-శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఆదేశాలు
మైలవరం నియోజకవర్గ పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్.ఎస్.పి) కాల్వలపై ఇటీవల అకాల వరదల ధాటికి పడిన గండ్లు పూడ్చివేతకు యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మైలవరం పట్టణంలోని శాసనసభ్యులు వారి కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఎన్.ఎస్.పి అధికారులతో సోమవారం ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ… కొండపల్లి మేజర్, జక్కంపూడి మేజర్, చెవుటూరు మేజర్, వెల్వడం మేజర్, జమలాపురం మేజర్, రంగాపురం మేజర్, నూజివీడు, మైలవరం బ్రాంచ్ కాల్వలకు ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు పలుచోట్ల గండ్లు పడ్డాయన్నారు. దాని కారణంగా ఆయకట్టుకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు.
గండ్లు పూడ్చివేతతో ఎన్.ఎస్.పి జలాలు సవ్యంగా సరఫరా అయ్యేవిధంగా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నవంబర్ 15 నుంచి సాగర్ జలాలు విడుదల చేయనున్న దృష్ట్యా ఎటువంటి ఆటంకాలు లేకుండా కాల్వలకు మరమ్మత్తులు చేపట్టి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సాగునీరు సరఫరా చేసి చెరువులను నింపాలన్నారు.
రైతులతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్.ఎస్.పి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, తదితర అధికారులు, స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.