– రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సుభాష్
– సిబ్బంది హాజరు పట్టీని తనిఖీ చేసి అసహనం వ్యక్తం చేసిన మంత్రి సుభాష్
– రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా
– విధులకు గైర్హాజరైన సూపరింటెండెంట్ సహా వైద్యులకు మెమోలు జారీ చేయాలని మంత్రి సుభాష్ ఆదేశాలు
– మంత్రి ఆకస్మిక తనిఖీతో ఉరుకులు పరుగులు పెట్టిన సిబ్బంది
రాజమండ్రి: ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. సోమవారం రాజమండ్రి లోని ఈఎస్ఐ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఉద్యోగుల హాజరు పట్టిను పరిశీలించి సక్రమంగా విధులకు కాని, గైర్హాజరైన ఉద్యోగుల తీరుపై మండిపడ్డారు. రోగులకు అందాల్సిన సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, మరి కొంతమంది సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు చార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశాలు జరిచేశారు. పనితీరు మార్చుకోకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలుత ఈఎస్ఐ హాస్పిటల్ కి చేరుకున్న మంత్రి సుభాష్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పారిశుధ్యం నిర్వహణ, సిబ్బంది రోగులు పట్ల అనుసరిస్తున్న తీరు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సిబ్బంది హాజరు పట్టిని క్షుణంగా పరిశీలించారు. కొంతమంది సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తుందని, దీనిలో భాగంగా రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రోగుల సౌకర్యార్థం ఆసుపత్రికి అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే సమకూరుస్తామని హామీ ఇచ్చారు.