Suryaa.co.in

Andhra Pradesh

సలహాదారులా… జగన్ రెడ్డి అవినీతికి సహకరిస్తున్న దోపిడీదారులా?

* తాడేపల్లి జీతగాడు సజ్జల మొదలు ప్రభుత్వంలోని సలహాదారుల జాబితా 100కు పైనే. వారికోసం ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి రూ.250కోట్ల ప్రజలసొమ్ము తగలేశాడు.
• సలహాదారులకు దోచిపెడుతూ, ఉద్యోగుల జీతాలకు డబ్బుల్లేవంటున్నాడు. మరోపక్క వృద్ధులు, వికలాంగుల పింఛన్లకు కోతపెడుతున్నాడు.
• నాఎస్సీలు, నాఎస్టీలు, నాబీసీలు, నామైనారిటీలు అని ఉపన్యాసాలిచ్చే జగన్ రెడ్డి, సలహాదారుల్లో రెడ్లకే అగ్రతాంబూలం ఎందుకిచ్చాడు?
• ఇతరవర్గాల్లో మేథావులు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, వైద్యులు లేరా… లేక జగన్ కు సలహాలిచ్చే స్థాయి వారికి లేదా?
• వైసీపీవారై ఉండి, జగన్ రెడ్డికి ఊడిగం చేస్తూ, ఆయన చీకటి వ్యాపారాల్ని కాపాడటమేనా సలహాదారులకు కావాల్సిన అర్హతా?
• తాను నియమించిన సలహాదారులతో ప్రజలకు, ప్రభుత్వానికి ఈ నాలుగేళ్లలో ఏం ఒరిగిందో చెబుతూ, జగన్ రెడ్డి తక్షణమే నివేదిక విడుదల చేయాలి.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

రాష్ట్ర హైకోర్టు సలహాదారుల నియామకంపై తీవ్రమైన వ్యాఖ్యలుచేసినా జగన్ రెడ్డికి సిగ్గులేద ని, తనకు ఊడిగంచేస్తూ, తన చీకటివ్యాపారాల్ని కాపాడుతూ, తాను చెప్పినట్టు వినేవారినే ముఖ్యమంత్రి సలహాదారులుగా నియమిస్తున్నాడనీ, ప్రజలు, రాష్ట్రంకోసం పనిచేయాలన్న ఆలోచన ఇసుమంతైనా ఆయన, ఆయన సలహాదారుల్లో లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“రాష్ట్ర హైకోర్టు నిన్న ప్రభుత్వసలహాదారులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. “సలహాదారుల నియామకం ప్రమాదకరం, సమాంతరప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినట్టు అవుతుంది, ఉద్యోగుల సంక్షేమానికి కూడా సలహాదారా, టీఏ, డీఏలు ఇచ్చేందుకు కూడా సలహాదారుల్ని నియమిస్తారేమో” అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ అత్యున్నతన్యాయస్థానం అంతటి వ్యాఖ్యలుచేసినా జగన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదు. జగన్ రెడ్డి సలహాదారు వ్యవస్థని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చాడు. గతంలో ప్రభుత్వాలు, వివిధరంగాల్లో నిష్ణాతులైన వారై ఉండి, ప్రజలకు రాష్ట్రానికి మేలుచేసేవారినే సలహదారులుగా నియమించేవి, ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో అలాంటి వారున్నారు.

సలహాదారులకు 4, 5లక్షల జీతాలు, కార్లు, సిబ్బంది, హంగులు, ఆర్భాటాలు… వారివల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఒరిగింది మాత్రం శూన్యం
వైసీపీప్రభుత్వం మాత్రం సలహాదారుల పదవుల్ని రాజకీయ పునరావాసానికి మాత్ర మే వినియోగిస్తోంది. ఈ ప్రభుత్వంలోని సలహాదారులకు భారీప్యాకేజ్ లు, కేబినెట్ ర్యాంక్ హోదాలు, ప్రతి ఒక్కరికీ 4, 5లక్షల జీతాలు, సిబ్బంది, వాహనాలు, హంగులు, ఆర్భాటాలు. ఇన్ని సమకూర్చి వారివల్ల ప్రజలకు, ప్రభుత్వానికి ఏమైనా మేలు జరు గుతుందా అంటే.. శూన్యమనే చెప్పాలి. మరోపక్క ఉద్యోగులేమో తమకు జీతాలు ఇప్పించమని గవర్నర్ ని కలిసి ప్రాధేయపడే పరిస్థితి. వారికి ఎప్పుడు జీతం వస్తుందో తెలియని స్థితి. నెలమొత్తం కష్టపడే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వంలో జీతాలు నిల్, ఎందుకూ పనికిరాని సలహాదారులకు మాత్రం అన్నీఫుల్. సలహాదారులకు కోట్లరూపాయలు దోచిపెడుతున్న ప్రభుత్వం ఇతర సమస్యల్ని పట్టించుకుంటుందా అంటే అదీలేదు. ధాన్యంకొనుగోళ్లు చేయలేని దుస్థితిలో ప్రభుత్వముంది. ధాన్యం ఎలుకలు తింటున్నా, తడిచి కుళ్లిపోతున్నా, కొనేనాథుడే లేడు.

ఎందుకూ పనికిరాని వారికి లక్షలకొద్దీ జీతాలిస్తున్న ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే అరకొర సామాజిక పింఛన్లు మాత్రం దారుణంగా తొలగిస్తోంది. జగన్ రెడ్డికి సలహాదారులపై ఉన్న ప్రేమ, అవ్వాతాతలపై లేదా? వైసీపీవారై, జగన్ రెడ్డి చీకటి వ్యాపారాల్ని కాపాడుతూ, ఆయనకు ఊడిగంచేస్తే చాలు.. సలహాదారులకు సకలభోగాలే. ఇప్పటికే సలహాదారులు జాబితా 100దాటింది. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున వేసుకున్నా, ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి వారికోసం రూ.250కోట్లు తగలేశాడు. ఇన్నివందలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి, సలహాదారుల వ్యవస్థతో జగన్ రెడ్డి ఏంసాధించాడు? సలహాదారుల పనితీరుతో రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఒరిగిందో తెలియచేస్తూ, తక్షణమే ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్ విడుదల చేయాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.

సజ్జల మొదలు సలహాదారులంతా రెడ్లేనా? ఎస్సీఎస్టీలు, బీసీలు, మైనారిటీలు జగన్ రెడ్డికి సలహాలివ్వడానికి పనికిరారా?
తాడేపల్లి ప్యాలెస్ ప్రధాన జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు ఈ సలహాదారుల జాబితా కొండవీటి చాంతాడునే మించిపోయింది. అజయ్ కల్లంరెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, పద్మజారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లోకేశ్వర రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బీ.ఎస్.ఎన్.రెడ్డి, గోవిందరెడ్డి, భరత్ రెడ్డి, వీరారెడ్డి, నాగార్జున రెడ్డి, ధనుంజయ రెడ్డి, నాగిరెడ్డి, చంద్రహాస్ రెడ్డి, మదుసూదన్ రెడ్డి, సాంబ శివారెడ్డి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి.. వీళ్లా నీ సలహాదారులు? నీ సొంత సామాజిక వర్గం వారుతప్ప, నీకు సలహాలు ఇవ్వడానికి ఇతరులు పనికిరారా? నాఎస్సీలు, నాఎస్టీలు, నా బీసీలు అని కబుర్లు చెబుతావుగా జగన్ రెడ్డి.. లక్షల రూపాయలు జీతాలిచ్చి, సలహాదారులుగా పెట్టుకోవడానికి వారు పనికిరారా? ఎస్సీలు, మైనారిటీ లు, బీసీలు ఎవరూ సలహాదారులుగా ముఖ్యమంత్రికి పనికి రాలేదా? ఆయావర్గాల్లో మేథావులు, సైంటిస్ట్ లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, ఇతరత్రా నిపుణులు లేరా జగన్ రెడ్డి? నీ వర్గం వారు మాత్రమే నీ దృష్టిలో మేథావులా? ముఖ్యమంత్రి చెప్పేమాటలకు చేసే పనులకు ఎంత తేడా ఉందో సలహాదారుల జాబితా చూశాకైనా ప్రజలు అర్థంచేసుకోవాలి.

పేరుకే సలహాదారులు.. చేసేదంతా జగన్ రెడ్డికి అవినీతిసొమ్ము పోగేయడం…ఆయన దోపిడీకి సహకరించడం
జగన్ రెడ్డి సలహాదారులతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఐటీ సలహాదారు. కానీ ఆయన చేసే పని రాష్ట్రంలోని లిక్కర్ కంపెనీలతో మద్యవర్తిత్వం నెరపడం, మద్యం దుకాణాల నుంచి జగన్ ఖజానాకి రోజుకి ఎంతొస్తుంది? ఏఏ కంపెనీ ల నుంచి ఎంతమద్యం కొనాలి..ఎవరివద్ద నుంచి ఎంత కమిషన్ తీసుకోవాలి ఇవీ ఆయన పనులు. రాజశేఖర్ రెడ్డి నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క ఐటీ కంపెనీ అయినా తెచ్చాడా? ఐటీసలహాదారనే ట్యాగ్ తగిలించుకొని తాడేపల్లి కొంపకు మద్యంఅమ్మకాల సొమ్ము తరలించడంతోనే ఆయనకు సరిపోతోంది. వీ.ఎన్.భరత్ రెడ్డి.. ఈయన ఏవియే షన్ సలహాదారు.

తాడేపల్లి ప్యాలెస్ లోని బ్లాక్ మనీని గన్నవరం విమానాశ్రయం నుం చి వివిధదేశాలకు పంపించడమే భరత్ రెడ్డి పని. ఏరోజు ఏ సమయానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అవినీతిసొమ్ముని ఏఏ దేశాలకు పంపించాలి…అందుకు అవసరమైన విమానాలు ఎక్కడినుంచి రప్పించాలన్నదే ఈయన ప్రణాలిక. ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారు వీరారెడ్డి, ఈయన కాకుండా ఇంకా 5గురు సలహా దారులున్నారు. వారంతా రాష్ట్రానికి ఎన్నిపరిశ్రమలు తెచ్చారయ్యా అంటే సమాధానం లేదు. ఆఖరికి ఈ ప్రభుత్వానికి దావోస్ సదస్సుకి డెలిగేషన్ కూడా లేదుకదా! తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు దావోస్ కు వెళ్లి, పెట్టుబడులు తెచ్చు కుంటే, ఏపీప్రభుత్వం, పరిశ్రమలశాఖలోని సలహాదారులు చోద్యంచూస్తూ కూర్చున్నారు.

ఉన్నపరిశ్రమలు రాష్ట్రంనుంచి వెనక్కు వెళుతుంటే, ఈ ప్రభుత్వం లోని పరిశ్రమల సలహాదారులు గడ్డిపీకుతున్నారా? జుల్ఫీ రావుడి..ఈయన మిడిల్ ఈస్ట్ దేశాలకు రాష్ట్రంతరుపున ప్రత్యేకప్రతినిధి. ఈయన చేసేది శూన్యమే. రిసోర్స్ మొబిలైజేషన్ సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్ పని అప్పులు తీసుకురావడం. ఏ బ్యాంక్ నుంచి ఎంతవడ్డీకి అప్పులు తేవాలి.. ఏ ఆస్తులు తాకట్టుపెట్టాలన్నదే ఈయని చ్చే సలహాలు. అప్పులు లేనిదే ఈప్రభుత్వం నడవదుకదా! ఇప్పటికే రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు దాటిపోయాయి. చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యోగుల సంక్షేమ సలహాదారుడట.. గతంలో ఈయన ఉద్యోగ సంఘం నేత. ప్రతినెలా జీతాలకోసం సెక్రటేరియట్ చుట్టూ చక్కర్లు కొట్టడమేనా ఉద్యోగుల సంక్షేమం అంటే? ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500కోట్లు ప్రభుత్వం కొట్టేస్తుంటే, చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారు?

తనవర్గానికి చెందిన వారైతే, తనచీకటి వ్యాపారాలను సక్రమంగా ముందుకు తీసు కెళ్తారనే జగన్ రెడ్డి సలహాదారులుగా రెడ్లను పెట్టుకున్నాడు. ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ పెట్టిన ప్రభుత్వం, సలహాదారులకు ఎందుకు పెట్టదు? లక్షలజీతాలు తీసుకునే సలహాదారులకు ఫేస్ రికగ్నైజేషన్ ఉండదా? ఉద్యోగులు సమయానికి రాకపోతే, జీతాల్లో కోతపెడతామంటున్న ప్రభుత్వం, సలహాదారులకు కూడా అదే నిబంధన అమలుచేస్తుందా? ఏఏ సలహాదారుడు ఎన్ని రోజులు కార్యాలయాల్లో ఉన్నారు.. సెక్రటేరియట్ కు ఎప్పుడు వస్తున్నారు… వారివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఒరిగుతోందనే పూర్తివివరాలు బయటపెట్టండి. అప్పుడు తేలుతుంది ఈ సలహాదారు ల బాగోతం.

రాష్ట్రప్రభుత్వం సలహాదారుల వ్యవస్థను భ్రష్టుపట్టించింది. రాష్ట్ర అత్యున్న త న్యాయస్థానం చీవాట్టు పెట్టినా పాలకుల్లో చలనంలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా గతంలో కొందరు సలహాదారులుగా పనిచేశారు. కానీ వారంతా వివిధరంగాల్లో నిష్ణాతులై ఉండి, ప్రజలకోసం, ప్రభుత్వంలో భాగమై పనిచేశారు. సలహాదారుల వ్యవస్థ అనేది జగన్ ప్రభుత్వానికి, ప్రజలకు మోయలేని గుదిబండే” అని పట్టాభి అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE