– 2002లో బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహం
– అటల్ నిరాకరించడంతో తెరపైకి కలాం పేరు
– వాజపేయి మీడియా అడ్వైజర్ అశోక్ వెల్లడి
– ‘అటల్ స్మరణ్’ పుస్తకంలో సంచలనాలు
న్యూఢిల్లీ:దేశ రాజకీయ చరిత్రలో ఎవరికీ తెలియని ఒక సంచలన రహస్యం ఇప్పుడు బయటపడింది. రెండు దశాబ్దాల క్రితమే బీజేపీలో పెను మార్పులకు పునాది పడిందని… అప్పట్లోనే అద్వానీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని కాషాయ దళం మాస్టర్ ప్లాన్ వేసిందని వెల్లడైంది.
అటల్ బిహారీ వాజపేయి మీడియా సలహాదారు అశోక్ టండన్ రాసిన అటల్ స్మరణ్ పుస్తకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. అబ్దుల్ కలామ్ పేరు తెరపైకి రాకముందే జరిగిన ఈ హైడ్రామా వివరాలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఖరారైన అద్వానీ పట్టాభిషేకం…
2002లో అబ్దుల్ కలామ్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందే బీజేపీ పెద్దలు ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. అప్పటికే ప్రధానిగా ఉన్న వాజపేయిని రాష్ట్రపతి భవన్కు పంపి… ఆయన వారసుడిగా లాల్ కృష్ణ అద్వానీకి ప్రధాని పగ్గాలు అప్పగించాలని పార్టీ గట్టిగా భావించింది.
అద్వానీకి పట్టాభిషేకం చేసేందుకు ఇదే సరైన సమయమని పార్టీలోని కీలక నేతలు భావించడమే కాకుండా… ఈ మేరకు వాజపేయి ముందు ప్రతిపాదన కూడా ఉంచారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న వాజపేయి దీన్ని అంగీకరించి ఉంటే దేశ రాజకీయ ముఖచిత్రం మరోలా ఉండేదని అశోక్ టండన్ తన పుస్తకంలో వివరించారు.
తిరస్కరించిన అటల్ బిహారీ వాజపేయి…
పార్టీ నేతల ప్రతిపాదనను వాజపేయి అత్యంత ధైర్యంగా తోసిపుచ్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులతో మెజారిటీ సాధించి ప్రధాని అయిన వ్యక్తి ఇలా రాష్ట్రపతి పదవికి వెళ్లడం ఏమాత్రం మంచి సంప్రదాయం కాదని ఆయన తెగేసి చెప్పారు. అలాంటి పనికి తను అస్సలు మద్దతు ఇవ్వనని ఆయన కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. జనాదరణ ఉన్న నేతగా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆయన నిర్ణయించుకోవడంతో అద్వానీ ప్రధాని కల నెరవేరలేదు.
కలామ్ వైపు మళ్ళిన కన్ను
ఈ ఆసక్తికర పరిణామాల తర్వాతే వాజపేయి విపక్షాలతో చర్చలు జరిపి రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం కసరత్తు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీలను స్వయంగా ఆహ్వానించి చర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగానే అబ్దుల్ కలామ్ పేరును ఎన్డీఏ అభ్యర్థిగా ఖరారు చేశారు.
