Suryaa.co.in

Telangana

కార్యకర్తలే భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి కొండంత అండ

– మీకు ఏ అవసరం ఉన్నా నేను ఎల్లవేళలా అండగా ఉంటా
– గెలిచినా…ఓడినా నిరంతరం ప్రజల మద్యనే ఉన్నా

ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించాలన్న కార్యకర్తలే పునాది అని…అలాంటి కార్యకర్తలే భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి కొండంత అండ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజి లోని SVIT ఆడిటోరియంలో నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ BRS పార్టీ ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా తెలంగాణా తల్లి చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించి BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమరవీరుల మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో 13 తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని BRS పార్టీ కి చెందిన ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో గౌరవంగా, తలెత్తుకొనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. ఆదర్శవంతమైన పాలనను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇది మనందరికీ గర్వకారణం కదా అన్నారు. మీకు ఏ అవసరం ఉన్నా నేను ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రకటించారు. ప్రజలకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పని చేసే వారిని ఆదరించాలని, లేదంటే ప్రజలే నష్టపోతారనే విషయాన్ని గ్రహించాలని కోరారు.

GHMC ఎన్నికలలో BRS పార్టీకి చెందిన కార్పొరేటర్ అభ్యర్ధులను ఓడించినా వారు నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అంకితభావంతో పని చేసే పార్టీ BRS పార్టీ అని అన్నారు. గెలిచిన కార్పొరేటర్ లు ఇప్పటి వరకు ఒక్క రూపాయి అభివృద్ధి పనులైన చేశారా? అని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలన్నా…అభివృద్ధి పనులు చేయాలన్నా అది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేస్తుందని చెప్పారు.

తాను 32 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నానని, గెలిచినా…ఓడినా నిరంతరం ప్రజల మద్యనే ఉన్నానని ఆపదలో ఉన్న అనేకమందికి ఎంతో సహాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాను విమర్శలను పట్టించుకోనని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. గతంలో సనత్ నగర్ నియోజకవర్గం నుండి MLAలుగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చేయని అభివృద్దిని 2014 తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ల సహకారంతో వందల కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వివరించారు.

నియోజకవర్గ పరిధిలో అనేక రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, అనేక దేవాలయాల నిర్మాణం చేసిన విషయాన్ని వివరించారు. ఇవే కాకుండా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకొనే వారికి త్వరలో ప్రభుత్వం 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా వెనుకాడబోమని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను సమానంగా ఆదరిస్తూ గౌరవిస్తుందని చెప్పారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వార్ లు ఇలా అన్నింటా అవసరమైన అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. కానీ BJP పార్టీ ప్రజలను కులాలు, మతాల పేరుతో విభజించి రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి నిజాయితీ గురించి మాట్లాడటం, ప్రమాణాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఇంచార్జి దాసోజు శ్రవణ్ కుమార్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, డివిజన్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు PL శ్రీనివాస్, అశోక్ యాదవ్, జయరాజ్, సరాఫ్ సంతోష్, ఫహీం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE