేధం
నిషేధం మాట గాలికి వదిలేసి.. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ.. అందులోనూ కల్తీ మద్యాన్ని అస్మదీయుల ద్వారా విరివిగా అమ్మిస్తూ మాట తప్పను, మడమ తిప్పనూ అని పదేపదే చెప్పుకునే జగన్ తన నైజాన్ని వెల్లడించుకున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. మద్యాన్ని నిషేధిస్తామని ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి దానికి భిన్నంగా మద్యంపై రానున్న 25 సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి రూ.15వేల కోట్లు అప్పు తీసుకుని.. నిస్సిగ్గుగా చెప్పిందంతా చేశానని నమ్మబలకడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం అని ఆయన అన్నారు.
9.చేయూత/అసరా
గతంలో డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేసి, పసుపు-కుంకుమ కింద ప్రతి మహిళను చంద్రబాబు ఆదరించగా.. ఇచ్చిన హామీకి భిన్నంగా 70% మహిళలకు జగన్ రెడ్డి అన్యాయం చేశాడని, అదే విధంగా 45-59 సంవత్సరాల వయసు గల మహిళలకు పింఛన్లు ఇస్తామని చెప్పి మోసగించిన జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని బుకాయిస్తున్నాడని అచ్చెన్నాయుడు ఆగ్రహించారు.
నవరత్నాల మొత్తం 40 హామీల అమలును క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నామని.. తాము వెల్లడించిన వాస్తవాలపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉన్నాయా అని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. చర్చకు సమయం, స్థలం వారే నిర్ణయించుకుని తెలియజేయాలని సూచించారు.
మద్యం నగదు విక్రయాలపై ఈడీ కేసు పెట్టాలి
నేటి డిజిటల్ పేమెంట్ల తరుణంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులతో జగన్ రెడ్డి ప్రభుత్వం మద్యాన్ని అమ్మడంపై కేంద్ర సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ వెంటనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై కేసు నమోదుచేసి ఈ బాగోతం నిగ్గుతేల్చాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. భారీ నగదు విక్రయాలతో పెద్దఎత్తున మనీలాండరింగ్ జరుగుతున్నందున ఈడీ రంగంలోకి దిగాలని ఆయన అన్నారు. కల్తీ మద్యం విరివిగా సరఫరా జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేల్లో మద్యం ప్రియులైన 72 శాతం జగన్ రెడ్డి అమ్మిస్తున్న మద్యాన్ని సేవించగలరా అని రామయ్య ప్రశ్నించారు. నాసిరకం జే-బ్రాండ్ ల మద్యం తాగి పెద్దఎత్తున మరణాలు సంభవించడంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన కోరారు.
జగన్ ఏలుబడిలో తయారయ్యేది రౌడీలు, ఖైదీలు మాత్రమే
అమ్మఒడి పథకంతో తమ ప్రభుత్వం ఇంటికొక సత్య నాదెళ్లను తయారుచేస్తుందని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. అవినీతితో కూడిన ఆయన ఏలుబడిలో రౌడీలు, ఖైదీలు మాత్రమే తయారవుతారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 6093 నెంబర్ తో దీర్ఘకాలం జైల్లో ఉన్న జగన్ రెడ్డి అంతకుమించి ఏం సాధించగలరని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ఐటీ రంగాన్ని విస్తరింపజేయడం వల్ల సత్య నాదెళ్ల లాంటి వాళ్లు ముందుకు వచ్చారని.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పూర్తిగా విధ్వంసం చేసి యువతను మద్యం, గంజాయి, డ్రగ్స్ కు బానిసలను చేస్తున్న జగన్ కు అది ఏమాత్రం సాధ్యం కాదని ఆయన వక్కాణించారు.
ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, అనగాని సత్యప్రసాద్, పరుచూరి అశోక్ బాబు, నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.