Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు ధిక్కార వ్యాఖ్యలపై చర్యలు ఉండవా?

అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ప్రశ్న

రాజధాని అమరావతి పై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీ పై స్టే ఇవ్వకపోయినా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు మంత్రులు మూడు రాజధానుల పై పదే పదే చేస్తున్న కోర్టు ధిక్కార వ్యాఖ్యలపై చర్యలు ఉండవా? అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణ రాయబారంలో ఒకటి, రెండు, మూడు శ్రీకృష్ణుల్లా ఒకరిని మించి మరొకరు పదే పదే మూడు రాజధానులు పెట్టి తీరుతాం, విశాఖపట్నం వెళ్లి తీరుతాం అంటూ మంత్రులు మాట్లాడటాన్ని కోర్టులు సుమోటుగా స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

ఒకపక్క న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తాం అంటూనే, మరోపక్క న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు వక్రభాష్యం చెప్పి ప్రజలకు మూడు రాజధానులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు లేదు అని మాజీ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో చెప్పినా, మళ్లీ న్యాయ రాజధాని అనటంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు రక రకాలుగా చేస్తున్న ప్రచారాన్ని కోర్టులు అదుపు చేయకపోతే న్యాయస్థానాల పట్ల నమ్మకం పోతుందని గుర్తు చేశారు.

ఉనికిలో లేని, కనిపించిన మూడు రాజధానుల గూర్చి ప్రచారం చేస్తూ ప్రజల్లో ప్రాంతీయ వైషమ్యాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సభలు పరదాలు,బారికేడ్ల దశ దాటి కందకాలు తవ్వుకునే దుస్థితికి వచ్చారని చెప్పారు. రాజులు తమ కోట బురుజులవైపు ఎవరూ రాకుండా కందకాలు తవ్వేవారని, అందులో నీళ్లు పోసి ముసళ్ళను, పాములను పెంచేవారని చరిత్ర లో చదువుకున్నామని, ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి సభ నుంచి జనం పారిపోకుండా కందకాలు తవ్వటం ఏమిటి అన్నారు.

30 ఏళ్ళు అధికారంలో ఉంటామని,175 సీట్లు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన వైకాపా నాయకులు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. కందకాల సలహా ఇచ్చిన సలహాదారుల పేర్లు అయినా చెప్పాలని కోరారు. మూడు, మూడు అంటూ పట్టుకుని వేలాడితే మేలు జరగబోదని హితవు పలికారు.ఇప్పటికైనా మూడు రాజధానులపై నోరు మూసుకోవాలని బాలకోటయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE